కొండలెక్కగలవా.. చర్చికెళ్లగలవా?

క్రిస్మస్‌ పండుగ వచ్చేసింది... బోలెడు సందడి తెచ్చేసింది... చర్చిలన్నీ కిటకిటలాడగ... పిల్లా పెద్దా ప్రభువును కొలవగ... నేస్తాలంతా రారండి... చిత్రమైన చర్చిల కథ వినరండి! మనందరికీ చాలానే చర్చిలు తెలుసుంటాయి. కానీ ఎక్కడో ఆకాశంలో ఉండే వాటి గురించి తెలుసా? ఓ దేశంలో మాత్రమే ప్రత్యేకంగా ఇలాంటి చిత్రమైన చర్చిలున్నాయి. వాటి గమ్మత్తయిన సంగతులేంటో చూద్దాం రండి....

Published : 25 Dec 2017 01:49 IST

కొండలెక్కగలవా.. చర్చికెళ్లగలవా?

క్రిస్మస్‌ పండుగ వచ్చేసింది...
బోలెడు సందడి తెచ్చేసింది...
చర్చిలన్నీ కిటకిటలాడగ...
పిల్లా పెద్దా ప్రభువును కొలవగ...
నేస్తాలంతా రారండి... చిత్రమైన చర్చిల కథ వినరండి!

నందరికీ చాలానే చర్చిలు తెలుసుంటాయి. కానీ ఎక్కడో ఆకాశంలో ఉండే వాటి గురించి తెలుసా? ఓ దేశంలో మాత్రమే ప్రత్యేకంగా ఇలాంటి చిత్రమైన చర్చిలున్నాయి. వాటి గమ్మత్తయిన సంగతులేంటో చూద్దాం రండి.

* క్కడ గాలి వీచే శబ్దం తప్ప మరో మాటే వినిపించదు. మత గురువులు తప్ప మరెవరూ కనిపించరు. చర్చి గంట కొడితే అన్ని దిక్కుల నుంచీ ప్రతిధ్వనిస్తుంటుంది. అంత ప్రశాంతమైన వాతావరణంలో కొన్ని చర్చిలున్నాయి. అబ్బ వెంటనే అలాంటి చోటుకెళ్లి ప్రార్థనలు చేస్తే బాగుండు అనిపిస్తుంది కదూ! ఎవ్వరైనా అక్కడకెళ్లి ప్రార్థనలు చేసుకోవచ్చు. అయితే అక్కడ షరతులు లేవు గానీ వర్తిస్తాయ్‌.
*ఎందుకంటే ఈ చర్చిలన్నీ ఎత్తయిన పర్వత శిఖరాల మీదుంటాయి. ఎక్కడంటే ఆఫ్రికా ఖండంలోని ఇథియోపియా దేశంలో. ఇక్కడ టీగ్రెయ్‌ చర్చిలంటే అందరికీ తెలుసు. అక్కడికి వెళ్లడమంటేనే సాహసం.

*వీటిల్లోకి వెళ్లి ప్రార్థనలు చేసుకోవాలంటే మెట్ల దారుల్లాంటివేమీ ఉండవు. పర్వతాలపై కేవలం రాళ్లు రప్పలు ఒడిసి పట్టుకుని పైపైకి పోవాలి. సన్నని కొండ దారుల్లో ఒడుపుగా నడవాలి. తాళ్లు పట్టుకుని పైకి ఎగబాకాలి. కాలు పట్టనంత చిన్న వంతెనలపై గుండెలు చిక్కబట్టుకుని ధైర్యంగా ముందుకు సాగాలి. ఎక్కడ పట్టుతప్పినా అంతే సంగతులు. ఇందుకే వాటిని చేరుకోవడమే ఎంతో కష్టమైన పని. ఇంత సాహసం చేసి చర్చి లోపలికెళ్లి ప్రభువుని మొక్కిన వారి ఆనందానికైతే ఇక ఆకాశమే హద్దు. పైగా వీటిల్లోపల గోడలు, పైకప్పుల మీద క్రైస్తవ చరిత్రకు సంబంధించినవి బొమ్మల రూపంలో కనువిందు చేస్తాయి. ఇలాంటి బొమ్మల కళని ఫ్రెస్కో అంటారు.
*క్కడ ఇసుకరాతి పర్వతాలున్నాయి. చాలానే ఎత్తుంటాయవి. పైగా ఎక్కువ వాలుగా కాకుండా నిట్టనిలువున నిలబడినట్లుంటాయి. ఈ పర్వతాల సముదాయంలోనే ఈ చర్చిలు ఉన్నాయి. ఎంత ఎత్తున ఉంటాయబ్బా? అంటే... అబునె యెమాతా గుహ్‌ అనేది సముద్ర మట్టానికి 2500 అడుగుల ఎత్తున ఉంటుంది. అంటే రెండు ఈఫిల్‌ టవర్లను ఒకదానిపై ఒకటి నిలబెడితే అంతకన్నా ఎక్కువ ఎత్తులోనే ఇదుంటుంది. అలాంటి దీనిలోకి వెళ్లడం ఎంత కష్టమన్నది మీరే వూహించుకోండి.

*యితే ఈ చుట్టుపక్కల నివసించే ప్రజలు మాత్రం ఎంత కష్టమైనా ఈ చర్చిల్లోనే తమ పిల్లలకు బాప్టిజం ఇప్పించాలనుకుంటారట. అలా పైకి ఎక్కేప్పుడు పడిపోయి దాదాపుగా రెండు వేల మందికిపైగానే చనిపోయారట.
*లాంటి చర్చిలు ఇక్కడ 200కు పైగా ఉన్నాయి. వాటిల్లో ఇప్పుడు కొన్నింటి జాడ తెలియడం లేదు కూడానట. మనుషులెవ్వరూ లేకపోవడంతో అవలా పర్వతాల్లోనే ఉండిపోయాయట.
*ఇంత కష్టమైన చోట అసలు ఈ చర్చిలను ఎవరు నిర్మించారబ్బా? అనే సందేహం ఎవ్వరికైనా వస్తుంది కదూ. అందుకు ఒక పెద్ద చరిత్రే ఉంది మరి.

*వీ వెయ్యేళ్లకు ముందే కట్టిన చర్చిలు. అన్నీ ఇసుక రాతి పర్వతాల్ని తొలిచి లోపల నిర్మించినవే.
*తొమ్మిది మంది క్రైస్తవ గురువులుండేవారు. ఈజిప్టు దేశస్థులైన వీరు 15వ శతాబ్దానికి ముందే ఈ మత ప్రచారం మొదలుపెట్టారు. అప్పట్లోనే కొన్ని దేశాల్లో గ్రామగ్రామానా తిరిగారు. అలా పర్యటనల్లో ఉన్నప్పుడే ప్రజలందరికీ ఈ మతంపై ఆసక్తి కలిగించేందుకు ఇలాంటి చర్చిలను ఏర్పాటు చేశారు. వాటిల్లో క్రైస్తవ చరిత్రకు సంబంధించిన బోలెడు చిత్రాలూ గీశారు. మొత్తానికి ఈ చర్చిలు భలేగా ఉన్నాయి కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని