రాజు కళ్లు తెరిపించిన మంత్రి!

పూర్వం కుంతల రాజ్యాన్ని రత్నశేఖరుడనే రాజు పరిపాలించేవాడు. ఆయనకు పరిపాలనలో మరీ ఎక్కువ అవగాహన ఉండేది కాదు. పొరుగున ఉన్న మాళవ రాజ్యాన్ని గుణశేఖరుడనే రాజు పాలించేవాడు. ఆయన పరిపాలనలో సమర్థుడు.

Published : 19 Feb 2024 00:14 IST

పూర్వం కుంతల రాజ్యాన్ని రత్నశేఖరుడనే రాజు పరిపాలించేవాడు. ఆయనకు పరిపాలనలో మరీ ఎక్కువ అవగాహన ఉండేది కాదు. పొరుగున ఉన్న మాళవ రాజ్యాన్ని గుణశేఖరుడనే రాజు పాలించేవాడు. ఆయన పరిపాలనలో సమర్థుడు. అందువల్ల ఆ రాజ్యం సుభిక్షంగా ఉండేది. ఇటు మాళవ ప్రజలు కానీ, అటు కుంతల ప్రజలు కానీ గుణశేఖరుణ్ని వేనోళ్ల కీర్తిస్తుండేవారు. అది కుంతలరాజు రత్నశేఖరుడికి నచ్చేదికాదు.

రత్నశేఖరుడి కొలువులో ఉద్యోగం చేస్తున్న అనంతుడు, గుణశేఖరుడిపై రాజులో ఉన్న అసూయాద్వేషాలను గమనించాడు. ‘ప్రభూ! మన ప్రజలు అమాయకులు. లోకజ్ఞానం బొత్తిగా లేనివారు. అందువల్లనే వారు మీ పాలనలోని గొప్పతనాన్ని గుర్తించలేకపోతున్నారు’ అంటూ రత్నశేఖరుణ్ణి బాగా పొగిడి, గుణశేఖరుణ్ని తక్కువ చేసి మాట్లాడుతూ వచ్చాడు. ఆ విధంగా తక్కువ కాలంలోనే అనంతుడు రాజుగారికి ఆంతరంగికుడైపోయాడు. పొరుగురాజును విమర్శిస్తే రాజుగారికి త్వరలో దగ్గరైపోవచ్చని అదే కొలువులోని మరో ఉద్యోగి జయంతుడు కూడా గమనించాడు. తానూ అలాగే చేసి రాజుకు బాగా దగ్గరై, మరొక ఆంతరంగికుడిగా మారాడు. ఇద్దరూ తమ తమ విధులను నిర్వహించడం మానేసి, రత్నశేఖరుడికి నచ్చేటట్లు మాట్లాడుతూ అధికారాన్ని దుర్వినియోగం చేయసాగారు.

మంత్రి బుద్ధిశాలి, రాజుతో... ‘ప్రభూ! మీరు తెల్లనివన్నీ పాలనుకుంటున్నారు. అనంతుడు, జయంతుడు పచ్చి అవకాశవాదులు. మీ ముందు గుణశేఖరుడ్ని విమర్శిస్తూ వాళ్లు తమ పబ్బం గడుపుకుంటున్నారు. ఇలాంటి వారిని నమ్మడానికి లేదు. మన ప్రజల్లో ఉన్న అసంతృప్తికి కారణాలు కనుక్కుని పరిష్కార మార్గాలు వెతుక్కోవాలి తప్ప, మనం చేసేదంతా సరైందని అనుకోవడానికి లేదు’ అన్నాడు. రత్నశేఖరుడికి మంత్రిమాటలు నచ్చలేదు. మంత్రి చేసేదిలేక మౌనం వహించాడు.

ఒకరోజు రాజు ఆంతరంగికులతో మాట్లాడుతున్న సందర్భంలో వేగులు హడావుడిగా వచ్చారు. ‘ప్రభూ! పొరుగురాజు గుణశేఖరుడు మన మీద దాడికి సిద్ధపడుతున్నాడు. మన ప్రజల్లో అసంతృప్తి ఉందని, దాడి చేస్తే విజయం తప్పదని భావిస్తున్నాడు. ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి’ అని చెప్పారు. రాజు వాళ్లను పంపేసి ఆలోచనలో పడ్డాడు. ఆందోళనగా ఉన్న రాజుతో ఆంతరంగికులిద్దరూ... ‘ప్రభూ! మీరు ఆందోళన పడకండి. రాత్రికి మేం పరిష్కారం ఆలోచించి ఉదయాన్నే చెబుతాం’ అని వెళ్లిపోయారు.

బాగా పొద్దుపోయాక అనంతుడి ఇంటికి జయంతుడు వచ్చాడు. ఇద్దరూ మాటల్లో పడ్డారు.. ‘ఇదేమిటి ఇలా అయింది. రాజుగారిని మాటలతో మాయ చేస్తూ, కష్టపడకుండా అందలాలెక్కాం. ఇప్పుడు పొరుగురాజు దాడిచేస్తే మనరాజు ఓడిపోక తప్పదు. ప్రజల్లోనేకాక, రాజోద్యోగుల్లో కూడా వ్యతిరేకత ఉంది. అందువల్ల మన రాజుకు ఓటమి తప్పదు. కనుక మనం వీలైనంత త్వరలో కొలువు వదిలేసి, మన దారి మనం చూసుకుందాం. అలా వెళ్లకపోతే మన గురించి తెలిసిన పొరుగురాజు, మనల్ని కొలువులో ఉంచుకోడు సరికదా.. శిక్షిస్తాడు. అందుకని మనం వీలున్నంత త్వరగా ఈ రాజ్యం వదిలి వెళ్లి పోదాం’ అన్నాడు. జయంతుడు కూడా అందుకు తలూపాడు.

ఉదయాన్నే ఇద్దరు ఆంతరంగికులూ రాజును కలుసుకుని, ‘ప్రభూ! రాత్రంతా సుదీర్ఘంగా ఆలోచించాం. మనకొచ్చిన ఆపదేం లేదు. తొందరపడి మనరాజ్యం మీద దాడి చేస్తే గుణశేఖరుడు అందుకు తగిన గుణపాఠం నేర్చుకుంటాడు. మీ వీరత్వం ముందు అతనెంత? మీరు ప్రశాంతంగా ఉండండి’ అంటూ రాజుగారి పరాక్రమాన్ని కొండంతలు చేసి పొగిడారు.

అక్కడే ఉండి అంతా వింటున్న మంత్రి, రాజుతో.. ‘ప్రభూ! విన్నారు కదా వీరి మాటలు’ అన్నాడు. రాజు భటులవైపు తిరిగి.. ‘వీళ్లిద్దరిని బంధించండి’ అన్నాడు. ఏమీ అర్థంకాక వెర్రిచూపులు చూస్తున్న ఆంతరంగికులతో మంత్రి... ‘నేను, రాజు మారువేషాలతో వచ్చి రాత్రి మీ సంభాషణ అంతా విన్నాం. రాజును మాయమాటలతో ఏమారుస్తున్న మీ ఆటలు కట్టించాలని చాలాకాలంగా ఎదురు చూస్తున్నాను. అందుకే వేగులతో పొరుగురాజు దాడి చేయబోతున్నట్లు మీ ముందే రాజుగారికి చెప్పించాను. ఆయనకు మీ నిజ స్వరూపం తెలియజేయడానికి మారువేషాల్లో రాత్రి ఇద్దరం అనంతుడి ఇంటికి వచ్చాం. మీ నీచబుద్ధి బయటపడింది. మీలాంటి అవకాశవాదులు, రాజద్రోహులు కచ్చితంగా కారాగారంలో ఉండాల్సిందే’ అన్నాడు.

రాజు మెచ్చుకోలుగా మంత్రివైపు చూశాడు. ‘ప్రభూ మీకు మేలు చేయడానికి ఈ నాటకమాడాల్సి వచ్చింది. తప్పైతే మన్నించండి. నాటకం రక్తి కట్టడానికి మీరు, వేగులు సహకరించారు. అందుకు కృతజ్ఞుణ్ని. మనలో ఏదైనా బలహీనత ఉందని తెలిస్తే, దాన్ని ఉపయోగించుకుని అందలాలు ఎక్కాలని ఆంతరంగికుల్లాంటివారు చూస్తుంటారు. ఇలాంటివారి విషయంలో మనం జాగరూకతతో ఉండాలి... తప్పదు!’ అన్నాడు. ‘మంత్రివర్యా! నా కళ్లు తెరిపించారు’ అని మంత్రిని ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. తరవాత కాలంలో ఆయన విలువైన సలహాలతో తన పరిపాలనలోని లోపాలను సరిదిద్దుకుని మంచిరాజుగా పేరుపొందాడు రత్నశేఖరుడు.

డా.గంగిశెట్టి శివకుమార్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని