ఊరు మారింది.. చెరువు నిండింది!

ఓ అడవికి దగ్గర్లో ఉండే చెరువుపైన ఆధారపడి.. ధవళవర్ణిక అనే కొంగ నివసిస్తోంది. అది ఒకసారి ఇంకో ప్రాంతానికి వలస వెళ్లింది. కానీ కొంతకాలానికి అక్కడి వాతావరణం సరిపడక, స్వస్థలానికే తిరిగొచ్చింది

Updated : 19 Jan 2024 03:58 IST

ఓ అడవికి దగ్గర్లో ఉండే చెరువుపైన ఆధారపడి.. ధవళవర్ణిక అనే కొంగ నివసిస్తోంది. అది ఒకసారి ఇంకో ప్రాంతానికి వలస వెళ్లింది. కానీ కొంతకాలానికి అక్కడి వాతావరణం సరిపడక, స్వస్థలానికే తిరిగొచ్చింది. ఆ ప్రాంతాన్ని చూసిన దానికి ఒక్కసారిగా ఆశ్చర్యమేసింది. ఎందుకంటే.. అక్కడ చెరువు లేదు. దాదాపు పూర్తిగా ఎండిపోయింది. ‘అయ్యో... చెరువు ఎందుకు ఇలా ఎండిపోయిందో అర్థం కావడం లేదు. ఇక్కడ నేను ఎలా బతకగలను?’ అంటూ బాధపడింది.

చెరువు చివర ఎక్కడో ఒకచోట కొంత నీరు కనిపించడంతో.. అక్కడికి వెళ్లిందా కొంగ. ‘ఓ చెరువూ... ఏమైంది నీకు? ఎందుకిలా ఎండిపోయావు?’ అని ప్రశ్నించింది. ‘వర్షం పడకపోతే నాకు ఉనికి ఉండదు. గత సంవత్సర కాలంగా వర్షం జాడ లేదు. అందుకే ఇలా నిర్జీవమై ఉన్నాను. ఈ ప్రశ్న ఏదో మేఘాలను అడుగు!’ అంది నీరసంగా చెరువు.

 వెంటనే కొంగ మేఘం దగ్గరకు వెళ్లింది. ‘ఏమిటి కొంగా.. ఇలా వచ్చావు. నాతో ఏమైనా పని ఉందా?’ అని అడిగింది మేఘం. ‘అవును.. సంవత్సరం నుంచి నువ్వు వర్షాన్ని కురిపించడం లేదని చెరువు అంది. కారణం ఏంటో తెలుసుకుందామని ఇలా వచ్చాను’ అని బదులిచ్చింది కొంగ. ‘ఓ.. అదా! నన్ను ఏం చేయమంటావు కొంగా...! నాలోకి నీరు చేరితేనే కదా నేను వర్షం కురిపించేది? ఈ ప్రాంతంలో ఎక్కడా చెట్లు లేవు. అవి లేకపోతే ప్రకృతిలో అసమతుల్యత ఏర్పడుతుంది. చెట్లు ఉంటేనే భూమి చల్లబడుతుంది. అందుకే తప్పంతా చెట్టుదే. ఈ ప్రశ్న చెట్టును అడుగు...’ అంది మేఘం.

 చెట్లను ఎలాగైనా ప్రశ్నించాలని కొంగ కిందకు వచ్చింది. ఎండ చుర్రుమనడంతో కళ్లు బైర్లు కమ్మాయి. చెట్టును వెతుక్కుంటూ బయలుదేరిన కొంగకు ఎట్టకేలకు ఓ వృక్షం కనిపించింది. ఆకులన్నీ రాలిపోయి దీనంగా ఉన్న చెట్టును చూసి కొంగ చలించిపోయింది. ‘అయ్యో.. ఏమైంది చెట్టమ్మా.. నీకు?’ అని ప్రశ్నించింది.
‘జనాలు తమ అవసరాల కోసం మమ్మల్ని నరికేస్తున్నారు. కానీ బతికించే ప్రయత్నం చేయడం లేదు. మా విత్తనాలు పక్షులు, జంతువుల ద్వారా ఇతర ప్రాంతాలకు చేరితేనే మా మనుగడ కొనసాగేది. పాపం ఆ పక్షులు, జంతువులు కూడా అంతరించేలా ఉన్నాయి. మా గురించి పట్టించుకునే వారే లేరు. ఈ ప్రాంతంలో నేను ఒక్కదాన్నే మిగిలాను. నా సహచర చెట్లన్నీ మనుషుల అవసరాలకు బలి అయ్యాయి’ అని దీనంగా అందా చెట్టు.
వృక్షం మాటలకు కళ్లలో నీళ్లు తిరిగాయి ధవళవర్ణికకు. తప్పంతా మనుషులదే అని అర్థమైంది. ఇక అక్కడి నుంచి బయలుదేరి.. సమీప గ్రామమైన చెరువుపల్లికి వెళ్లింది. అక్కడ రచ్చబండ దగ్గర చాలామంది కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. ‘అయ్యా.. నేను మీతో పాటు ప్రకృతిపైన ఆధారపడి జీవిస్తున్న ఒక ప్రాణిని. మీరంతా కలిసి మీ అవసరాల కోసం పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు. అందువల్ల ప్రకృతి సమతుల్యత దెబ్బతిని జీవకోటి మనుగడ పెను ప్రమాదంలో పడింది. సకాలంలో వర్షాలు పడక జీవులు నీటికోసం అల్లాడుతున్నాయి. మీరు చెట్లు నరకడం ఇకనైనా ఆపేయండి’ అంది కొంగ.
అక్కడ కూర్చున్న వారు కొంగ ధైర్యానికి ఆశ్చర్యపోయారు. దాని మాటల్లో నిజం తెలుసుకున్నారు. అక్కడే ఉన్న గ్రామ పెద్ద.. దాని దగ్గరకు వచ్చి, ‘కొంగా! నువ్వు చెప్పింది నిజం. చెట్లను ఇష్టానుసారంగా నరికేయడం వల్లనే ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి. వర్షాలు లేక భూగర్భజలాలు అడుగంటి నీటి కోసం మేమూ తిప్పలు పడుతున్నాం. ఇప్పుడే మా ఊరి వాళ్లమంతా లక్ష చెట్ల ఉద్యమం చేపడతాం. తిరిగి ప్రకృతికి ప్రాణం పోస్తాం’ అన్నాడు. దాంతో కొంగ సంతోషంగా వారికి కృతజ్ఞతలు చెప్పి వెళ్లిపోయింది.
మరుసటి రోజు నుంచే మొక్కలు నాటి, వాటిని సంరక్షించడం ప్రారంభించారు చెరువుపల్లి ప్రజలు. ఆ ఒక్క ఊర్లోనే కాకుండా సమీప గ్రామాల్లోనూ మొక్కలు నాటారు. ఆరు నెలల్లోనే పచ్చదనం పరుచుకుంది. మేఘాలు తమ స్నేహితులైన చెట్లను చూసి పరవశించి, వర్షాలు కురిపించాయి. చెరువు కూడా నిండింది. ఇక ధవళవర్ణిక ఎప్పటిలాగే చెరువులోకి సంతోషంగా వెళ్లింది.

- వడ్డేపల్లి వెంకటేష్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు