Raymond group: రేమండ్‌ వివాదం.. డైరెక్టర్‌గా నవాజ్‌ మోదీ తొలగింపు!

Raymond group: రేమండ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ సింఘానియా, ఆయన భార్య నవాజ్‌ మోదీ విడాకుల అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. తాజాగా ఆమెను గ్రూప్‌నకు చెందిన పలు కంపెనీల నుంచి డైరెక్టర్‌గా తొలగించారు.

Published : 26 Apr 2024 12:48 IST

ముంబయి: రేమండ్‌ గ్రూప్‌ (Raymond group) కంపెనీలైన జేకే ఇన్వెస్టర్స్‌, రేమండ్‌ కన్జ్యూమర్‌ కేర్‌, స్మార్ట్‌ అడ్వైజరీ అండ్‌ ఫిన్‌సర్వ్‌ నుంచి నవాజ్‌ మోదీ సింఘానియాను డైరెక్టర్‌గా తొలగించారు. ఈ విషయాన్ని ఆయా కంపెనీల అధికార ప్రతినిధులు గురువారం వెల్లడించారు. మార్చి 31న జరిగిన బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రేమండ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ సింఘానియా, నవాజ్‌ మోదీ విడాకుల అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది.

నవాజ్‌పై (Nawaz Modi Singhania) తాము విశ్వాసం కోల్పోయామని బోర్డులకు తెలియజేసినట్లు ఆయా కంపెనీల ప్రతినిధులు తెలిపారు. దీనిపై వెంటనే సమావేశం నిర్వహించాలని విజ్ఞప్తి చేశామన్నారు. ఈ నేపథ్యంలో గత నెల 31న భేటీయై ఆమెను తొలగించినట్లు చెప్పారు. తన తొలగింపును నవాజ్‌ తీవ్రంగా తప్పుబట్టారు. గౌతమ్‌ దుశ్చర్యలను బయటపెట్టినందునే తనపై కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు. దీన్ని చట్టపరంగా ఎదుర్కొంటానని తెలిపారు.

గౌతమ్‌ సింఘానియా, నవాజ్‌ మోదీ (Nawaz Modi Singhania) మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. గౌతమ్‌ తనని తీవ్రంగా వేధిస్తున్నారంటూ గత ఏడాది ఆమె ఆరోపించారు. తనను భౌతికంగానూ హింసించారని పేర్కొన్నారు. వీరిద్దరూ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. ఆస్తుల్లో వాటాల విషయంలో వివాదం నడుస్తోంది. మరోవైపు గౌతమ్‌ తండ్రి విజయ్‌పత్‌ సింఘానియా ఈ విషయంలో కోడలి పక్షానే నిలిచిన విషయం తెలిసిందే. తండ్రీకొడుకుల మధ్య కూడా వివాదాలు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని