చెట్టే కదా అని.. నరికేస్తే!

అదో.. పే..ద్ద వేప చెట్టు.. దాన్ని కొందరు నరుకుతున్నారు... ఎంతో మంది ఆ దారిలో వస్తూ.. వెళ్తున్నారు... ఈ దృశ్యాన్ని చూస్తూ వెళ్తున్నారు... పచ్చని చెట్టు ప్రాణం పోతుంటే.. ఓ పదో తరగతి విద్యార్థికి

Updated : 22 Feb 2021 01:14 IST

అదో.. పే..ద్ద వేప చెట్టు.. దాన్ని కొందరు నరుకుతున్నారు... ఎంతో మంది ఆ దారిలో వస్తూ.. వెళ్తున్నారు... ఈ దృశ్యాన్ని చూస్తూ వెళ్తున్నారు... పచ్చని చెట్టు ప్రాణం పోతుంటే.. ఓ పదో తరగతి విద్యార్థికి చూస్తూ.. చూస్తూ.. వదిలేయాలనిపించలేదు.. మరి ఏం చేశాడు!!
నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తికి చెందిన బేగిని శివకుమార్‌ పదో తరగతి విద్యార్థి. తల్లిదండ్రులు శ్యామల, వెంకటయ్య స్థానిక సహకార బ్యాంకులో అటెండర్‌, వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నారు. హైదరాబాద్‌లో ఉండే మావయ్య మహేశ్‌ వాళ్ల ఇంటికి సెలవుల్లో శివకుమార్‌ ఎక్కువగా వెళ్లేవాడు. ఆయన గతంలో సూపర్‌వైజర్‌గా జీహెచ్‌ఎంసీ పరిధిలోని పార్కుల్లో మొక్కల సంరక్షణ బాధ్యతలు చూసేవారు. ఎవరైనా పార్కులో, నగరంలోని రోడ్లపై మొక్కలు పీకేసినా, చెట్లను కొట్టివేసినా మావయ్య అధికారులకు ఫిర్యాదు చేయడాన్ని చాలాసార్లు గమనించాడు.
వేడుకకు వెళ్లి..
ఫిబ్రవరి మొదటి వారంలో హైదరాబాద్‌లోని బంధువుల ఇంట్లో ఓ వేడుక ఉంటే శివకుమార్‌ వెళ్లాడు. అక్కడి నుంచి వైశాలినగర్‌లో ఉండే తన మావయ్య ఇంటికి వెళ్తున్న క్రమంలో రోడ్డు పక్కన పే..ద్ద వేపచెట్టును కొందరు కొట్టి వేస్తుండటాన్ని గమనించాడు. నేరుగా వెళ్లి వారికి చెబితే వినేలా లేరు. వారిని అడ్డుకునే శక్తీ తనకు లేదు. వెంటనే మావయ్యకు ఫోన్‌ చేసి విషయం చెప్పాడు. అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లమని ఆయన టోల్‌ఫ్రీ నంబర్‌ ఇచ్చారు.
కాపాడలేకపోయినా..
ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్‌ చేసి తనను పరిచయం చేసుకోవటంతోపాటు చెట్టును కొట్టివేస్తున్న ప్రాంతం వివరాలు తెలిపాడు. కానీ అధికారులు వెళ్లే సరికే చెట్టును నరికేశారు. నిబంధనల ప్రకారం చెట్టును కొట్టివేయాలంటే అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి. ఇవేమీ పాటించకపోవటంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు చెట్టును కొట్టివేయించిన వ్యక్తికి రూ.62,075 జరిమానా విధించారు. ఈ వార్త దేశవ్యాప్తంగా వైరల్‌ అయింది. చాలా మంది శివకుమార్‌ను ప్రశంసించారు.  

గవర్నర్‌ నుంచి పిలుపు
విషయం తెలుసుకున్న తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌.. శివకుమార్‌, అతడి తల్లిదండ్రులను ఇటీవల రాజ్‌భవన్‌కు పిలిపించుకున్నారు. శివకుమార్‌ను  జ్ఞాపిక, శాలువాతో సన్మానించారు. ఆక్స్‌ఫర్డ్‌ నిఘంటువును బహుమతిగా ఇచ్చారు. అతడు ఆ చెట్టును కాపాడలేకపోయినా.. వృక్షాలను ఎలా రక్షించాలో చాలామందికి దారి చూపినవాడయ్యాడు కదా! భవిష్యత్తులో సైన్యంలో చేరి దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవటమే తన లక్ష్యమని చెబుతున్న శివకుమార్‌కు మనం
ఆల్‌ ది బెస్ట్‌ చెబుదామా మరి!

- తిరుపతి పెద్ది,  మహబూబ్‌నగర్‌ డెస్క్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని