తెలుపు... కాదు... నలుపు.. కాదు!

హాయ్‌ నేస్తాలూ.. మీరు ఎలుగుబంటిని చూసే ఉంటారు కదా..!! ‘ఏ రంగు ఎలుగుని చూశారు?’

Published : 10 Oct 2023 00:48 IST

హాయ్‌ నేస్తాలూ.. మీరు ఎలుగుబంటిని చూసే ఉంటారు కదా..!! ‘ఏ రంగు ఎలుగుని చూశారు?’ - అని ఎవరైనా అడిగితే, ‘అదేంటి.. మామూలుగా ఎలుగుబంటి నలుపు రంగులోనే ఉంటుంది కదా! ధ్రువపు ఎలుగుబంటి అయితే తెలుపు రంగులో కనిపిస్తుంది’ అని టక్కున జవాబిచ్చేస్తారు. కానీ, ఓ రకం ఎలుగు మాత్రం బ్రౌన్‌ కలర్‌లో ఉంటుంది. ఇదిగో.. ఆ వివరాలు చెప్పిపోదామనే మీకోసం ఇలా మన పేజీలోకి వచ్చిందా ఎలుగు. మరింకెందుకాలస్యం.. ఆ విశేషాలను దాని మాటల్లోనే తెలుసుకోండి మరి..  

నన్ను ‘బ్రౌన్‌ బియర్‌’ అని పిలుస్తారు. శరీర రంగు వల్లే నాకు ఆ పేరు వచ్చింది. చైనా, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లోనే ఎక్కువగా కనిపిస్తుంటాను. చూడటానికి మీకు తెలిసిన ఎలుగుబంటిలాగే ఉన్నా.. నా లక్షణాలు కాస్త వేరుగా ఉంటాయి. సాధారణంగానే మా జాతి జీవుల కాళ్లు చాలా దృఢంగా ఉంటాయి. మావి అన్నింటికంటే ఇంకాస్త బలంగా ఉంటాయి. ముందు కాళ్ల పంజా పెద్దగా ఉండటంతో నివాసాన్ని ఏర్పరచుకునేందుకు, వేటకు బాగా ఉపయోగపడుతుంది. ఇంకో విషయం ఏంటంటే.. నా శరీరంపైన జుట్టు కూడా చాలా ఒత్తుగా పెరుగుతుంది.

శబ్దాలే మా మాటలు..  

కొన్ని జంతువులు రాత్రివేళల్లో, మరికొన్ని పగటి సమయంలో వేటాడతాయి. కానీ, నాకు మాత్రం సమయంతో పని లేదు. ఎప్పుడు ఆకలైతే అప్పుడే వేటాడేస్తా. ఎందుకంటే నేను ఎక్కువసేపు నిద్రపోను. ఆహారం కోసం ఎంత దూరమైనా ప్రయాణిస్తుంటా. రకరకాల శబ్దాలు చేస్తూ.. మాలో మేము సమాచారాన్ని చేరవేసుకుంటాం. అది మాకు మాత్రమే అర్థమవుతుంది.

అమ్మే నేర్పుతుంది..

నేను పుట్టిన తరువాత దాదాపు అయిదేళ్ల వరకు అమ్మ దగ్గరే ఉంటాను. గుహను ఎలా కట్టుకోవాలి.. ఎలా వేటాడాలి.. ఇలా అన్నీ అమ్మ దగ్గరే నేర్చుకుంటాను. ఒంటరిగా జీవించడానికి కావాల్సిన మెలకువలూ చెబుతుంది. మీకో విషయం తెలుసా.. మాలో మగ ఎలుగుబంట్లను ‘బోర్‌’ అనీ, ఆడ వాటిని ‘సౌ’ అని పిలుస్తుంటారు.  

నా చూపు మామూలుగా ఉండదు..  

నా శరీరంతో పోల్చుకుంటే మెదడు చాలా పెద్దగా ఉంటుంది. అలాగే నేను కాస్త తెలివైనదాన్ని కూడా.. చాలా దూరంలో ఉన్న జంతువులను కూడా ఇట్టే చూసి గుర్తుపట్టేయగలను. నా కళ్లు అంత స్పష్టంగా కనిపిస్తాయి మరి. నాకో గొప్పతనం కూడా ఉంది.. అదేంటంటే.. నేను ఫిన్‌లాండ్‌ దేశానికి జాతీయ జంతువును. నా బరువు సుమారు 100 నుంచి 635 కిలోల వరకు ఉంటుంది. ఎత్తు 70 నుంచి 153 సెంటీమీటర్ల వరకు పెరుగుతాను. గంటకు 53 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలను. నా జీవితకాలం సుమారు 50 ఏళ్లు.. నేస్తాలూ.. నా విశేషాలివీ.. మా అమ్మ పిలుస్తుంది.. ఇక ఉంటా మరి.. బై బై!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని