ఉత్తమ శిష్యుడి ఎంపిక!

మధురాంతకం అటవీ ప్రాంతాన్ని ఆనుకుని, సుమితా నది తీరాన జ్ఞాన మహాముని ఆశ్రమం ఉంది. ఆయన దగ్గర విద్యనభ్యసించే శిష్యులందరిలో సుధాముడు, విజయుడు ఇద్దరూ అన్నింటిలోనూ ముందు ఉండేవారు.

Published : 01 Apr 2024 00:06 IST

మధురాంతకం అటవీ ప్రాంతాన్ని ఆనుకుని, సుమితా నది తీరాన జ్ఞాన మహాముని ఆశ్రమం ఉంది. ఆయన దగ్గర విద్యనభ్యసించే శిష్యులందరిలో సుధాముడు, విజయుడు ఇద్దరూ అన్నింటిలోనూ ముందు ఉండేవారు. ఒకరోజు మహాముని వీరిలో ఎవరు తెలివైన వారో తెలుసుకుందాం.. అనుకుని వారిద్దరిని పిలిచి.. ‘మీరిద్దరూ అన్ని విద్యలూ అభ్యసించారు. ప్రతిదానిలోనూ సరి సమానంగా ఉన్నారు. కానీ మీ ఇద్దరిలో ఎవరినో ఒకరిని ఉత్తమ శిష్యునిగా నిర్ధారించాలి.. కనుక మీకు నేను చివరగా ఒక పరీక్షను పెట్టదలుచుకున్నాను. దానిలో ఎవరైతే విజయం సాధిస్తారో వారే ఉత్తమ శిష్యుడు’ అన్నాడు మహాముని.

దానికి ‘సరే’ అన్నారు ఆ ఇద్దరు. ‘మీరు ఇప్పుడు నేను చెప్పబోయే పని చేసే సందర్భంలో ఎక్కడా నా పేరును వినియోగించకూడదు. మీ అంతట మీరుగా పూర్తి చేసుకుని రావాలి’ అన్నాడు మహాముని. ‘అలాగే గురువర్యా’ అన్నారు వారు. ‘చదువుకున్న పరిజ్ఞానాన్ని బట్టి మీరు నేను చెప్పే దాన్ని జాగ్రత్తగా విని పని పూర్తిచేసుకురండి’ అని హెచ్చరించాడు మహాముని. ‘చెప్పండి.. గురువర్యా!’ అన్నారు శిష్యులు. ‘అది మొక్కలు, చెట్ల నుంచి లభించినది కాకుండా ఉండాలి. జంతువుల నుంచి వచ్చినది కాకూడదు. అటువంటి పదార్థం ఒకటి ఉంది. దాన్ని తీసుకురండి’ అన్నాడు గురువుగారు.

ఆ మాట వినగానే శిష్యులు ఇద్దరూ... ఒకరి ముఖం మరొకరు చూసుకున్నారు. ‘మీరు ఈ పని కేవలం ఒక రోజులోనే పూర్తి చేయాలి. అంటే రేపు ఉదయం నాకు తెచ్చి ఇచ్చిన వారే విజేతలు’ అని అన్నారు గురువుగారు. ఉత్తరం వైపు సుధాముడు, దక్షిణం వైపు విజయుడు గుర్రాలపై బయలుదేరారు.

విజయుడు వెళ్లే దారిలో అనేక మొక్కలు, వాటి నుంచి లభించే ఫలాలు కనిపించాయి. కానీ అవేవీ గురువుగారు చెప్పినవి కాకపోవడంతో అలానే ముందుకు సాగాడు. కొంత దూరం వెళ్లాక అడవిలో కొంతమంది ఆహార పదార్థాలను విక్రయించడం కనబడింది. అక్కడ ఆగి వాటిని పరిశీలించగా, అవన్నీ వృక్షాల నుంచి వచ్చినవో లేదా జంతుల నుంచి వచ్చినవో అవటంతో సాయంత్రం వరకు అలానే తిరిగాడు. గురువుగారు చెప్పినటువంటి పదార్థం ఏదీ కనిపించకపోవడంతో చీకటి పడుతుండగా చివరికి ఖాళీ చేతులతోనే ఆశ్రమానికి చేరుకున్నాడు.

సుధాముడికి కూడా వెళ్లే దారిలో అనేక మొక్కలు, జంతువులు, వాటి నుంచి లభించే ఆహార పదార్థాలు కనిపించాయి. కానీ అవేవీ గురువు చెప్పినవి కావు. దాంతో కొంత సమయం అడవిలో ఆగి ఒక చెట్టు కింద విశ్రమించాడు. కళ్లు మూసుకుని ప్రశాంతంగా గురువుగారు చెప్పిన మాటలు, పాఠాలను ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకున్నాడు. ఒక్కసారిగా సుధాముడికి సమాధానం దొరికింది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే గుర్రం మీద వేగంగా ప్రయాణం ప్రారంభించాడు. గురువుగారు చెప్పిన దాన్ని గుర్తించి ఒక సంచిలో మూటకట్టుకొని తిరిగి ఆశ్రమం బాట పట్టాడు.

గురువుగారు చెప్పిన సమయం కంటే ముందే రావడంతో సుధాముడు సంతోషించాడు. శిష్యులిద్దర్నీ గమనించిన గురువు.. ‘మీ ఇద్దరూ తెచ్చినటువంటి ఆ పదార్థాన్ని అక్కడ పెట్టండి’ అన్నాడు. విజయుడు ఉత్త చేతులతోనే నిలబడ్డాడు. సుధాముడు మాత్రం తాను సంచిలో తీసుకొచ్చిన పదార్థాన్ని గురువుగారు చెప్పిన ప్రదేశంలో పెట్టాడు.

‘విజయా! నీవు మొక్కలు, జంతువుల నుంచి తయారవ్వని దాన్ని గుర్తించలేదా?’ అని అడిగారు. ‘క్షమించండి  గురువర్యా! నేను అడవంతా వెతికాను. చాలా సమయం దానికోసం వెచ్చించాను. అయినప్పటికీ అటువంటి పదార్థం ఏదీ, నా దృష్టిలోకి రాలేదు. అందుకనే నేను ఉత్త చేతులతో వచ్చాను. నన్ను క్షమించండి’ అన్నాడు.

‘సుధామా! నేను చెప్పిన పదార్థాన్ని తెచ్చావా?’ అని అడిగాడు గురువు. ‘తెచ్చాను గురువర్యా! అది ఆ సంచిలో ఉంది’ అని దాన్ని తీసి గురువుగారికి అందించారు. ఆయన ఆ పదార్థాన్ని చూసి ‘భళా! నీవు నేను చెప్పిన పాఠాలను వినడంతో పాటు వాటిని నిజ జీవితంలో వినియోగించడం నేర్చుకున్నావు. కనుక నీవే ఉత్తమ శిష్యుడవు’ అని పొగిడారు. అక్కడ ఉన్న విద్యార్థులందరూ విజయుడితో సహా ఆ సంచిలో ఏముందోనని ఉత్సుకతతో ఎదురు చూశారు. మహాముని, ఆ పదార్థాన్ని సంచి నుంచి బయటకు తీసి చూపించారు.

అది ఉప్పు. ‘అయినా.. ఇది తినే ఆహార పదార్థం ఎలా అవుతుంది.. గురువర్యా?’ అన్నాడు విజయుడు. ‘నేను నిన్న మీకు చెప్పేటప్పుడే జాగ్రత్తగా వినమని చెప్పా. నేను ఆహార పదార్థం అనలేదు. ఒక పదార్థం మాత్రమే అన్నాను. అయినా ఇది ఆహార పదార్థాల తయారీకి ఉపయోగపడుతుంది. కనుక ఇది కూడా ఒక రకంగా ఆహార పదార్థమే అవుతుంది. ఉప్పు మొక్కల నుంచి రాదు. జంతువుల నుంచి తయారు కాదు. సముద్ర నీటి నుంచి లభించే సహజ వనరు ఇది’ అని సమాధానం ఇచ్చాడు గురువు.

విజయుడు.. ‘క్షమించండి గురువర్యా! మీరు నిన్న చెప్పిన మాటలను పూర్తిగా వినకపోవడంతో నాకు తెలిసిన విషయమే.. అయినా.. నేను సాధించలేకపోయాను’ అన్నాడు. ‘చూడు విజయా! ఎప్పుడైతే మనం ఎదుటి వారు చెప్పే మాటలను విని చక్కగా అవగాహన చేసుకుంటామో.. అప్పుడే మనకు విషయం అర్థం అవుతుంది. మనం చేసే పనిలో పరిపూర్ణత లభిస్తుంది. అది నువ్వు చేయలేకపోయావు. సుధాముడు చేశాడు. కనీసం ఇప్పటి నుంచి అయినా మీరందరూ ఎదుటివారు చెప్పే విషయాలను క్షుణ్నంగా విని అవగాహన చేసుకుని విజయం సాధించండి. అలానే మనం నేర్చుకున్న అంశాలను జీవితానికి ఎలా వినియోగించుకోవాలో కూడా గుర్తించండి. ఏది ఏమైనా మన ఆశ్రమంలో ఉన్న శిష్యులందరిలో సుధాముడే ఉత్తమ శిష్యుడు’ అని అభినందనలతో ముంచెత్తాడు జ్ఞాన మహాముని.

 ఏడుకొండలు కళ్లేపల్లి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని