పాపయ్య తాత మ్యాజిక్‌..!

బావులకాడపల్లి గ్రామంలో పాపయ్య తాత అంటే తెలియని వారు ఉండరు. పిల్లలందరూ ఎప్పుడూ ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటారు.

Published : 13 Apr 2024 06:25 IST

బావులకాడపల్లి గ్రామంలో పాపయ్య తాత అంటే తెలియని వారు ఉండరు. పిల్లలందరూ ఎప్పుడూ ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే.. మొదటి నుంచి చిన్న చిన్న మ్యాజిక్‌లు చేసి, పిల్లలను ఆనందపరిచేవాడు. ఒకసారి రాజు తనకు ఎంతో ఇష్టమైన బొమ్మల పుస్తకం పోగొట్టుకున్నాడు. అది ఎంత వెతికినా దొరకలేదు. వెంటనే వెళ్లి.. పాపయ్య తాతకు విషయం చెప్పాడు. ఆయన కళ్లు మూసుకొని ‘రాజూ.. మీ ఇంట్లో దినపత్రికలు ఉంచే చోట చూశావా?’ అని అడిగాడు. ఆ అబ్బాయి కాసేపు ఆలోచించి.. ‘లేదు తాత!’ అన్నాడు. ‘వెంటనే వెళ్లి అక్కడ చూడు.. నీ బొమ్మల పుస్తకం అక్కడే ఉంది’ అని చెప్పాడు. రాజు పరిగెత్తుకుంటూ వెళ్లి.. అక్కడ వెతికాడు. నిజంగా తాత చెప్పినట్లుగానే.. పుస్తకం ఆ చోటే ఉంది. ఇక రాజు ఆనందానికి అవధుల్లేవు.

ఇంకోసారి.. స్కూల్‌ పిల్లలంతా కలిసి పక్క గ్రామానికి తిరునాళ్లకు వెళ్తున్నారు. దారిలో.. ఇంటి నుంచి తెచ్చిన పిండి వంటలన్నీ ఎంచక్కా పంచుకొని మరీ తిన్నారు. దీంతో అందరికీ దాహం వేసింది. కానీ ఎవరి దగ్గరా.. మంచినీళ్లు లేవు. చుట్టుపక్కల ఎక్కడ కూడా బావులు లేవు. అందరూ ఒక్క సారిగా పాపయ్య తాత వైపు చూశారు. ఆయన ఒక్క చిరునవ్వు నవ్వి.. ‘ముందు చూపు ఉండక్కర్లేదా?’ అంటూ చెయ్యి పక్కనే ఉన్న నేరేడు చెట్టు వైపు చూపించాడు. దాంతో.. అందరూ అటువైపుగా పరుగులు తీశారు. అక్కడ ఒక నీళ్ల ఊట ఉంది. అందరూ.. గబగబా నీళ్లు తాగి హమ్మయ్యా..! అనుకున్నారు. పాపయ్య తాత వెంట ఉంటే ఇలా.. చాలా చిత్రాలు చూడొచ్చు.

ఒకరోజు పాపయ్య తాత రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఒకబ్బాయి చూసి.. ‘తాత నీ గురించి చాలా విన్నాను. నీకు మ్యాజిక్‌ చేయడం బాగా వచ్చట కదా! నాకు బాగా ఆకలిగా ఉంది. అదిగో ఆ మామిడిచెట్టుకు చిటారు కొమ్మన పండు ఉంది కదా.. అది నాకు తెంపిస్తే తినేసి ఆకలి తీర్చుకుంటా!’ అన్నాడు. అందుకు తాత.. ‘ఈరోజు ఆ చెట్టు దగ్గర నా మాయలు పని చేయవు’ అని బదులిచ్చాడు. ‘పోనీ.. చింతచెట్టు పైనున్న తేనెపట్టులోని తేనె అయినా.. కాస్త తీసి పెట్టు. నా ఆకలి సగమైనా తీరుతుంది’ అన్నాడు. ‘అయ్యో బాబూ.. నీకు అసలు విషయం చెప్పడం మరచిపోయా. ఈ రోజు ఆ చెట్టు మీద కూడా మ్యాజిక్‌లు చేయకూడదు’ అన్నాడు. ‘నీ గురించి ఊర్లో అందరూ చెబుతుంటే విని, చాలా గొప్పవాడివి అనుకున్నాను. కానీ నువ్వు ఈ పిల్లలను వెంట పెట్టుకొని.. చిన్నపాటి గారడీలు చేస్తూ అందరి మెప్పు పొందుతున్నావు. ఈ విషయం ఇంకా ఎవరికైనా తెలిస్తే నీకే అవమానం.. జాగ్రత్తగా ఉండు’ అని వ్యంగ్యంగా చెబుతూ అక్కడి నుంచి వెళ్లిపోయాడా అబ్బాయి.

అదంతా విన్న పిల్లలందరూ.. ‘అదేంటి తాత నువ్వు చెయ్యలేని గారడీ లేదు. ఆ మామిడిపండు తెంపడం నీకు చిటికెలో పని. ఇక తేనెపట్టు నుంచి తేనె తియ్యడం చాలా తేలిక. అందులో పాపం అతను ఆకలితో ఉన్నానన్నాడు. అయినా.. నువ్వు ఎందుకు సాయం చేయలేదు’ అన్నారు. ‘చూడండి పిల్లలూ..! నేను ఈ విద్య నేర్చుకున్నది బలహీనులకు సహాయం చేయడం కోసం మాత్రమే. అంతే కానీ.. అందరి దగ్గర ప్రదర్శించి మెప్పు పొందాలని కాదు. ఇంకొక విషయం ఏమిటంటే.. అతనికి నిజంగానే ఆకలిగా ఉంటే అందనివి కోరడు, కేవలం ఆకలి తీర్చమంటాడు. అయినా మనం నేర్చిన విద్య బలహీనులకు ఉపయోగపడాలి. కానీ.. బాగా ఉండి, పనులు చేసుకోగలిగిన వారిని సోమరులను చేయకూడదు’ అన్నాడు పాపయ్య. ఆ మాటలు విన్న పిల్లలకు పాపయ్య తాత మీద మరింత గౌరవం పెరిగింది. ప్రతిదానికీ ఇతరులను సాయం అడగకుండా.. మన కష్టం మీద ఆధారపడాలని అప్పుడు పిల్లలకు అర్థమైంది.

 సింగంపల్లి శేష సాయి కుమార్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని