మన ఆరోగ్యం... మన చేతుల్లోనే!

సింహగిరిని జయంతుడు పాలించేవాడు. ఉచితం పేరుతో నిరుద్యోగులైన యువకులకు నిరుద్యోగభృతి ప్రకటించాడు. దానితో ఒక మాసంలోనే యువకులంతా పనీపాటా లేకుండా సోమరులుగా మారారు.

Published : 22 Jan 2024 00:28 IST

సింహగిరిని జయంతుడు పాలించేవాడు. ఉచితం పేరుతో నిరుద్యోగులైన యువకులకు నిరుద్యోగభృతి ప్రకటించాడు. దానితో ఒక మాసంలోనే యువకులంతా పనీపాటా లేకుండా సోమరులుగా మారారు. సిరిపల్లెలో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. యువకులంతా ఇంటి వద్ద తిని వచ్చి రచ్చబండ దగ్గర గంటల కొద్దీ కబుర్లు చెప్పుకొనేవారు. శారీరక శ్రమ లేకపోవడం వల్ల కొన్ని రోజుల్లోనే తిన్నది అరగక కడుపు ఉబ్బరంతో బాధ పడసాగారు.

సీతాపురంలో ఉండే ఒక అవ్వ అన్ని జబ్బులకు చికిత్స చేస్తుంది. ఈ విషయం తెలిసి సిరిపల్లెలోని ఒక పది మంది యువకులు ఆ అవ్వ దగ్గరకు వెళ్లి విషయం చెప్పి తిన్నది జీర్ణం అవడానికి మందు ఇవ్వమన్నారు. ‘నాయనలారా మీకు చికిత్స చేస్తాను. అయితే మీరు ఒక వారం రోజుల పాటు నా వద్దకు రావాల్సి ఉంటుంది. నాది చిన్న ఇల్లు కాబట్టి మీరు ఇక్కడ ఉండడం కష్టం. ప్రతి రోజు పొద్దున్నే, పళ్లు తోముకుని స్నానం చేసి ఏమీ తినకుండా రావాలి. అప్పుడే చికిత్స మొదలు పెడతాను, ఈ రోజుకు వెళ్లిరండి’ అంది అవ్వ. ‘అలాగే అవ్వ’ అన్నారు ఆ యువకులు. మరుసటి రోజు ఉదయం ఆ పదిమంది యువకులు కలసి వచ్చారు.

‘నాయనలారా! వరసగా ఆ వేప చెట్టు కింద ఉన్న బండ మీద కూర్చోండి’ అని చెప్పింది. తరువాత వారందరికి గోరువెచ్చని నీళ్లలో వాము, జీలకర్ర పొడిని కలిపిన చిన్న మట్టి కుండలను తాగమని ఇచ్చింది. అందరూ తాగారు. ‘ఆ కుండలను ఆ బావి దగ్గర ఉన్న నీళ్ల తొట్టిలోని నీళ్లతో శుభ్రంగా కడిగి అక్కడున్న బండపైన బోర్లించండి’ అని చెప్పింది. వారు అలాగే చేశారు. ‘ఇప్పుడు మీరంతా నాతో రండి’ అని ఒక్కొక్కరికి ఒక వెదురు గంప ఇచ్చి అటు పక్కగా ఉన్న చెట్టు వద్దకు తీసుకెళ్లింది. ‘ఈ కింద పడ్డ పత్రాలను మీ మీ గంపల్లోకి కుప్పలా వేయకుండా ఒక్కొక్కటిగా పేర్చండి’ అని చెప్పింది అవ్వ. వారంతా అలాగే చేశారు. మళ్లీ అందరినీ తన ఇంటి వద్ద ఉన్న వేప చెట్టు కిందకు తీసుకెళ్లి ఒక పెద్ద చాప పరిచి వారిని కూర్చోమంది.

‘ఇప్పుడు నేను ఎలా ఒక్కొక్క పత్రాన్ని ఈనెలతో కుడుతున్నానో బాగా గమనించి, మీరు కూడా అలా చేయాలి. అప్పుడు విస్తరి తయారవుతుంది. ఇదిగోండి ఈనెల కట్ట’ అని చాప మీద పెట్టింది. వారు చేస్తున్న పని అవ్వకు సంతృప్తిని ఇచ్చింది. ‘నేను మీకు వంట సిద్ధం చేయాలి’ అని ఇంట్లోకి వెళ్లింది. వంట చేసి వచ్చాక అవ్వ కూడా విస్తర్లు కుట్టసాగింది.
రెండు గంటల తరువాత ‘ఇప్పుడు మీకు ఆకలిగా ఉందా... లేదా’ అని అడిగింది అవ్వ. ‘ఆకలవుతోంది!’ అన్నారు వారు. అవ్వ ఇంట్లోకి వెళ్లి, వారిని రమ్మని ఒక్కొక్కరికి ఒక మట్టి పాత్రలో రాగి సంకటితో పాటు ఒక ఉల్లిపాయ ఇచ్చింది. వారు తిన్నాక.. ‘అవ్వా! సంకటి చాలా రుచిగా ఉంది’ అన్నారు అందరూ. అవ్వ కూడా సంకటి తిన్నాక ‘మీ పాత్రలను పొద్దున శుభ్రం చేసిన చోటే కడిగి ఆ బండ మీదనే బోర్లించి, పొద్దున ఆరిపోయిన కుండలను తీసుకు రండి’ అని చెప్పింది.  
‘అలాగే అవ్వ’ అని అవ్వ చెప్పినట్టు చేసి వచ్చారు. తరువాత వారు తయారు చేసిన విస్తర్లు కాకుండా అవ్వ ఇంటి ఆవరణలో పెట్టిన విస్తర్ల కట్టలలో నుంచి ఒక్కొక్కరికి రెండేసి కట్టలను ఇచ్చి ‘ఇక్కడకు సంత ఒక అర మైలు దూరం ఉంటుంది. అక్కడ వీటిని అమ్మి రండి’ అని చెప్పింది. వారంతా వాటిని తీసుకుని బయలుదేరారు. వారు సంతకు వెళ్లి వచ్చేసరికి సాయంత్రమైంది. ‘అవ్వా! అన్ని విస్తర్లూ అమ్ముడు పోయాయి’ అని అవ్వకు ధనం ఇచ్చారు.
‘నాయనలారా! అవి నేను తయారు చేసిన విస్తర్లు. వచ్చిన ధనంలో నాకు సగం మీకు సగం. రేపటి నుంచి మీరు తయారు చేసిన విస్తర్లలో మీకు పెట్టే భోజనం ఖర్చు మాత్రమే మినహాయించుకుని మిగతాది మీకు ఇస్తాను. మీరు సమానంగా పంచుకోండి’ అంది అవ్వ. ‘అవ్వా! ఈ ఒక్క రోజులోనే మా ఆరోగ్యం కాస్త కుదుట పడింది. ఆరోగ్యం బాగు పడాలంటే మేమే నీకు ధనం ఇవ్వాలి. కానీ నువ్వే మాకు ఇస్తున్నావు’ అన్నాడు వారిలో ఒకడు.
‘నాయనలారా! మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. మీకు ఓపిక ఉంటే మరిన్ని విస్తర్లు కుట్టండి’ అంది అవ్వ. ‘అవ్వా! ఓపిక ఉంది.. చీకటి పడే వరకు పని చేస్తాం’ అన్నారు వాళ్లు. ‘సరే ఖాళీ గంపలను తీసుకెళ్లి కిందపడ్డ ఆకులను పోగు చేసి తెచ్చి విస్తర్లు కుట్టండి’ అంది ఆమె. చీకటి పడే సమయానికి... ‘ఇక పని ఆపి కాళ్లు, చేతులు శుభ్రం చేసుకుని రండి’ అంది. వాళ్లు వచ్చాక ఒక్కొక్కరికి ఒక చిన్న గరిటెలో తేనెతో పాటు ఒక చిన్న అల్లం ముక్క ఇచ్చి నమిలి మింగమంది. కాస్త సమయం తీసుకుని ఒక్కొక్కరికి ఒక జొన్న రొట్టె, ఒక ఉల్లిపాయ కంచంలో పెట్టి ఇచ్చింది. అందరూ రొట్టె బాగుంది అన్నారు.
‘నాయనలారా! ఇక వెళ్లి రండి. ఈ రోజులాగానే రేపు ఉదయం రండి’ అంది. ‘అలాగే అవ్వా! వెళ్లి వస్తాం’ అన్నారు.  అలా వారం రోజుల పాటు అవ్వ తన పద్ధతిలో చికిత్స అందించి భోజనం పెట్టింది. ‘నాయనలారా! మీ ఆరోగ్యం ఎలా ఉంది?’ అని అడిగింది అవ్వ. ‘ఇప్పుడు మామూలు స్థితికి వచ్చాం. శారీరక శ్రమతోనే ఆరోగ్యం బాగుంటుంది అన్నది మాకు అర్థమైంది’ అన్నారు యువకులంతా. ‘చాలా సంతోషం. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందన్నది మీకు అర్థమైందిగా... ఇక వెళ్లిరండి’ అంది. ఆనోటా.. ఈ నోటా ఈ విషయం రాజు జయంతుడికి తెలిసింది. ఆయన కొన్ని రోజుల్లోనే నిరుద్యోగ భృతి పంపిణీని నిలిపి వేశాడు. నిరుద్యోగులకు చేతి వృత్తులు నేర్చుకునే ఏర్పాట్లు చేసి, వారు చేసిన వస్తువులను ఇతర ప్రాంతాల్లో అమ్మించి, వచ్చిన ఆదాయం వారికి అందేలా చేశాడు.

యు.విజయశేఖర రెడ్డి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని