Sunil Gavaskar: ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్‌ స్ట్రైక్‌రేట్‌పై గావస్కర్‌

హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్‌ గావస్కర్‌ విమర్శలు గుప్పించాడు.

Updated : 26 Apr 2024 13:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వరుసగా ఆరు ఓటముల తర్వాత బెంగళూరు ఎట్టకేలకు విజయాన్ని అందుకొంది. అదీ.. తమపై ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక పరుగులు నమోదు చేసిన హైదరాబాద్‌పై గెలిచి ప్రతీకారం తీర్చుకుంది. ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ 51 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచినా.. అతడి స్ట్రైక్‌రేట్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 43 బంతుల్లో 51 పరుగులు చేసిన అతడు ఉనద్కత్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఈ ఇన్నింగ్స్‌లో కోహ్లీ స్ట్రైక్‌ రేట్‌ 118 మాత్రమే. ఇందులో నాలుగు ఫోర్లు, ఒక సిక్స్‌ ఉన్నాయి. మరోవైపు రజత్‌ పటిదార్‌ 250 స్ట్రైక్‌రేట్‌తో మెరుపువేగంతో అర్ధ శతకం బాదడంతో జట్టు స్కోరు 200 దాటింది.

విరాట్‌ ఆటతీరుపై మాజీ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ స్పందించాడు. కోహ్లీ కొట్టిన హాఫ్‌ సెంచరీ ఎంతో విలువైనదే అయినా.. అతడి ఇన్నింగ్స్‌ చాలా సేపు బౌండరీలు లేకుండానే సాగిందన్నాడు.  ‘మధ్యలో అతడు లయ కోల్పోయినట్లు కనిపించింది. 31 పరుగుల నుంచి అనుకుంటా.. అతడు ఔట్‌ అయ్యే వరకూ ఒక్క బౌండరీ సాధించలేదు. ఇన్నింగ్స్‌ తొలి బంతి నుంచి ఆడుతూ.. 15వ ఓవర్‌లో ఔట్‌ అయ్యాడు. స్ట్రైక్‌ రేట్‌ 118. జట్టు అతడి నుంచి కోరుకుంటోంది ఇది కాదు’ అంటూ విశ్లేషించాడు.

ఈ సీజన్‌లో విరాట్‌ 9 ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 430 పరుగులు చేసి ఆరెంజ్‌ క్యాప్‌ రేసులో ముందున్నాడు. మొత్తంగా అతడి స్ట్రైక్‌ రేట్‌ 145గా ఉన్నప్పటికీ.. కొన్ని మ్యాచ్‌లో నిదానంగా ఆడాడని విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని