తీగల వంతేనండీ... మెచ్చనివారెవరండీ!

భారత్‌ అనగానే తాజ్‌మహల్‌ గుర్తొస్తుంది... అమెరికా అనగానే స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీ గుర్తొస్తుంది... అలాగే మొరాకో అనగానే ఇప్పుడో వంతెన గుర్తొస్తోంది. ఎందుకంటే అది ఆఫ్రికాలోనే పొడవైన తీగల వంతెన. రాత్రిళ్లు జిగేల్‌మంటూ మెరిసిపోవడం దాని ప్రత్యేకత!

Published : 28 Jul 2016 01:30 IST

తీగల వంతేనండీ... మెచ్చనివారెవరండీ!

భారత్‌ అనగానే తాజ్‌మహల్‌ గుర్తొస్తుంది... అమెరికా అనగానే స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీ గుర్తొస్తుంది... అలాగే మొరాకో అనగానే ఇప్పుడో వంతెన గుర్తొస్తోంది. ఎందుకంటే అది ఆఫ్రికాలోనే పొడవైన తీగల వంతెన. రాత్రిళ్లు జిగేల్‌మంటూ మెరిసిపోవడం దాని ప్రత్యేకత!* వంతెన అంటే వాహనాలు అటూ ఇటూ వెళ్లేందుకే అనుకుంటే పొరపాటే. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో వాటిని పర్యటకుల్ని ఆకర్షించేలా ముస్తాబు చేస్తున్నారు.

* మొరాకో దేశంలో కొత్తగా కట్టిన ఓ తీగల వంతెన అందరినీ భలే ఆకర్షిస్తోంది. దాని పేరు ‘మహ్మద్‌ 4 బ్రిడ్జ్‌’. ఆ దేశ రాజధాని రబాత్‌, సేల్‌ల మధ్య దాన్ని నిర్మించారు. ఇది ఆఫ్రికా ఖండంలోనే అతి పొడవైనది.

* మీరు రకరకాల వంతెనల్ని చూసే ఉంటారు. వాటిలో తీగల వంతెనను కట్టే పద్ధతంతా వేరుగా ఉంటుంది. చాలా వంతెనలు స్తంభాల ఆధారంగా ఉంటే ఇది మాత్రం తీగల ఆధారంగా ఉంటుంది. అందుకనే దీనికి ఎక్కువ స్తంభాలు ఉండవు. పొడవును బట్టి ఒకటి లేదా రెండు, మూడు టవర్లు ఉంటాయి. ఆ టవర్ల నుంచి వేలాడే తీగలపైనే రోడ్డు ఆధారపడి ఉండేలా కడతారు. మహ్మద్‌4 వంతెనను కూడా అలాగే కట్టారు.

* దీని కోసం ఏకంగా 200 మీటర్ల ఎత్తుండే రెండు టవర్లు నిర్మించారు. అంటే దాదాపు 600 అంతస్తుల భవనమంత ఎత్తన్నమాట! వాటి ఆధారంగా 950 మీటర్ల పొడవు, 30 మీటర్ల వెడల్పుతో వంతెన కట్టారు. దానిపైనుండే రోడ్డు 160 తీగల ఆసరాతో టవర్లకు అనుసంధానమై ఉంటుంది.

* దీనికి మరో ప్రత్యేకతా ఉంది. లైట్‌షోలు చేసుకునేందుకు వీలుగా దీనికి ఎల్యీడీలు అమర్చారు. ఆ లైట్‌ షోల్లో మొత్తం ఎన్ని రంగులొస్తాయో తెలుసా? కోటీ అరవై లక్షలు!మీకు తెలుసా?
* 16వ శతాబ్దం నుంచీ తీగల వంతెనలున్నట్లు ఆధారాలున్నాయి.

* ప్రపంచంలోనే పొడవైన తీగల వంతెన చైనాలోని జైషో. దీని పొడవు 2,680 మీటర్లు. అక్కడి క్వెయిన్‌టంగ్‌ నదిపై 2013లో దీన్ని నిర్మించారు.

* పశ్చిమబంగా రాజధాని కోల్‌కతాలో ఉన్న ‘విద్యాసాగర్‌ సేతు’ మన దేశంలో పొడవైన తీగల వంతెన. 121 తీగలుండే దీని పొడవు 822 మీటర్లు. అక్కడి హుగ్లీ నదిపై 1992లో దీన్ని నిర్మించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని