ఆ ఓడ ఖరీదు... 3 వేల కోట్లు!

ఓడంటే ఓ విశాలమైన డెక్‌, ఉండటానికి గదులు... ఇలాంటివే మనకు గుర్తొస్తాయి. అయితే ఓ పేద్ద ఓడుంది. చూసేందుకే భలే తమాషాగా ఉంది. పేరు ‘సెయిలింగ్‌ యాక్‌ ఏ’. ప్రపంచంలోని పేద్ద ఓడల్లో ఇదీ ఒకటట. ఈ మధ్యే నిర్మాణం పూర్తయ్యింది.

Published : 13 Oct 2016 00:50 IST

ఆ ఓడ ఖరీదు... 3 వేల కోట్లు!

ఓ పేద్ద ఓడ... దానిపై ఎత్తైన స్తంభాలు... వాటిలోనూ గదులు...అడుగడుగునా వింతలు... అవేంటో చదివేద్దామా?
డంటే ఓ విశాలమైన డెక్‌, ఉండటానికి గదులు... ఇలాంటివే మనకు గుర్తొస్తాయి. అయితే ఓ పేద్ద ఓడుంది. చూసేందుకే భలే తమాషాగా ఉంది. పేరు ‘సెయిలింగ్‌ యాక్‌ ఏ’. ప్రపంచంలోని పేద్ద ఓడల్లో ఇదీ ఒకటట. ఈ మధ్యే నిర్మాణం పూర్తయ్యింది. జర్మనీలోని హంబర్గ్‌ సమీపంలోని సముద్రంలో తొలిసారి సరదాగా షికారు చేసింది. అంతేనా? మరి దాని విశేషాలు ఇంకా బోలెడున్నాయి.
* చూసీ చూడటంతోటే దీనిపై ఎత్తైన మూడు టవర్లు ఆకర్షిస్తాయి. మధ్యలో ఉండే పొడవాటి టవర్‌ ఏకంగా 300 అడుగుల ఎత్తుంది. అంటే 30 అంతస్తుల భవనమంత. దాదాపుగా ‘స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీ’ అంతన్న మాట. దీనిలో గది కూడా ఉందట.
* ఈ మూడు టవర్ల వల్ల కలిగే లాభం ఏంటోగానీ చూడ్డానికి మాత్రం భలే వింత ఓడలా ఉంది. ఈ టవర్లకు ఆనుకుని ఓడ డెక్‌ మీదే విమానాలు దిగేందుకు మొత్తం 8 హెలీ ప్యాడ్లున్నాయి.
* దీని తయారీకి ఎంత ఖర్చయ్యిందో తెలుసా?దాదాపు 3వేల కోట్ల రూపాయలు!
* అంత ఖర్చుపెట్టి ఏ దేశ నావికా దళమో దీన్ని తయారు చేయించిందనుకుంటే పొరపాటే. రష్యాకు చెందిన ఓ బిలియనీర్‌ సొంతంగా ఈ విలాసవంతమైన ఓడని చేయించుకున్నారు. ఆ అంకుల్‌ పేరు ఆండ్రీ మెల్నిచెంకో. ఆయనకు ఇదివరకే ఓ సొంత బోయింగ్‌ విమానమూ ఉందట.
* ఈ ఓడ భారీ ఆకారం చూస్తే వందల మంది ప్రయాణించొచ్చేమో అనిపిస్తుంది. కానీ ఇందులో 20 మంది మాత్రమే ప్రయాణించే వీలుంది. మరో 54 మంది ఓడ సిబ్బంది ఉండటానికుంది.
* ఇది మొత్తం 468 అడుగుల పొడవుంది. గంటకు 20 నాటికన్‌ మైళ్ల వేగంతో ప్రయాణించగలదు. అంటే దాదాపుగా 37 కిలోమీటర్ల వేగంతో అన్నమాట!
* అత్యంత విలాసవంతంగా ఉండే ఈ ఓడలో టవర్లు కాకుండా ఎనిమిది అంతస్తులు ఉన్నాయి. వాటిల్లోనే స్విమ్మింగ్‌పూల్‌, హోటల్‌లాంటి ఏర్పాట్లూ ఉన్నాయి.
* దీనిలో మరో ప్రత్యేకత ఏంటంటే ఓడ అడుగున ఓ అద్దాల గది ఉంది. పారదర్శకంగా ఉన్న ఇందులో కూర్చుంటే ఎంచక్కా సముద్రం అడుగున చేపల్ని, అక్కడి అందాల్ని ప్రయాణిస్తూనే ఆస్వాదించేయొచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని