విజయవాడలో ప్రధాని రోడ్‌షో నేడు

ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన మంత్రి మోదీ.. బుధవారం విజయవాడ నగరంలో కూటమి ఆధ్వర్యంలో నిర్వహించనున్న రోడ్‌షోలో పాల్గొననున్నారు. ప్రధానితోపాటు తెదేపా, జనసేన అగ్రనేతలు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు కూడా హాజరవుతారు.

Updated : 08 May 2024 05:47 IST

మోదీతోపాటు పాల్గొననున్న చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌
భారీగా తరలిరానున్న కూటమి నాయకులు, కార్యకర్తలు

ఈనాడు - అమరావతి, న్యూస్‌టుడే - విజయవాడ సిటీ: ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన మంత్రి మోదీ.. బుధవారం విజయవాడ నగరంలో కూటమి ఆధ్వర్యంలో నిర్వహించనున్న రోడ్‌షోలో పాల్గొననున్నారు. ప్రధానితోపాటు తెదేపా, జనసేన అగ్రనేతలు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు కూడా హాజరవుతారు. బందరు రోడ్డులోని పీవీపీ మాల్‌ నుంచి బెంజి సర్కిల్‌ వరకు యాత్ర సాగనుంది. దాదాపు 1.5 కి.మీ దూరం ఉండే ఈ మార్గంలో రోడ్‌షో రాత్రి 7 గంటలకు మొదలై 8 గంటలకు పూర్తి అవుతుంది. ఈ కార్యక్రమానికి భాజపా, తెదేపా, జనసేన పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరుకానున్నారు. వేల మంది ఎంజీ రోడ్డులోకి రానుండడంతో నగరవాసులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే పోలీస్‌లు ట్రాఫిక్‌ మళ్లించారు. బుధవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి.

ఆరుగురు ఐపీఎస్‌ అధికారుల పర్యవేక్షణ

ఎస్పీజీ (స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌) రక్షణ ఛట్రంలో ఉండే ప్రధాని మోదీ భద్రతకు సంబంధించి ఎటువంటి లోపాలు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. గత నెలలో సింగ్‌నగర్‌లో సీఎం జగన్‌ రోడ్‌షోలో రాయి విసిరిన ఘటన వంటివి చోటుచేసుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రోడ్‌షోకు హాజరయ్యే వారు కనిపించేలా బందరు రోడ్డుకు రెండు వైపులా ఫ్లడ్‌ లైట్లను నగరపాలక సంస్థ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. విద్యుత్తు సరఫరా నిలిపివేయకుండా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. రెండు వరుసల ఇనుప బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. వీటి మధ్యలో పోలీసులు, ప్రధాని భద్రతా సిబ్బంది ఉంటారు. ప్రధాని పర్యటనకు భారీగా పోలీసులను మోహరించనున్నారు. దాదాపు 5 వేల మంది విధుల్లో ఉండనున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి నగరంలోని బందరు రోడ్డు వరకు బందోబస్తు విధులు కేటాయించారు. ఎక్కడా లోపం తలెత్తకుండా మొత్తం ఆరుగురు ఐపీఎస్‌ అధికారులకు బాధ్యతలు అప్పగించారు. ఒక్కొక్కరికి ఒక్కో సెక్టార్‌ బాధ్యతలు అప్పగించారు.

అణువణువు సీసీ కెమెరాల్లో..

సాయంత్రం 6.30 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి మోదీ చేరుకుంటారు. అక్కడి నుంచి చెన్నై - కోల్‌కతా జాతీయ రహదారి మీదుగా నగర పరిధిలోకి ప్రవేశిస్తారు. స్క్యూ బ్రిడ్జి దాటిన తర్వాత నేతాజీ వంతెన మీదుగా వెటర్నరీ జంక్షన్‌ మీదుగా పీవీపీ మాల్‌ వద్దకు చేరుకుంటారు. అక్కడ రోడ్‌షో ప్రారంభమై.. బెంజి సర్కిల్‌ వద్ద ముగుస్తుంది. యాత్ర సాగే ఆ ప్రాంతం మొత్తం ఇప్పటికే ఉన్న సీసీ కెమెరాలకు అదనంగా మరో 200 వరకు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి అణువు నిఘా నేత్రాల పరిధిలోకి వచ్చేలా చూస్తున్నారు. ప్రతి 50 మీటర్లకు ఒకటి చొప్పున సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే బందరు రోడ్డులో చేస్తున్న ఏర్పాట్లను దిల్లీ నుంచి వచ్చిన ఎస్పీజీ బృందం క్షుణ్ణంగా పరిశీలించింది. మంగళవారం సాయంత్రం రెండు దఫాలు కాన్వాయ్‌ ట్రయల్‌ రన్‌ కూడా నిర్వహించారు. దిల్లీ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన వాహన శ్రేణికి తోడు అదనంగా స్పేర్‌ కాన్వాయ్‌ను కూడా సిద్ధం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని