వూరంతా బొమ్మలే!

వూరంటే మనుషులుంటారు... మరి బొమ్మల వూరు తెలుసా? ఇక్కడ మనుషులు చేసే పనులు బొమ్మలే చేస్తాయి... ఇంతకీ ఎక్కడా?

Published : 26 Mar 2016 01:39 IST

వూరంతా బొమ్మలే!

వూరంటే మనుషులుంటారు... మరి బొమ్మల వూరు తెలుసా?ఇక్కడ మనుషులు చేసే పనులు బొమ్మలే చేస్తాయి... ఇంతకీ ఎక్కడా?

జపాన్‌లో మారుమూల వూరు నగొరొ. చూద్దామని వెళ్లారనుకోండి, మనుషులు కనిపించరు. ఎటు చూసినా బొమ్మలే కనిపిస్తాయి. వీధుల్లో, ఇళ్లల్లో, బడుల్లో, చివరికి రహదారులపై దాదాపు మనుషులంత సైజున్న బొమ్మలు కనిపించి అబ్బురపరుస్తాయి.

అందుకే ఈ వూరినంతా ‘డాల్‌ విలేజ్‌’ అనే పిలుస్తారు. ఇలా వూరి నిండా బొమ్మలు ఎందుకున్నాయంటే ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లాల్సిందే.

వూళ్లొ ఒకప్పుడు జనాలు బాగానే ఉండేవారు. ఇది మారుమూల ప్రాంతంలో ఉండేసరికి ప్రజలకు ఉపాధి లేక వలస బాట పట్టారు. వూరు ఖాళీ అయ్యి 27 మంది మాత్రమే మిగిలారు. 13 ఏళ్ల క్రితం అయనో త్సుకిమి అనే ఆవిడ తమ వూరికోసారి వెళ్లొద్దామని వస్తే. మనుషులు లేక వూరు బోసిపోవడం కనిపించింది.

వూరు కళకళలాడాలంటే ఏంచేయాలా అని ఆలోచిస్తుంటే ఒక ఉపాయం తట్టింది. మనుషుల స్థానంలో వూరు మొత్తం బొమ్మలతో నింపేస్తాననుకుందిట. అలా వూరి జనాభా ఎంతుండేదో కనుక్కుని 350కిపైగా బొమ్మలను సొంతంగా తయారుచేసింది. వీటిని చేయడానికి దాదాపు రెండేళ్లు పట్టింది. ఈ బొమ్మలన్నీ దూరం నుంచి చూస్తే మనుషుల్లానే కనిపిస్తాయి. ఈమె చేసిన మొదటి బొమ్మ వాళ్ల నాన్నదే

బడిలో విద్యార్థుల బొమ్మలు, పాఠం చెబుతున్న ఉపాధ్యాయుడు, రోడ్లపై కబుర్లు చెప్పుకుంటున్న పెద్దమనుషుల రూపాలు, పొలాల్లో పనిచేస్తున్న రైతు బొమ్మలు ఇలా బొమ్మలతో వూరును నింపింది.

అసలు ఈ బొమ్మలను ఏ పదార్థంతో చేస్తుందో తెలుసా? ఎండు గడ్డి, పాత గుడ్డలు, ఉన్ని దారాలు ఉపయోగించి చేసి, వాటికి తగ్గట్టు దుస్తులు కుడుతుంది. ఒక్కో బొమ్మ కేవలం మూడేళ్లు మాత్రమే ఉంటుంది. తర్వాత పాడైపోతే ఆ స్థానంలో మరో కొత్త బొమ్మను చేసి పెడుతుంది.

అయనో త్సుకిమి తన బొమ్మ కూడా చేసి ఒక గదిలో పెట్టుకుంది. ‘వ్యాలీ ఆఫ్‌ డాల్‌ü్స’ అనే డాక్యుమెంటరీ కూడా తీసింది. ఈ వూరు పర్యటక ఆకర్షణగా మారింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని