ముందు జాగ్రత్త..!

రాము, గోపి, హరి మంచి స్నేహితులు. ముగ్గురూ.. పరీక్ష రాయడానికి పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. ఇంకా లోపలికి పిలిచే సమయం కాకపోవడంతో బయటే నిలబడి పరీక్ష గురించి చర్చించుకోసాగారు. ఇంతలో గోపి.. ‘అయ్యో! నా పెన్ను ఇంటి దగ్గరే మర్చిపోయాను..

Published : 24 Jan 2024 05:34 IST

రాము, గోపి, హరి మంచి స్నేహితులు. ముగ్గురూ.. పరీక్ష రాయడానికి పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. ఇంకా లోపలికి పిలిచే సమయం కాకపోవడంతో బయటే నిలబడి పరీక్ష గురించి చర్చించుకోసాగారు. ఇంతలో గోపి.. ‘అయ్యో! నా పెన్ను ఇంటి దగ్గరే మర్చిపోయాను.. ఇప్పుడెలా?’ అని కంగారుగా అన్నాడు. అప్పుడు మిగతా ఇద్దరు చిన్నగా నవ్వి ‘మరేం ఫర్వాలేదు.. భయపడకు. మా ఇద్దరి దగ్గర ఇంకా అదనంగా రెండు పెన్నులు ఉన్నాయి’ అని ఒకటి తీసి ఇచ్చారు. ఆ పెన్ను తీసుకొని.. ‘హమ్మయ్యా..! పెన్ను అయితే దొరికింది’ అనుకున్నాడా అబ్బాయి. పెన్ను వెతికే క్రమంలో హరికి తన హాల్‌టికెట్‌ కనిపించలేదు. అప్పుడు అర్థమైంది మర్చిపోయి వచ్చానని.

వెంటనే మిత్రులతో ‘నా హాల్‌టికెట్‌ ఇంటి దగ్గరే పెట్టొచ్చాను. అది లేకపోతే నన్ను పరీక్ష రాయనివ్వరు. ఇంటికి వెళ్లి తెచ్చుకుందాం అంటే.. అరగంట సమయమే ఉంది. మా ఇంటికెళ్లి రావడానికి కనీసం గంట అయినా పడుతుంది. ఇప్పుడెలా నాకు చాలా భయంగా ఉంది’ అని చిన్నగా ఏడవడం మొదలుపెట్టాడు హరి. ‘పెన్నో లేకపోతే పరీక్ష ప్యాడో అయితే ఇక్కడే ఉన్న దుకాణంలో కొనుక్కోవచ్చు. కానీ హాల్‌టికెట్‌ అలా కొనలేము కదా..!’ అని గోపి అంటుండగానే.. ఎవరో అక్కడి నుంచి బండి మీద వెళ్తున్నారు. రాము వెళ్లి వెంటనే అతన్ని ఆపి.. ‘అంకుల్‌..! మా హరి హాల్‌టికెట్‌ మర్చిపోయాడు. పరీక్షకు సమయం అవుతుంది. కొంచెం తనని వాళ్లింటి వరకు తీసుకెళ్తారా?’ అని అడిగాడు. అలాగేనంటూ.. హరిని ఎక్కించుకొని బయలుదేరాడా వ్యక్తి. ఇంటి ముందు ఆగగానే.. వాళ్లమ్మ వచ్చి.. ఒరేయ్‌ హరీ..!  హాల్‌టికెట్‌ మర్చిపోయినట్లున్నావు’ అని అడిగింది. అవునమ్మా..! తొందరగా ఇవ్వు.. ఆలస్యమైతే నన్ను పరీక్ష హాల్లోకి రానివ్వరు’ అన్నాడు హరి. ‘అయ్యో! మీ నాన్న నీకు కనబడలేదా! నీ హాల్‌టికెట్‌ తీసుకొని పరీక్షాకేంద్రం దగ్గరికి వచ్చారు. తొందరగా వెళ్లు. నువ్వు అక్కడ కనిపించకపోతే ఆయన కంగారు పడతారు’ అందామె.

హరి మళ్లీ అతని బండి మీదే.. పరీక్షా కేంద్రానికి బయలుదేరాడు. అక్కడికి వెళ్లి చూస్తే.. వాళ్ల నాన్న కనిపించలేదు. దాంతో హరి చాలా కంగారు పడ్డాడు. ఇంతలో రాము వచ్చి.. ‘మీ నాన్న నీ హాల్‌టికెట్‌ తీసుకొని వచ్చారు. ఆయనకు ఆఫీస్‌కు ఆలస్యం అవుతుందని.. ఇక్కడ మాస్టారుకు ఇచ్చి వెళ్లారు’ అని చెప్పాడు. వెంటనే ఆ మాస్టారు దగ్గరకు వెళ్లి హాల్‌టికెట్‌ తీసుకున్నాడతను.

అప్పుడే అక్కడికి వచ్చిన వాళ్ల మాస్టారు.. ‘పరీక్షకు వెళ్లేటప్పుడు ఏ వస్తువులు తీసుకెళ్లాలో ముందే మీకు రాయించాను కదా.. మీరు రాసుకోలేదా?’ అని అడిగారు. అప్పుడు.. నేను రాసుకున్నానని రాము, ఆ రోజు బడికి రాలేదని గోపి, హరి బదులిచ్చారు. ‘మనం ఎక్కడికి వెళ్లాలనుకున్నా.. ముందుగానే తీసుకెళ్లాల్సిన వస్తువులన్నీ రాసిపెట్టుకోవాలి. అప్పుడు మనం మర్చిపోయే అవకాశం ఉండదు. అలా రాసుకున్నాడు కాబట్టే.. రాము ఏదీ మర్చిపోలేదు. మీరేమో ఒకరు పెన్ను, మరొకరు హాల్‌టికెట్‌ మర్చిపోయారు. ఇంటి నుంచి బయలుదేరే ముందు కూడా అవసరమైన వస్తువులు అన్నీ ఉన్నాయో, లేదో ఒకసారి చూసుకొని రావాలి’ అని చెప్పారు. అలాగేనంటూ బదులిచ్చారు వాళ్లు.

తర్వాత ముగ్గురూ కలిసి.. పరీక్ష రాయడానికి లోపలికి వెళ్లారు. వాళ్లు బయటికి వచ్చేసరికి హరి వాళ్ల నాన్న తన కోసం ఎదురుచూస్తూ.. ఉన్నారు. ఇంతలో హరి వచ్చాడు. ‘హరీ..! హాల్‌టికెట్‌ తీసుకున్నావా? సమయానికే వచ్చావా? పరీక్ష ఎలా రాశావు?’ అని కంగారుగా అడిగారు. ‘బాగానే రాశాను నాన్నా. నా మతిమరుపు వల్ల మీ అందరినీ ఇబ్బంది పెట్టాను. ఇంకెప్పుడూ ఇలా చేయను. ముందుగానే అన్నీ సర్ది పెట్టుకుంటాను. మాస్టారు చెప్పినట్లు నోటు పుస్తకంలో కావాల్సిన వస్తువులన్నీ రాసుకుంటాను’ అన్నాడు హరి. అతని మాటలకు తండ్రితో పాటు మాస్టారు, హరి మిత్రులు చిన్నగా నవ్వారు. ఆ తర్వాత అందరూ ఎవరి ఇంటికి వాళ్లు వెళ్లిపోయారు.

సంగనభట్ల చిన్న రామకిష్టయ్య


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు