బుల్లి బూర్జ్‌ ఖలీఫా... భలే రికార్డు తెలుసా!

లెగో ఇటుకలు తెలుసుగా? చిన్న ముక్కల్ని అతికిస్తూ బోలెడు ఆకారాలు చేసుకోవచ్చు. రకరకాల ప్రదర్శనల్లో, వేడుకల్లో ఈ లెగో ఇటుకలతో వింత వింత నమూనా నిర్మాణాలు చేస్తుంటారు. అలా ఈ మధ్య ఓ పార్కులో బూర్జ్‌ ఖలీఫా లెగో ఆకాశహర్మ్యం నమూనాని ఏర్పాటు చేశారు.

Published : 27 Oct 2016 01:22 IST

బుల్లి బూర్జ్‌ ఖలీఫా... భలే రికార్డు తెలుసా!

ప్రపంచంలోనే ఎత్తయిన భవంతి ఏది? దుబాయ్‌లోని బూర్జ్‌ ఖలీఫా...మరి ప్రపంచంలోనే ఎత్తయిన లెగో నిర్మాణం? అది కూడా బూర్జ్‌ ఖలీఫానే!

లెగో ఇటుకలు తెలుసుగా? చిన్న ముక్కల్ని అతికిస్తూ బోలెడు ఆకారాలు చేసుకోవచ్చు. రకరకాల ప్రదర్శనల్లో, వేడుకల్లో ఈ లెగో ఇటుకలతో వింత వింత నమూనా నిర్మాణాలు చేస్తుంటారు. అలా ఈ మధ్య ఓ పార్కులో బూర్జ్‌ ఖలీఫా లెగో ఆకాశహర్మ్యం నమూనాని ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు కట్టిన వాటిల్లో ఇదే అతి ఎత్తయిన లెగో భవంతిగా రికార్డు కొట్టింది.

* 163 అంతస్తులుండే నిజమైన బూర్జ్‌ ఖలీఫా ఆకారంలోనే ఆకట్టుకునేలా నిర్మించిన ఈ లెగో కట్టడం 17 మీటర్ల ఎత్తు ఉంది. దాదాపు 55 అడుగులన్నమాట. అంటే అయిదు అంతస్తుల భవంతంత.

* ఇంతకీ ఎక్కడ నిర్మించారో చెప్పలేదు కదూ. త్వరలో దుబాయ్‌లో ప్రారంభం కాబోతున్న లెగోల్యాండ్‌ అనే ఓ అమ్యూజ్‌మెంట్‌ పార్కులో.

* దాదాపు ఆరు కోట్ల లెగో బ్రిక్స్‌ ఉపయోగించి 15 వేల లెగో నమూనా ఆకారాలతో ఈ లెగోల్యాండ్‌ను తీర్చిదిద్దుతున్నారు.

* వీటన్నింటిలో ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణ ఈ బూర్జ్‌ఖలీఫా లెగో భవంతేే.

* దీని తయారీకి ఐదు వేల గంటలు పనిచేశారు. 4,39,000 లెగో ఇటుకల్ని ఉపయోగించారు. ఈ లెగో నమూనా బరువు వెయ్యి కిలోలు.

* మిరుమిట్లుగొలిపే ఎల్‌ఈడీ విద్యుద్దీపాలతో అసలైన బూర్జ్‌ ఖలీఫాలా కనువిందు చేస్తోందిది.

మీకు తెలుసా?
* ఈ మధ్యే డెన్మార్క్‌లో ఓ నౌకా నిర్మాణ సంస్థ ప్ర¾పంచంలోనే అతి పెద్ద లెగో నౌక నమూనాన్ని తయారు చేసింది. దాదాపు 12 మీటర్ల పొడవున్న ఈ నౌక 2,860 కిలోల బరువుంది.

* లండన్‌లో ల్యాండ్‌ రోవర్‌ కంపెనీ లెగో ఇటుకలతో 13 మీటర్ల లండన్‌ బ్రిడ్జ్‌ ఆకారాన్ని తయారు చేసింది. 5,805,846 లెగో ఇటుకలతో అత్యధికంగా లెగో బ్రిక్స్‌తో చేసిన నమూనాగా ఈమధ్యే ఇది గిన్నిస్‌ రికార్డు కొట్టింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని