మూడు రాజధానుల దేశమిది

ప్రపంచంలోని ప్లాటినంలో 90 శాతం ఉన్న ప్రాంతం... ఇంతకీ ఏంటది? ఏమిటా వివరాలు? *దక్షిణ ఆఫ్రికా.... ఆఫ్రికా ఖండపు దక్షిణ భాగంలోని దేశమిది. దీనికి అట్లాంటిక్‌, హిందూ మహా సముద్రాలు, నమీబియా, బోస్ట్వానా, జింబాబ్వే, మొజాంబిక్‌, స్వాజిలాండ్లు సరిహద్దులు. * దక్షిణ ఆఫ్రికా దేశానికి ఓ ప్రత్యేకత ఉంది. అది ఏమిటంటే... ఈ దేశంలో లెసోతో అనే మరో దేశం ఉంటుంది. ఈ లెసోతో దేశాన్ని దక్షిణ ఆఫ్రికా పూర్తిగా ఆవరించి ఉంటుందన్నమాట....

Published : 24 Sep 2017 01:44 IST

మూడు రాజధానుల దేశమిది 

ప్రపంచంలోని ప్లాటినంలో 90 శాతం ఉన్న ప్రాంతం... ఇంతకీ ఏంటది? ఏమిటా వివరాలు?
*దక్షిణ ఆఫ్రికా.... ఆఫ్రికా ఖండపు దక్షిణ భాగంలోని దేశమిది. దీనికి అట్లాంటిక్‌, హిందూ మహా సముద్రాలు, నమీబియా, బోస్ట్వానా, జింబాబ్వే, మొజాంబిక్‌, స్వాజిలాండ్లు సరిహద్దులు.
* దక్షిణ ఆఫ్రికా దేశానికి ఓ ప్రత్యేకత ఉంది. అది ఏమిటంటే... ఈ దేశంలో లెసోతో అనే మరో దేశం ఉంటుంది. ఈ లెసోతో దేశాన్ని దక్షిణ ఆఫ్రికా పూర్తిగా ఆవరించి ఉంటుందన్నమాట.
* ఈ దేశంలో మొత్తం 11 అధికారిక భాషలున్నాయి.
* ఈ దేశంలోనే పురాతనమైన మనిషి అవశేషాలు దొరికాయి. శాస్త్రవేత్తలు వాటిని బాగా పరిశీలించి చూస్తే అవి దాదాపు 1,60,000 ఏళ్ల నాటివని తెలిసింది.
* దక్షిణ ఆఫ్రికాకు ‘రెయిన్‌బో నేషన్‌’ అనే పేరుంది. ఇక్కడి భిన్న సంస్కృతుల వల్లే ఆ పేరొచ్చింది.
*సాధారణంగా ఏ దేశానికైనా రాజధాని ఒకటే ఉంటుంది. కానీ దక్షిణ ఆఫ్రికాకు మాత్రం కార్య నిర్వాహక, న్యాయ, శాసన వ్యవస్థలకు విడివిడిగా మూడు రాజధానులున్నాయి. అవి ప్రిటోరియా, బ్లూంఫౌంటేన్‌, కేప్‌టౌన్‌.

జెండా: రుపు, తెలుపు, నీలం రంగుల్ని బోయర్‌ రిపబ్లిక్‌ ప్రాంతాల్నించి, పసుపు, నలుపు, ఆకుపచ్చ రంగుల్ని ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ జెండా నుంచి తీసుకున్నారు.

దేశం: దక్షిణ ఆఫ్రికా
రాజధానులు: ప్రిటోరియా, బ్లూంఫౌంటేన్‌, కేప్‌టౌన్‌
జనాభా: 5,49,56,900
విస్తీర్ణం: 12,21,037 చదరపు కిలోమీటర్లు
భాషలు: జులు, హోసా, ఆంగ్లం, ఆఫ్రికాన్స్‌, సోతో....
కరెన్సీ: దక్షిణ ఆఫ్రికన్‌ రాండ్‌

* పాలిచ్చి పెంచే జీవుల్నే క్షీరదాలు అంటారని తెలుసుగా. నేలపై క్షీరదాలన్నింటిలో ఇక్కడి ఆఫ్రికన్‌ ఏనుగులు అతి పెద్దవి. ఇవి 11 టన్నుల బరువుంటాయి!
* ఈ దేశంలో మొత్తం 900 రకాల పక్షులుంటాయి. భూమిపై ఉండే పక్షుల్లో పది శాతం ఇక్కడివే.

* ఇక్కడి కేప్‌ టౌన్‌ దగ్గర్లోని ‘టేబుల్‌ మౌంటేన్స్‌’ ప్రపంచంలోని పర్వతాల్లో పురాతనమైనవిగా చెబుతారు. వీటి శిఖరం చదునుగా బల్లలా ఉండటం వల్లే ఆ పేరు. ఈ పర్వతంపై దాదాపు 1500 రకాల మొక్కలుంటాయట. మొత్తం యూకేలో కనిపించే వాటికన్నా ఈ ఒక్క పర్వతంపైన ఉండే వాటి సంఖ్యే ఎక్కువట. వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి పర్యటకులు వస్తుంటారు.

నల్ల సూర్యుడు మండేలా నేల! 

* ప్రపంచానికే ఆదర్శప్రాయుడైన నెల్సన్‌ మండేలా పేరు వినే ఉంటారుగా. దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు. జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. జాతిని ఏకం చేయడానికి ఎంతో కృషి చేశారు. 20వ శతాబ్దపు అత్యంత ప్రసిద్ధులైన ప్రపంచ నాయకుల్లో ఒకరు. దక్షిణాఫ్రికా పేరు వినగానే గుర్తొచ్చేది ఈ నల్లజాతి సూరీడే. ఈయనకు స్ఫూర్తి మన గాంధీ తాత.

* మన జాతిపిత గాంధీజీ పోరాట యోధుడిగా మారడానికి తొలి అడుగు పడింది దక్షిణాఫ్రికాలోనే. రాజకీయ పరమైన అసమానతలకు నిరసనగా శాంతియుత సత్యాగ్రహ సిద్ధాంతం రూపుదిద్దుకుంది ఇక్కడే.
* గొప్ప ఖనిజ సంపదున్న దేశమిది. భూమిపై దొరికే ప్లాటినంలో 90 శాతం, ప్రపంచంలో దొరికే బంగారంలో 41 శాతం ఇక్కడి గనుల్లోనే ఉన్నాయట.
* ప్రపంచంలో ఎక్కువగా పండ్లు ఉత్పత్తి చేసే దేశాల్లో ఇది రెండోది.

* జోహెన్స్‌బర్గ్‌లో ఎక్కువ మొత్తంలో దాదాపు 60 లక్షల చెట్లుంటాయి. అందుకే ఈ ప్రాంతాన్ని భూమిపై ఉన్న అతి పెద్ద ‘మ్యాన్‌మేడ్‌ ఫారెస్ట్‌’గా పిలుస్తారు.
* పాములు, మొసళ్లు, తాబేళ్లు వంటి పాకే జీవులు (సరీసృపాలు) ఉన్నాయిగా... వీటన్నింటిలో ప్రపంచంలోని అతి పెద్ద సరీసృపాల్లో ఒకటి ‘లేదర్‌బ్యాక్‌ టర్టిల్‌’. ఇది ఉండేది ఇక్కడే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని