తుంటరి కోతి ఆలోచన!

జనావాసాలకు దూరంగా ఒక పెద్ద కొండ ఉంది. దానికి ఒకవైపు చిన్న అడవి, మరోవైపేమో పెద్ద అడవి ఉన్నాయి. చిన్న అడవిలో జింకలు, లేళ్లు, కుందేళ్లు, కోతులు, రకరకాల పక్షులు ఉండేవి. వేటాడే పెద్ద జంతువులు లేకపోవడంతో అవి చాలా స్వేచ్ఛగా జీవించేవి.

Updated : 16 Dec 2023 05:00 IST

నావాసాలకు దూరంగా ఒక పెద్ద కొండ ఉంది. దానికి ఒకవైపు చిన్న అడవి, మరోవైపేమో పెద్ద అడవి ఉన్నాయి. చిన్న అడవిలో జింకలు, లేళ్లు, కుందేళ్లు, కోతులు, రకరకాల పక్షులు ఉండేవి. వేటాడే పెద్ద జంతువులు లేకపోవడంతో అవి చాలా స్వేచ్ఛగా జీవించేవి. కోతులకు సహజంగానే ఆకతాయితనం ఎక్కువ. అందులో ఒక కోతి దాని తుంటరి చేష్టలతో అల్లరి కోతిగా పేరు తెచ్చుకుంది. పెద్ద అడవిలో అన్నీ క్రూర జంతువులే ఉండేవి. ఒకరోజు అందులోని ఒక సింహం నడుస్తూ నడుస్తూ.. చిన్న వనంలోకి ప్రవేశించింది. అక్కడున్న జీవాల్ని చూసి దానికి చాలా ఆనందమేసింది. అవన్నీ ఎలాంటి భయం లేకుండా ఎంచక్కా తిరగడం గమనించిన సింహం.. అక్కడ వేటాడే జంతువులేవి లేవని గ్రహించింది. ‘అంత దూరం నుంచి నడుచుకుంటూ వచ్చాను. కాసేపు విశ్రాంతి తీసుకొని, అప్పుడు ఈ జంతువులను వేటాడాలి’ అనుకుంటూ చెట్టు కింద కూర్చొని, మెల్లగా నిద్రలోకి జారుకుంది. అదే చెట్టు మీద కూర్చున్న కోతి, దాని మాటలు విని ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వెంటనే వెళ్లి మిగతా జంతువులన్నింటికీ విషయం చెప్పింది. అవన్నీ ప్రాణభయంతో వణికిపోసాగాయి.

వాటికి ఈ ప్రమాదం నుంచి ఎలా తప్పించుకోవాలో అస్సలు తోచడంలేదు. ఏం జరుగుతుందో తెలియక, కొన్ని జంతువులు బిడ్డల్ని దగ్గరకు తీసుకొని ఏడుస్తున్నాయి. అప్పుడు ఓ లేడి.. ‘నిద్రలేచేలోగా ఆ సింహాన్ని మనమే చంపేస్తే?’ అంది. ‘మనకి అంత ధైర్యం, బలం ఎక్కడున్నాయి.. అది మన వల్ల కాని పని’ అని జవాబిచ్చింది, జింక కన్నీరు కారుస్తూ. ‘పోనీ నేను పక్కనే ఉన్న గ్రామంలోకి వెళ్లి మనుషులను పిలుచుకురానా? వారు నిప్పు చూపి తరుముతారు. లేకపోతే వలపన్ని దాన్ని బోనులో వేస్తారు. మనుషులు దేంట్లోనైనా సమర్థులని మా అమ్మ చెప్పేది’ అంది చిలుక. ఇప్పుడు మనకు అంత సమయం లేదు కదా! అదీ కాక మనుషులకు మన ఉనికి తెలియడం వల్ల, మన స్వేచ్ఛకూ, ప్రాణాలకూ ప్రమాదం కలిగే అవకాశం లేకపోలేదు’ అని చెప్పింది నెమలి. అక్కడే ఉండి ఇవన్నీ వింటున్న కోతి నెమ్మదిగా ‘నాకు ఒక ఆలోచన వచ్చింది’ అంటూ.. ఆ ఉపాయాన్ని వివరించింది.

పథకం ప్రకారమే.. కోతి మళ్లీ సింహం పడుకున్న చెట్టు కొమ్మల్లో కూర్చొని, దాన్ని గమనించసాగింది. దానికి మెలకువ వస్తూ కాస్త కదలగానే.. చిలుకతో ‘ఇప్పుడు మరో సింహం వచ్చింది. ఇది కూడా ఇంతకు ముందు వచ్చిన దానిలా చచ్చిపోబోతుంది. అది తెలియక హాయిగా నిద్రపోతున్న దీన్ని చూస్తుంటే పాపం జాలేస్తోంది’ అంది. ‘అవునా? నాకు ఏమీ అర్థంకావట్లేదు. ఇంత పెద్ద జంతువు ఎందుకు చనిపోతుంది? అసలు మొదటి సింహం ఎలా మరణించింది?’ అని కావాలనే అడిగిందా చిలుక. ఈ సంభాషణ వింటున్న సింహానికి ఒక్కసారిగా నిద్రమత్తు ఎగిరిపోయింది. కోతి జవాబు కోసం ఊపిరి బిగబట్టి చెవులు రిక్కించి వినసాగింది. ‘నీకు తెలియదు కదా! ఈ అడవిలో విషం కాయల చెట్లున్నాయి. ఆ మధ్య సింహం రావడంతో జంతువులన్నీ ఆ కాయలను నోటితో పట్టుకున్నాయి. సింహానికి ఆహారంగా దొరికిపోయిన జింక వెంటనే ఆ కాయని నమిలి మింగేసింది. మిగిలినవి మాత్రం ఉమ్మేశాయి. ఆ జింకను తిన్న సింహం ఒళ్లంతా విషపూరితమై, గిలగిలా కొట్టుకుని నురగలు కక్కుతూ ప్రాణాలు విడిచింది. అలా ఒక్క జింక త్యాగంతో మిగిలిన జంతువులు ప్రాణాలతో బయటపడ్డాయి.

ఈరోజు ఈ సింహం రాకను గమనించి అన్ని జీవులూ నోటిలో విషం కాయతో సిద్ధంగా ఉన్నాయి’ అంది కోతి. ‘ఓహో! అయితే.. సింహం లేచి వేటాడితే దానికి మరణమేనన్నమాట. కొమ్మల్లో కూర్చుని మేమంతా చూస్తాం’ అంది నెమలి ఉత్సాహంగా. ఈ మాటలు విన్న సింహానికి పై ప్రాణాలు పైనే పోయాయి. ‘అమ్మో.. ఈ అడవిలో ఏ జంతువునూ వేటాడకూడదు. వీలైనంత తొందరగా ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి’ అనుకుంటూ.. ఏ జంతువు వైపూ చూడకుండా, దాని అడవి దారి పట్టింది. దాంతో వనంలోని ప్రాణులన్నీ కేరింతలు కొట్టాయి. అల్లరిదే అయినా, బుద్ధిబలంతో అపాయం నుంచి తప్పించిన కోతికి జంతువులన్నీ కృతజ్ఞతలు తెలిపి, దాన్నే అడవికి రాజుగా ప్రకటించుకున్నాయి. అప్పటి నుంచి కోతి కూడా తుంటరి స్వభావాన్ని వదిలేసి, బాధ్యతగా ప్రవర్తించసాగింది.

గుడిపూడి రాధికారాణి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని