మొసలి తలండీ... మంచు చేపండి!!

అదాటున చూస్తే మొసలి తల ఈ చేపకు అతికించారా అన్నట్టు కనిపిస్తుందిది. తెల్లని రంగులో మెరిసిపోతూ ఇదేమైనా మంచుతో చేసిన బొమ్మా అనిపిస్తుంది కానీ అది సజీవమైన చేపే......

Published : 18 Nov 2016 01:34 IST

మొసలి తలండీ... మంచు చేపండి!!
రంగు రంగుల చేపల గురించి వినుంటారు...మరి మంచు చేప సంగతి తెలుసా?వింతగా ఉంటే వివరాలు చదివేయండి!

దాటున చూస్తే మొసలి తల ఈ చేపకు అతికించారా అన్నట్టు కనిపిస్తుందిది. తెల్లని రంగులో మెరిసిపోతూ ఇదేమైనా మంచుతో చేసిన బొమ్మా అనిపిస్తుంది కానీ అది సజీవమైన చేపే.

* ఈ వింత చేప ఉండే ప్రాంతం, రూపాల్ని బట్టి అంటార్కిటిక్‌ ఐస్‌ ఫిష్‌ అని, క్రొకడైల్‌ ఐస్‌ ఫిష్‌ అని పిలుస్తారు.

* ఈ చేప మైనస్‌ 2 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న చల్లని మంచు నీటిలోనూ ఉండగలదు. దీని శరీరంలో ఉన్న యాంటీ ఐస్‌ అనే ప్రత్యేక ప్రోటీన్‌ అది చల్లదనాన్ని తట్టుకునేలా చేస్తుంది.

* పారదర్శకంగా, తెల్లగా మెరుస్తూ కనిపించే దీని రూపానికి కారణం రక్తంలో హిమోగ్లోబిన్‌ ఉండకపోవడమే. దీంతో రక్తం కూడా తెల్లగా ఉండి శరీరం తెలుపు రంగులో కనిపిస్తుంది. మొప్పలతో పాటు పూర్తి శరీరం కూడా పారదర్శకంగా ఉండటం వల్ల మంచులా అనిపిస్తుందన్నమాట.

* ఆక్సిజన్‌ను శరీరానికి సరఫరా చేసే హిమోగ్లోబిన్‌ లేకపోయినా దీనికి ఆక్సిజన్‌ ఎలా అందుతుంది? శరీరానికి కావాల్సిన మొత్తం ఆక్సిజన్‌ను ఇది చర్మం ద్వారానే గ్రహిస్తుంది.

* ఇది మొదటిసారిగా 1927లో అంటార్కిటిక్‌ సముద్రంలో కనిపించింది.

* 30 అంగుళాల పొడవుండే ఈ మంచు చేప రెండు కిలోల బరువుంటుంది.

* ఇది ఎక్కువ సమయం సముద్రం అడుగునే గడుపుతుంది. ఎముకలు తేలికగా ఉండటం వల్ల సులువుగా ఈదుతూ చిన్న చిన్న జీవుల్ని చటుక్కున వేటాడుతుంది.

మీకు తెలుసా?
* ప్రపంచవ్యాప్తంగా మొత్తం 132 ఐస్‌ఫిష్‌ జాతులున్నాయి.

* క్రొకడైల్‌ ఐస్‌ఫిష్‌ల్లో ఇప్పటి వరకు మొత్తం 25 జాతుల్ని గుర్తించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని