మహారాజుకు అన్నాచెల్లెళ్ల పాఠం..!

కోసల దేశాన్ని దేవానందుడు పాలిస్తున్నాడు. రాజ్యంలో ప్రజల కోసం చేపడుతున్న అభివృద్ధి పనులను తానే స్వయంగా పర్యవేక్షించాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగానే.. మంత్రితో కలిసి మారు వేషంలో రాజ్య పర్యటనకు బయలుదేరాడు.

Published : 12 Apr 2024 00:40 IST

కోసల దేశాన్ని దేవానందుడు పాలిస్తున్నాడు. రాజ్యంలో ప్రజల కోసం చేపడుతున్న అభివృద్ధి పనులను తానే స్వయంగా పర్యవేక్షించాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగానే.. మంత్రితో కలిసి మారు వేషంలో రాజ్య పర్యటనకు బయలుదేరాడు. ‘ఎక్కడెక్కడ నూతన భవంతులు కట్టాలి? ఎలాంటి చోట రహదారులు, పాఠశాలలు, వైద్యశాలలు నిర్మించాలి?’ అని చూసుకుంటూ వెళ్తున్నారు రాజు, మంత్రి. ఒక నిర్మాణం చేపట్టాలనుకున్న చోట వారికి ఒక చెరువు కనిపించింది. అప్పుడు రాజుతో.. ‘ప్రభూ! ఇక్కడ మనం ఒక పెద్ద భవంతి నిర్మించాలి. కానీ.. ఇది ఒక పెద్ద చెరువు ప్రాంతం. వర్షాలు ఎక్కువగా కురిసినప్పుడు భవంతిలోకి నీరు ప్రవేశించే అవకాశం ఎక్కువ. ఏం చేస్తే బాగుంటుందో మీరే చెప్పండి’ అన్నాడు మంత్రి. ఆ చుట్టుపక్కల అంతా పరీక్షగా గమనించాడు రాజు. చెరువంతా.. జలకళ లేక ఎండిపోయి కళా విహీనంగా కనిపించింది. దాంతో రాజు.. ‘మంత్రివర్యా.. ఇంత చిన్న విషయానికి కూడా మీరు నన్ను సలహా అడగాలా? వెంటనే ఈ చెరువును పూడ్చేసి భవంతి పనులు మొదలుపెట్టమని చెప్పండి’ అని ఆదేశాలు జారీ చేశాడు. మంత్రికి ఏం చెప్పాలో తోచక.. ‘అలాగే మహారాజా! మీరు చెప్పినట్లే చేస్తాను’ అని బదులిచ్చాడు.

అలాగే గుర్రాలపై ముందుకు కదిలారు మహారాజు, మంత్రి. దారిలో అలసటగా అనిపించి.. ఒక చోట సేదతీరారు. అక్కడ వారికి ఆడుకుంటున్న పిల్లలు కనిపించారు. ఆ పిల్లల్లో ఒకబ్బాయి తన చెల్లితో.. ‘చెల్లీ! నిన్న రాత్రి కురిసిన వర్షానికి మనం రోజూ ఆడుకునే చోట ఒక గుంత ఏర్పడింది. దాంట్లో నీళ్లు కూడా చేరాయి చూశావా? ఆ ప్రదేశం అంటే మనకు చాలా ఇష్టం కదా?’ అన్నాడు. ‘అవును అన్నయ్యా నిజమే! ఇప్పుడు మనం ఏం చేద్దామో నువ్వే చెప్పు మరి!’ అని అమాయకంగా అందా అమ్మాయి. ‘దీని కోసం అంతలా ఆలోచించాలా చెల్లీ? ఆ గుంతని ఇప్పుడే పూడ్చేస్తాను. అప్పుడు మనం ఎంచక్కా ఆడుకోవచ్చు’ అని ఉత్సాహంగా అన్నాడా అబ్బాయి. రాజు, మంత్రి వాళ్ల మాటలు ఆసక్తిగా వినసాగారు. అంతలోనే ఆ అమ్మాయి.. ‘తప్పు.. తప్పు అన్నయ్యా! మనం గుంత, పూడ్చటం చాలా పొరపాటు. ఎందుకంటే.. నిన్న మనం ఆడుకునేటప్పుడు లేని ఈ గుంతని స్వయంగా తవ్వింది కాదు. దానంతట అదే ప్రకృతి సిద్ధంగా ఏర్పడింది. ‘మనం ఎప్పుడూ నీటితో ఉన్న గుంతలనే కాదు.. అసలు ఏ గుంతల్ని కూడా పూడ్చి పెట్టరాదు. ఎందుకంటే వర్షాకాలంలో కురిసే వర్షపు నీళ్లు వృథాగా పోకుండా.. ఎక్కడికక్కడ ఇలాంటి చిన్న చిన్న గుంతల్లోకి, చెరువుల్లోకి చేరతాయి. అవి భూగర్భ జల మట్టం పెరగడానికి ఎంతగానో దోహదపడతాయి. మన ఇళ్ల ఆరుబయట, ప్రహరీల లోపల, ఇంకా నీటి బావుల చుట్టుపక్కల ఇలాంటి ఇంకుడు గుంతల నిర్మాణం చేపడితే భూగర్భ జలం పెరుగుతుంది. తగ్గిపోతున్న భూగర్భ జలమట్టం వృద్ధికి ఇలాంటి గుంతలు, చెరువులే శరణ్యమని గురుకులంలో గురువులు చాలాసార్లు చెప్పారు’ అంది.

వీటి నిర్మాణానికి కూడా చాలా తక్కువ ఖర్చు అవుతుందని వివరించారు. ‘అందుకని ఈ గుంతని పూడ్చాలనే ఆలోచన మానుకో అన్నయ్యా! మనం ఈ గుంతలున్న చోట కాకుండా మరో చోటుకు వెళ్లి ఎంచక్కా ఆడుకుందాం పద!’ అంటూ అందరూ కలిసి ఇంకో చోటుకి వెళ్లిపోయారు. ఇదంతా విన్న దేవానందుడికి, మంత్రికి కనువిప్పు కలిగింది. చిన్న పిల్లలే అయినా చాలా పెద్ద సందేశాన్ని అందించిన ఆ చిన్నారులను మనసులోనే అభినందించారు. చెరువు పూడ్చి నిర్మాణాలు చేపట్టాలనే వారి ఆలోచనలు వదిలిపెట్టారు. ఇంకో విధంగా ప్రజలకు మంచి కలిగేలా అభివృద్ధి పనులు చేయాలని నిర్ణయించుకొని.. రాజ్యం వైపుగా వెళ్లిపోయారు రాజు, మంత్రి.

నంద త్రినాథరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని