Haibujji: నిజాయతీకి దక్కిన కొలువు!

నరసింహపురంలోని శేషయ్య తన మిత్రుడైన రామయ్య ఇంటికి బయలుదేరాడు. అతడు వేరే ఊరిలో ఉంటాడు. గతంలో ఎప్పుడూ తన మిత్రుడి ఇంటికి పోలేదు! అందువల్ల రామయ్య ఇల్లు అతనికి తెలియదు. శేషయ్య బండి దిగి కనబడిన వారినందరినీ ‘రామయ్య ఇల్లు ఎక్కడ?’ అని అడిగాడు.

Updated : 07 Jun 2024 05:47 IST

నరసింహపురంలోని శేషయ్య తన మిత్రుడైన రామయ్య ఇంటికి బయలుదేరాడు. అతడు వేరే ఊరిలో ఉంటాడు. గతంలో ఎప్పుడూ తన మిత్రుడి ఇంటికి పోలేదు! అందువల్ల రామయ్య ఇల్లు అతనికి తెలియదు. శేషయ్య బండి దిగి కనబడిన వారినందరినీ ‘రామయ్య ఇల్లు ఎక్కడ?’ అని అడిగాడు. ఇంతలో అతనికి నందనయ్య అనే వ్యక్తి కనిపించి... ‘అయ్యా! నేను ఆయన ఇల్లు చూపిస్తాను పదండి! నాకు మీ చేతిలో ఉన్న ఈ పెట్టె పట్టుకున్న కూలీ ఇస్తే చాలు’ అని అన్నాడు. అందుకు శేషయ్య సరేనన్నాడు.

 

వెంటనే నందనయ్య అతని చేతిలోని పెట్టెను తీసుకున్నాడు. శేషయ్య, నందనయ్య ఇద్దరూ పక్కపక్కనే నడుస్తున్నారు. ఇంతలో శేషయ్య వేలుకు ఉన్న ఉంగరం జారి పడింది. అది శేషయ్య గమనించలేదు. అతడు ముందుకు నడిచాడు. అది చూసిన నందనయ్య... ‘అయ్యా! మీ వేలి ఉంగరం జారి కింద పడిపోయింది’ అని చెప్పి దాన్ని తీసి ఇచ్చాడు. ఇద్దరూ రామయ్య ఉండే ఇల్లును చేరుకున్నారు. తర్వాత శేషయ్య నందనయ్యను.. తనతో కొద్దిసేపు ఉంటే కూలీ ఇచ్చి పంపిస్తానని చెప్పాడు. అందుకు నందనయ్య సరేనన్నాడు.

అది విశాలమైన పెద్ద భవంతి. ఆ భవనంలో ఎవరూ లేరు. తన మిత్రుడు వచ్చినందుకు ఆనందించిన రామయ్య ఎదురు వచ్చి, అతనికి ఇల్లంతా చూపించాడు. స్నానం చేయమని తాను వెంటనే తిరిగి వస్తానని చెప్పి అతడు బయటకు వెళ్లాడు. శేషయ్య తన జేబులోని నోట్ల కట్టను అక్కడ బల్ల మీద పెట్టి, స్నానానికని వెళ్లాడు. స్నానం పూర్తైన తర్వాత నందనయ్యకు కూలీ డబ్బులు ఇచ్చి, రేపు అతనితో తనకు పని ఉందని మళ్లీ రమ్మని చెప్పాడు. సరేనన్నాడు నందనయ్య. ఈలోపుగా శేషయ్య లోపలికి వెళ్లి ఆ నోట్లను లెక్క పెట్టుకున్నాడు. అవి సరిగానే ఉన్నాయి.

మరునాడు నందనయ్య, రామయ్య ఇంటికి వచ్చాడు. అప్పుడు అక్కడ వేణు అనే యువకుడు ఉన్నాడు. అతడు నందనయ్యను ఎందుకు వచ్చావని ప్రశ్నించాడు. అతడు తనకు పని ఇప్పిస్తానని, శేషయ్య రమ్మన్నాడని చెప్పాడు. అప్పుడు వేణు.. ‘ఇప్పుడు ఇక్కడ పని లేదు.. వెళ్లు’ అని అన్నాడు. అతడు అక్కడి నుంచి వెళ్లబోతుంటే.. వేణు అతణ్ని ఆపాడు. ‘చూడు అబ్బీ! ఈ ఇంట్లో నీకు రేపటి నుంచి నేను కొలువు ఇప్పిస్తాను. చేస్తావా!’ అని అడిగాడు. సంతోషంతో చేస్తానని అన్నాడు నందనయ్య.  

వెంటనే వేణు.. ‘కానీ అందుకు బదులుగా నువ్వు నాకు ఒక చిన్న పని చేసి పెట్టాలి’ అన్నాడు. ‘ఏమి పనో చెప్పండి’ అన్నాడు నందనయ్య. ‘అదిగో ! ఆ గదిలో నిద్రపోతున్న వ్యక్తికి తెలియకుండా, అతని చొక్కా జేబులో ఉన్న డబ్బును నాకు తెచ్చి ఇవ్వాలి. ఆ తర్వాత నీకు నేను ఇక్కడే, ఈ ఇంట్లోనే కొలువు ఇప్పిస్తాను సరేనా!’ అని అన్నాడు. అది విన్న నందనయ్య... ‘బాబూ! నాతో మీరు ఆ దొంగతనం చేయించాలనుకుంటున్నారు. కానీ నేను ఇంతవరకు అలాంటి పని చేయలేదు. చేయను కూడా!’ అని అన్నాడు. ‘అలాగైతే నీకు ఈ కొలువు దొరకదు. బంగారం లాంటి కొలువును నువ్వు అనవసరంగా పోగొట్టుకుంటున్నావు. ఆ తర్వాత నీ ఇష్టం’ అని అన్నాడు వేణు.

‘అయ్యా! నాకు దొంగతనం అంటే ఏమిటో ఇంతవరకు తెలియదు. కష్టపడి కూలి పని చేయడమే తప్ప!’ అని నందనయ్య అక్కడి నుంచి వెళ్లిపోసాగాడు. అప్పుడే బయటకు వచ్చిన శేషయ్య అతణ్ని పిలిచి... ‘శభాష్‌ నందనయ్యా! నువ్వు మేము పెట్టిన పరీక్షలో నెగ్గావు. నువ్వు రేపటి నుంచి ఇక్కడే పనిచేయవచ్చు. నీకు అడిగినంత జీతం మా మిత్రుడు రామయ్య ఇస్తాడు. నీ నిజాయతీ మాకు నచ్చింది. ఇదంతా మేము నీకు పెట్టిన పరీక్షనే’ అని అన్నాడు.  

అది విన్న నందనయ్య.. ‘అయ్యా! నాకేమిటి? పరీక్ష ఏమిటి!? నాకు ఏమీ అర్థం కావడం లేదు’ అని అన్నాడు. అప్పుడు శేషయ్య... ‘ఓ నందనయ్యా! మా రామయ్య నన్ను ఒక నిజాయతీ గల ఒక నౌకరును చూడమన్నాడు. అప్పుడు నేను ఈ ఊరికి వచ్చిన తర్వాత చూస్తానని చెప్పాను. నేను బండి దిగి నీతో వచ్చేటప్పుడు కావాలని నా ఉంగరాన్ని కింద పడవేశాను. దాన్ని నువ్వు నాకు తీసి ఇచ్చావు. అప్పుడు నీ నిజాయతీ నాకు అర్థమైంది. అదేవిధంగా కావాలని నేను నోట్ల కట్టను ఆ బల్ల పైన పెట్టి స్నానం కోసం వెళ్లాను. ఆ తర్వాత వాటిని లెక్కిస్తే అవి సరిగా ఉన్నాయి. అంటే నువ్వు అందులోని ఒక్క నోటును కూడా తీయలేదన్న మాట. అంటే నీకు అక్రమంగా దొరికే డబ్బు మీద ఆశ లేదని అర్థమైంది. అంతేకాదు. చాలా సేపటి తర్వాత నీకు కూలీ ఇచ్చినా ఓపికతో నిరీక్షించావు తప్ప, తొందరపడలేదు. దీన్ని బట్టి నీకు చాలా ఓర్పు ఉందని మాకు అర్థమైంది. అదేవిధంగా మా బంధువు వేణును రమ్మని, నిన్ను దొంగతనంగా నా జేబులోని డబ్బును తెమ్మనమని నేనే అతనికి చెప్పాను. అతడు నేను చెప్పినట్టే చేశాడు. అప్పుడు కూడా నువ్వు ఆ పనికి ఒప్పుకోలేదు. అంటే నువ్వు దొంగ పనులు చేయవని తెలిసింది. ఇలా నిజాయతీపరుడవైన నిన్ను ఈ కొలువుకు ఎంపిక చేశాను. మా మిత్రుడి ఇంట్లో రేపటి నుంచి నువ్వు పనిలో చేరు. అతడు వృద్ధాప్యంలో ఒంటరిగా ఉంటున్నాడు. అతణ్ని జాగ్రత్తగా చూసుకో’ అని అన్నాడు. 

 ఆ మాటలు విని నందనయ్య, ఆనందపడిపోయి... ‘అయ్యా! మీరెంత మంచివారు. నాకు తెలియకుండానే నన్ను పరీక్షించారు’ అని అన్నాడు. ‘అదేంకాదు. నీ నిజాయతీతో పాటు, నీకున్న మంచి గుణాలే నీకు ఈ కొలువును సంపాదించిపెట్టాయి. నీలాంటి మంచి వ్యక్తి దొరకడం మా రామయ్య అదృష్టం’ అని అన్నాడు. అప్పుడే చాటుగా ఉండి, అదంతా విన్న రామయ్య... ‘మిత్రమా! నాకు నీ తెలివి తేటలతో మంచి వ్యక్తిని ఎంపిక చేశావు. నీకు నా ధన్యవాదాలు. ఓ నందనయ్యా! నువ్వు రేపే వచ్చి పనిలో చేరు’ అని అన్నాడు. నందనయ్య ఎంతో సంతోషించి, సరేనని అన్నాడు.

సంగనభట్ల చిన్న రామకిష్టయ్య 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని