మెరిసిన రామూ ఆలోచన..!

రాము ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. తను చాలా తెలివైనవాడు.. వాళ్ల నాన్న ఊర్లో టీ కొట్టు నడుపుతూ.. కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఒకరోజు ఆయనకి ఒంట్లో బాగోలేకపోవడంతో, రాముతో వాళ్లమ్మ.. ‘రామూ! నాన్నకి కాస్త ఆరోగ్యం బాలేదు.

Updated : 08 Mar 2024 05:00 IST

రాము ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. తను చాలా తెలివైనవాడు.. వాళ్ల నాన్న ఊర్లో టీ కొట్టు నడుపుతూ.. కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఒకరోజు ఆయనకి ఒంట్లో బాగోలేకపోవడంతో, రాముతో వాళ్లమ్మ.. ‘రామూ! నాన్నకి కాస్త ఆరోగ్యం బాలేదు. నీకెలాగూ ఈ రోజు సెలవే కదా..! కాస్త కొట్టు చూసుకో’ అంది. అలాగేనమ్మా.. అంటూ కొట్టుకు బయలుదేరి వెళ్లాడు. రాము వెళ్లేసరికి కొట్టు దగ్గర ఒక్కరు కూడా లేరు. ఒక్కసారి చుట్టుపక్కల చూసేసరికి.. కాస్త దూరంలో కూడలి దగ్గర ఉన్న కొట్టులో మాత్రం చాలామంది జనాలు గుమిగూడారు. అక్కడ అందరూ టీ, కాఫీలు తాగి గ్లాసులు అక్కడే ఉన్న ఒక చెత్త బుట్టలో పడేస్తున్నారు. రామూకి చాలా బాధగా అనిపించింది. తను అక్కడే కూర్చొని.. ‘మా నాన్న రోజూ కొట్టులో టీలు అమ్ముతుంటారు. కూడలికి దూరంగా ఉండటం వల్ల మా కొట్టుకు జనాలు రావడానికి ఇష్టపడటంలేదు. అందుకే మాకు డబ్బులు తక్కువగా వస్తున్నాయి. కానీ ఏదో ఒకటి చేసి మా కొట్టు బాగా నడిచేలా చేయాలి. అప్పుడు నాన్న చాలా సంతోషిస్తారు’ అని ఆలోచించసాగాడు.

కాసేపటి తర్వాత రామూ మెల్లగా రద్దీగా ఉన్న ఆ కొట్టు దగ్గరికి వెళ్లి.. అంతా గమనించసాగాడు. అక్కడ అమ్ముతున్న టీలు, తాగుతున్న జనాన్ని చూసాడు. వెంటనే రాము మెదడులో ఒక మంచి ఆలోచన వచ్చింది. ఇంతలోనే రామూకి ఎండాకాలం సెలవులు కూడా వచ్చేశాయి. వాళ్ల నాన్నకి ఇంకా ఒంట్లో నలతగానే ఉంది. ఇక రామూ రోజూ ఉదయాన్నే లేచి.. టీ కొట్టుకి వెళుతున్నాడు. సాయంత్రానికి బాగా డబ్బులు తెస్తున్నాడు. తను అనుకున్నట్లుగానే కొద్ది రోజుల్లోనే.. వాళ్ల కొట్టు దగ్గర రద్దీ కూడా పెరిగింది. అది చూసి.. ఆ అబ్బాయి చాలా సంతోషించాడు. ఆ పిల్లవాడికి వచ్చిన ఒక మంచి ఆలోచన వల్ల తనతో పాటుగా రాజన్న వ్యాపారం కూడా బాగా సాగుతోంది. ఇదంతా చూసిన మిగిలిన టీ కొట్టు వాళ్లూ.. ఆశ్చర్యపోయారు. ఎప్పుడూ పది మంది కూడా ఉండని రామూ టీ కొట్టు దగ్గర జనాలు గుంపులు గుంపులుగా ఉండసాగారు. ప్రస్తుతం తన వ్యాపారం చాలా చక్కగా నడుస్తుంది.

అలా కొన్ని రోజులు గడిచాయి. రామూ నాన్న ఆరోగ్యం కుదుటపడింది. ఆయన కూడా మళ్లీ కొట్టుకు వెళ్లాడు. అక్కడ ఎక్కువ జనాన్ని చూసి ఆశ్చర్యపోయి.. కొడుకుని పిలిచి ‘నాన్నా రామూ ఇది అసలు మన కొట్టేనా! ఇంతమంది జనాలు ఉన్నారేంటి? ఇదంతా ఎలా సాధ్యమైంది’ అని అడిగారాయన. అప్పుడు రామూ మాట్లాడుతూ.. ‘మా స్కూల్లో ప్లాస్టిక్‌ వాడకం వల్ల కలిగే నష్టాల గురించి, దానితో మనకు వచ్చే జబ్బుల గురించి చెప్పారు నాన్నా. అది పర్యావరణం మొత్తం నాశనం అవ్వడానికి కారణమవుతోంది. ప్లాస్టిక్‌ వాడకం మానేస్తే.. సగం జబ్బులు నయం అయినట్టే.. ఇంకా దాని తయారీకి కూడా చాలా డబ్బు ఖర్చవుతుంది. ఇంకా ప్లాస్టిక్‌ సంచుల్లో అమ్మే వేడి వేడి పదార్థాలు తినడం, ప్లాస్టిక్‌ కప్పుల్లో ఇచ్చే టీలు తాగడం వల్ల క్యాన్సర్లు వచ్చే అవకాశం చాలా ఎక్కువని వివరించాడు. మన కొట్టుతో సహా పక్క కొట్టులో కూడా ప్లాస్టిక్‌ కప్పుతో టీ ఇవ్వడం గమనించాను. అప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది.. మట్టితో తయారుచేసిన కప్పులో టీ ఇస్తే బాగుంటుందీ అని.. వెంటనే కుండలు తయారు చేసే మన రాజన్న తాతకి చెప్పి మట్టితో చిన్న చిన్న కప్పులు తయారు చేయించాను. ఇప్పుడు వాటితో మన కొట్టుకు వచ్చిన వారికి టీ ఇస్తున్నాను. ఇచ్చట మట్టి కప్పుల్లో మాత్రమే టీ అందిస్తాం. మీ ఆరోగ్యమే మాకు ముఖ్యం.. అని రాసి, ప్లాస్టిక్‌ కప్పుల్లో టీ తాగితే వచ్చే నష్టాలను కూడా రాయించాను. దాంతో అప్పటి నుంచి మన కొట్టు దగ్గరకు జనం రావడం మొదలుపెట్టారు. ఈ కప్పుల్లో టీ కూడా ఎంతో రుచిగా ఉంటుంది’ అని చెప్పాడు. ఆ మాటలకు రామూ వాళ్ల నాన్న చాలా సంతోషించారు. అక్కడికి వచ్చిన వాళ్లు కూడా ఆ అబ్బాయి తెలివితేటలను మెచ్చుకోసాగారు.

నంద త్రినాథరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని