ఉప్మాలో ఇవేంటి చెప్మా!

‘ఉప్మాలో అసలు ఈ పిచ్చి ఆకులేంటమ్మా! ఇవి వెయ్యకుండా చెయ్యవచ్చుగా..’ ఉప్మాలోంచి చిరాగ్గా వాటిని ఏరి పారేస్తూ అన్నాడు అయిదో తరగతి చదువుతున్న నందు. ‘అవి కరివేపాకులు నందూ.. మన ఆరోగ్యానికీ చాలా మంచివి.

Published : 15 Apr 2024 00:07 IST


‘ఉప్మాలో అసలు ఈ పిచ్చి ఆకులేంటమ్మా! ఇవి వెయ్యకుండా చెయ్యవచ్చుగా..’ ఉప్మాలోంచి చిరాగ్గా వాటిని ఏరి పారేస్తూ అన్నాడు అయిదో తరగతి చదువుతున్న నందు. ‘అవి కరివేపాకులు నందూ.. మన ఆరోగ్యానికీ చాలా మంచివి. కంటి చూపునకు కూడా మేలు చేస్తాయి. ఉప్మాకు మంచి రుచినీ ఇస్తాయి. అలా తీసి పారేయకూడదు’ అని మందలింపుగా చెప్పింది అమ్మ.

కానీ నందు మాత్రం ఉప్మాలోంచి అవన్నీ ఏరి పారేసిన తరువాతే తిన్నాడు. నిజానికి ఉప్మాలోనే కాదు.. తాను తినే కూరల్లో, చారులోనూ కరివేపాకులు తీసి పారేసిన తరువాతే అన్నం తింటాడు. వాటిలో ఎన్నో మంచి ఔషధ గుణాలు ఉన్నాయని ఎవరు చెప్పినా కూడా వినిపించుకోడు.

నందుతో కరివేపాకులు ఎలా తినిపించాలో అర్థం కావడం లేదని తన తండ్రితో చెప్పి చాలా బాధ పడింది ఆమె. ఆ రోజు తాతయ్య ఊరు నుంచి వస్తున్నాడని తెలిసి చాలా సంబరపడ్డాడు నందు. ఆయనంటే నందుకు చాలా ఇష్టం. పల్లెటూరులో ఉండే తాతయ్య తమ ఇంటికి రాగానే ఆయన్ను ప్రేమగా అల్లుకుపోయాడు నందు.

‘నందూ! చూడు నీ కోసం ఏం తీసుకు వచ్చానో...’ అంటూ చిన్న మట్టి కుండీని నందు చేతికి అందించాడు తాతయ్య. అందులో బుల్లి బుల్లి చిగురాకులతో, నవ నవలాడుతున్న ఏదో చిన్న మొక్క ఉంది. ‘ఇది ఏం మొక్క తాతయ్యా?’ అని అడిగాడు నందు. ‘అది పెరిగిన తరువాత నీకే తెలుస్తుందిలే’ అని నవ్వుతూ చెప్పాడు తాతయ్య. ‘దీన్ని ఏం చెయ్యాలి తాతయ్యా?’ అని అమాయకంగా అడిగాడు నందు. ‘పెరట్లో గొయ్యి తీసి దానిలో నాటు’ అని చెప్పాడు తాతయ్య.

పెరట్లో ఓ మూల గొయ్యి తవ్వి ఆ మొక్కను కుండీలోంచి, వేర్లు తెగిపోకుండా జాగ్రత్తగా తీశాడు. ఆ గోతిలో దాన్ని నాటాడు నందు. ‘నేను మళ్లీ వచ్చేసరికి ఈ మొక్క పెరిగి పెద్దదవ్వాలి. రోజూ దానికి నీళ్లు పోస్తుండు’ అని ఆ రోజే తిరిగి తమ ఊరికి బయలుదేరి వెళుతూ, జాగ్రత్తలు చెప్పాడు తాతయ్య.

కొద్ది రోజులకు ఆ మొక్క కాస్త పెరిగి పెద్దదైంది. కొత్త కొత్త, లేత చిగుళ్లు వేస్తూ.. రోజులు గడిచే కొద్దీ దాని ఆకులు పెద్దవయ్యాయి. వాటి నుంచి సువాసన రావడమూ మొదలైంది. రోజు రోజుకూ పెరిగి పెద్దదవుతున్న తన మొక్కను చూసుకుని మురిసిపోతున్నాడు నందు. కొద్ది రోజుల తరువాత తాతయ్య ఊరు నుంచి వచ్చాడు. ఆయన రాగానే నందు ఆయన్ను పెరట్లోకి తీసుకు వెళ్లి పెరిగి పెద్దదైన తన మొక్కను సంతోషంగా, గర్వంగా చూపించాడు. ‘తాతయ్యా.. ఇది కరివేపాకు మొక్కంట.. అమ్మ చెప్పింది’ అని ఆనందంతో అన్నాడు.
నందు సంతోషం చూసి తాతయ్య కూడా చాలా ఆనందించాడు. అంతలోనే అమ్మ.. ‘నందూ! నీ మొక్క నుంచి ఓ రెండు రెబ్బలు కోసి తీసుకురా’ అని కేక వేసింది వంట గదిలో నుంచే. ‘అలాగే అమ్మా’ అంటూ తను అపురూపంగా పెంచుకుంటున్న మొక్క నుంచి, మొదటి సారిగా ఓ రెండు రెబ్బలు కోసుకువచ్చి అమ్మకు ఇచ్చాడు నందు. కాసేపటి తర్వాత అమ్మ అందరినీ ఫలహారానికి రమ్మని పిలిచింది. టేబుల్‌ మీద వడ్డించి ఉన్న వేడి వేడి ఉప్మా ప్లేటు చూడగానే నోరూరింది నందూకు. చెంచాతో ఉప్మా తీసుకుని తింటూ అడ్డువచ్చిన ఆకుల్ని చూశాడు నందు. వాటిని తీసి పారేయకుండా, ఉప్మాతో సహా ఆప్యాయంగా తినడం మొదలు పెట్టాడు. ఆ రోజు ఉప్మా ముందు కంటే రుచిగా అనిపించింది నందుకు. అది చూసి తాతయ్యా, అమ్మా ముసిముసిగా నవ్వుకున్నారు.

అప్పటి నుంచి కూరల్లో, చారులో వచ్చిన కరివేపాకులు తీసి పారవేయకుండా తినడం మొదలు పెట్టాడు నందు. తన కొడుకులో వచ్చిన మార్పునకు అమ్మ చాలా సంతోషించింది. నందుకు కరివేప మొక్క బహుమతిగా ఇచ్చిన తన తండ్రికీ కృతజ్ఞతలు తెలియజేసింది అమ్మ.

కోనే నాగ వెంకట ఆంజనేయులు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని