పొట్టి కాళ్ల మ్యావ్‌ఁ.. మ్యావ్‌ఁ..!

‘ఈ పిల్లులేంటి కాస్త వింతగా ఉన్నాయి’ అని చూస్తున్నారు కదూ! నిజమే ఇవి విచిత్రమైన పిల్లులే. మామూలు మ్యావ్‌ఁ.. మ్యావ్‌ఁ..లతో పోల్చుకుంటే వీటి కాళ్లు పొట్టిగా ఉంటాయి.

Updated : 02 Feb 2024 00:24 IST

‘ఈ పిల్లులేంటి కాస్త వింతగా ఉన్నాయి’ అని చూస్తున్నారు కదూ! నిజమే ఇవి విచిత్రమైన పిల్లులే. మామూలు మ్యావ్‌ఁ.. మ్యావ్‌ఁ..లతో పోల్చుకుంటే వీటి కాళ్లు పొట్టిగా ఉంటాయి. ఇంతకీ ఇవేం పిల్లులు.. ఎక్కడ ఉంటాయో తెలుసుకోవాలని తెగ ఆసక్తిగా ఉంది కదూ!

చూడ్డానికి ముద్దుగా, బొద్దుగా ఉన్న వీటి పేరు మంచ్కిన్‌ పిల్లులు. జెనటిక్‌ మ్యుటేషన్‌ వల్ల ఈ జాతి పిల్లులు ఉద్భవించాయి. వీటి ఉనికి 1940 నుంచే ఉంది. కానీ వీటిని 1991లోనే కొత్తజాతి పిల్లులుగా గుర్తించారు. అయినా ఇప్పటికీ చాలా దేశాల్లో ఈ జాతి పిల్లులను పెంచడంపై నిషేధం ఉంది. జన్యుపరివర్తన వల్ల ఇవి ఉద్భవించడం, చిన్న చిన్న కాళ్ల వల్ల వీటికి అనేక అరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉండటమే దీనికి కారణం! 1940 సంవత్సరం తర్వాత నుంచి చాలా దేశాల్లో ఈ మంచ్కిన్‌ పిల్లులు కనిపించాయి. 1944లో బ్రిటన్‌, 1956లో రష్యా, 1970లో అమెరికాలో ఈ పొట్టికాళ్ల పిల్లులు కనిపించాయి. కానీ చాలా సంవత్సరాలపాటు వీటిని కొత్తజాతి పిల్లులుగా గుర్తించలేదు.

కాస్త కుందేళ్లలా..

ఈ మంచ్కిన్లు చూడ్డానికి మామూలు పిల్లుల్లానే ఉంటాయి. శరీర పరిమాణం కూడా సాధారణంగానే ఉంటుంది. కానీ కాళ్లు మాత్రం చాలా పొట్టిగా ఉంటాయి. ఈ పిల్లులు చూడ్డానికి ఓ విధంగా కుందేళ్లలా కనిపిస్తాయి. కాళ్లు పొట్టిగా ఉండటం వల్ల ఇవి మామూలు పిల్లులంత వేగంగా కదలలేవు. దూకే సామర్థ్యం కూడా తక్కువ. ఈ పిల్లుల్లో మగవి 2.7 నుంచి 4.1 కిలోల వరకు బరువు పెరుగుతాయి. ఆడవేమో 1.8 నుంచి 3.6 కిలోల వరకు బరువు తూగుతాయి. మనలాంటి పిల్లలకు మాత్రం ఆడుకోవడానికి ఈ మంచ్కిన్‌ పిల్లులు భలే నచ్చుతాయి. 2014లో కాలిఫోర్నియాలోని నాపాకు చెందిన లిలీపుట్‌ అనే మంచ్కిన్‌ క్యాట్‌ ప్రపంచంలోనే అత్యంత పొట్టిపిల్లిగా రికార్డు సొంతం చేసుకుంది. అది 133 మిమీ పొడవు మాత్రమే ఉండేది.

ఆరోగ్య సమస్యలు...!

ఈ పొట్టి కాళ్ల పిల్లులకు ఇతర పిల్లులతో పోలిస్తే చాలా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయట. ముఖ్యంగా.. ఎముకలు, వెన్నెముక సమస్యలు వస్తాయట. అందుకే నెదర్లాండ్స్‌, ఆస్ట్రేలియాతో సహా చాలా దేశాల్లో ఇప్పటికీ వీటి సంతానోత్పత్తిపై నిషేధం ఉంది. ఈ పిల్లులను ఉద్దేశపూర్వకంగా సృష్టించడం, పెంచడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ మంచ్కిన్స్‌లో మళ్లీ కొన్ని క్రాస్‌ బ్రీడ్స్‌ ఉన్నాయి. అవి కూడా ఇలాగే పొట్టికాళ్లతో ఉంటాయి. నేస్తాలూ మొత్తానికి ఇవీ పొట్టికాళ్ల పిల్లి విశేషాలు.. భలే ఉన్నాయి కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని