కుందేలుకు ఎన్ని తెలివితేటలో..!

అదొక అడవి. చాలా కాలం నుంచి సింహమే పరిపాలన చేస్తోంది. కొంతకాలానికి మృగరాజు పరివారంలోకి భజనపరులైన నక్క, తోడేలు వచ్చి చేరాయి.

Published : 17 Jan 2024 00:09 IST

దొక అడవి. చాలా కాలం నుంచి సింహమే పరిపాలన చేస్తోంది. కొంతకాలానికి మృగరాజు పరివారంలోకి భజనపరులైన నక్క, తోడేలు వచ్చి చేరాయి. అప్పటి నుంచి అవి తమ పబ్బం గడుపుకోవడానికి కేసరికి స్వార్థపూరిత సలహాలు ఇస్తుండేవి. కష్టపడకుండా ఆహారం తన గుహకు వచ్చి చేరడంతో నక్క, తోడేలు సలహాలకు విలువిస్తుండేది సింహం. ఆ సలహాల పరంపరలో ఎన్నో జంతువులు చేయని నేరానికి ప్రాణాలను కోల్పోతుండేవి.
అన్యాయం జరిగినచోట ఐక్యత పుట్టుకొస్తుంది. ఇది లోకసహజం. ఈ విషయాన్ని నక్క, తోడేలు ముందుగానే ఊహించాయి. అందుకే అడవి జంతువులు ఎదురు తిరగకుండా వాటి బలహీనతలు గుర్తించి అందుకు అనుగుణంగా మృగరాజు ద్వారా హెచ్చరికలు జారీ చేయిస్తుండేవి. దీంతో జంతువులన్నీ మృగరాజు కంటపడకుండా.. దూరం, దూరంగా తిరుగుతుండేవి.
జంతువులు అందుబాటులో కనిపించకపోవడంతో నక్క, తోడేలు ఎత్తులు ఫలించడం లేదు. దీంతో అవి జంతువుల ప్రవర్తనపై మృగరాజుకు ఫిర్యాదు చేశాయి. ఒకింత అసహనానికి గురైంది సింహం. జంతువుల ప్రవర్తన అవమానంగా భావించిన సింహం చివరకు ఈ విషయంపై నక్క, తోడేలుతో సమావేశమై కొత్తగా ఆలోచన చేయమని ఆదేశించింది.
‘మృగరాజా! దాహం తీర్చుకోకుండా ఏ జంతువూ బతకలేదు. అడవి జంతువుల తిక్క కుదర్చాలంటే, ఈ అడవిలో ఉన్న ఒక్కగానొక్క కొలనుకు మీ పేరు పెట్టండి. అందులో ఎవరూ దిగరాదనే శాసనం చేయండి’ అని సలహా ఇచ్చింది నక్క. ‘నిజమే మృగరాజా! కాపలాగా మేముంటాం. ఎవరు కొలను నీటిని తాకినా, తాగినా మీ ఎదుట దోషులుగా నిలబెడతాం. అప్పుడు పంజా దెబ్బతో శిక్షిస్తే అవే దారికొచ్చి, మీ కనుసన్నల్లో బతుకుతాయి’ అని వంతపాడింది తోడేలు. సింహం కూడా సరేనంది.
ఈ విషయాన్ని దండోరా వేశాయి నక్క, తోడేలు. చాటింపు విన్న అడవి జంతువులు ముక్కున వేలేసుకున్నాయి. అందుకు తగ్గట్టుగా తమ పద్ధతి మార్చుకున్నాయి. ఇప్పుడు అడవి జీవులు దాహం తీర్చుకోవడానికి గ్రామాల వెంబడి వెళ్లడం ప్రారంభించాయి. రాను రాను మనుషుల దృష్టిలో పడిన కొన్ని జంతువులు ప్రాణాలు కోల్పోవడం పరిపాటైంది. వాటి పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు అయ్యింది. ఓ రోజు దాహాన్ని ఆపుకోలేక ఒక కుందేలు మృగరాజు కొలనులోకి దిగింది. అది నక్క, తోడేలు కంటపడడంతో కుందేలును అడ్డుకొని మృగరాజు దగ్గరకు తీసుకుపోయాయి.
ఆపదలో ఎదురయ్యే తీవ్రత గుర్తించిన కుందేలు తెలివిగా మసలుకోవాలనుకుంది. ‘మృగరాజా! దైవసమానులైన మీ కొలను నీటిని కుందేలు ఎంగిలి చేసింది’ అని ఫిర్యాదు చేశాయి నక్క, తోడేలు. మృగరాజు కోపంతో గర్జించింది. ‘ఆ కొలనులో నీరు మొదటి నుంచి ఎంగిలివే, కొత్తగా నేను ఎంగిలి చేసేది ఏముంది?’ అని వినయంగా సమాధానం చెప్పింది కుందేలు. ‘ఎవరెవరు ఎంగిలి చేశారో చెప్పు’ అని కోపంగా అడిగింది సింహం.  
‘కొలనులో నివసిస్తున్న చేపలు, కప్పలు, తాబేళ్లు’ అంటూ రుజువు చూపించింది కుందేలు. ‘అవి జలచరాలు, వాటి ఆవాసమే నీరు. అది తప్పు కాదు, మృగరాజు పాలనలో ఉన్న జంతువుగా నువ్వు చేసేదే తప్పు’ అంటూ కుందేలును ఇరకాటంలో పెట్టింది నక్క. ‘అంతేగా.. అంతేగా...’ అంటూ వంత పాడింది తోడేలు.
మృగరాజుకు మరింత కోపం పెరిగింది. జూలు విదిలించింది. ‘మృగరాజా! కొలనుకు కాపలాగా ఉంటున్న నక్క, తోడేలు తమ దాహం ఎక్కడ తీర్చుకుంటున్నాయో అడగండి’ అంది కుందేలు. ఈ మాటలు విన్న సింహం నక్క, తోడేలు వైపు చూసింది. ఏమి చెప్పాలో తెలియక నీళ్లు నమిలాయి నక్క, తోడేలు. ‘ఇక నుంచి మీరు కూడా ఆ నీరు తాగడానికి వీళ్లేదు. అలాగే కొలనులో ఉన్న చేపలు, కప్పలు, తాబేళ్లను తొందరగా బయటపడేసే మార్గం చూడండి’ అంటూ నక్క, తోడేలును ఆజ్ఞాపించింది సింహం. ‘మృగరాజా! మాకు ఈత రాదు’ అని తమ నిస్సహాయతను తెలియజేశాయి నక్క, తోడేలు.
‘అయితే ఎలా మరి?’ అని అడిగింది సింహం. ‘మృగరాజా! సమష్టి కృషి, సహకార భావమే అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది. ఈ విషయంలో జంతువుల సహాయం తీసుకుంటే చాలు’ అంది కుందేలు. ‘అది ఎలా?’ అని అడిగింది సింహం. ‘ఈ ఒడ్డున మీరు తాగితే, ఆవలి ఒడ్డున జంతువులు.. చేపలు, కప్పలు, తాబేళ్ల వేటకు శ్రీకారం చుడతాయి. అలా చేస్తే కొద్ది కాలానికి జలచరాలు లేని కొలను అవుతుంది. మీ కోరిక తీరుతుంది’ అని కుందేలు చెప్పింది. దాని వైపు కొరకొర చూశాయి నక్క, తోడేలు. ‘సరే... ఆ విధంగా దండోరా వేయించి కొలనులో జలచరాలను ఖాళీ చేయించండి..’ అంటూ నక్క, తోడేలుకు హుకుం జారీ చేసింది సింహం. నక్క, తోడేలు అవాక్కయ్యాయి. కానీ మృగరాజుకు ఎదురు చెప్పే సాహసం చేయలేకపోయాయి.
‘మృగరాజా! ఈ విషయాన్ని మీ మాటగా మిగతా జంతువులకు తెలియజేస్తాను. నాకు సెలవిప్పించండి’ అంటూ వినయంగా అడిగింది కుందేలు. ‘అలాగే అంటూ..’ కుందేలును వెళ్లమంది సింహం. కుందేలు ఈ విషయాన్ని అన్ని జంతువులకు టాం టాం వేసింది. అడవి జంతువులు కుందేలు ఎత్తును అర్థం చేసుకున్నాయి. అప్పటి నుంచి జంతువులన్నీ, జలచరాలను వేటాడే నెపంతో దాహం తీర్చుకోవడం అలవాటు చేసుకున్నాయి.

బి.వి.పట్నాయక్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు