ఆహ్లాదం సొంతం కావాలంటే

కొనుగోలుదారుల ఆసక్తి, ప్రాధామ్యాలను బట్టి స్థలాల్లో తూర్పు దిక్కైతే ఒక ధర..రెండు దిక్కులు కలిసే చోట మరో రేటు.. రహదారి విశాలంగా ఉంటే ఇంకో ధర ఉంటుంటాయి.

Published : 08 Oct 2016 01:17 IST

ఆహ్లాదం సొంతం కావాలంటే
ఈనాడు, హైదరాబాద్‌

కొనుగోలుదారుల ఆసక్తి, ప్రాధామ్యాలను బట్టి స్థలాల్లో తూర్పు దిక్కైతే ఒక ధర..రెండు దిక్కులు కలిసే చోట మరో రేటు.. రహదారి విశాలంగా ఉంటే ఇంకో ధర ఉంటుంటాయి. అపార్ట్‌మెంట్లలోని ఫ్లాట్ల కొనుగోలులో ఇదివరకు ఈ తరహా అధిక వసూళ్లు ఉండేవి కావు. భారీ సముదాయాల రాకతో గత కొన్నేళ్లుగా క్రమంగా వీటిలోనూ భిన్న పేర్లతో ధరలు నిర్దేశించారు.

నగరంలో సొంతిల్లు అంటే ఇదివరకు మాదిరి విశాలమైన స్థలంలో కుటుంబ సభ్యుల ఆలోచనలకు తగ్గట్టుగా నచ్చిన రీతిలో కట్టుకునే అవకాశం లేదు. స్థలాల ధరలు పెరగడంతో ప్రధాన నగరంలో అపార్ట్‌మెంట్లనే ఆశ్రయిస్తున్నారు. మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వర్గాలు సైతం ఇందులోనే వారికి నచ్చినట్లుగా ఉండే వాటిని ఎంపిక చేసుకుంటున్నారు.

చెరువు, పార్కు..గోల్ఫ్‌
ఫ్లాట్‌లోని బాల్కనీలోంచి బయటకు చూసినపుడు చుట్టూ ఆహ్లాదకర వాతావరణం ఉంటే మనసు ఎంతో తేలిక పడుతుంది. అటువంటి అవకాశం ఉంటే ఎవరు మాత్రం కాదనుకుంటారు. ఇక్కడే డెవలపర్లు చ.అ.కు ప్రాథమిక ధర కంటే అదనంగా తీసుకుంటున్నారు. నిర్మిస్తున్న భవంతుల్లో ఫ్లాట్‌ తూర్పువైపు ఉంటే అదనంగా చెల్లించాల్సిందే. మన ఫ్లాట్‌లోంచి బయటకు చూస్తే ఉద్యానవనం కన్పించినా.. చెరువు కన్పించినా చ.అ.కు అదనంగా కొనుగోలుదారుడి నుంచి వసూలు చేసే ధర మారుతుంది. గతంలో ముందు బుక్‌ చేసిన వారికి ఇటువంటి సౌలభ్యాలను ఉచితంగానే ఎంచుకునే అవకాశం బిల్డర్లు ఇచ్చేవారు. ఇప్పుడు ప్రతిదానికి ధర వసూలు చేయడంపై కొనుగోలుదారులు పెదవి విరుస్తున్నారు. నగరంలో ప్రస్తుతం నిర్మిస్తున్న చాలావరకు ఆకాశహార్మ్యాలు సిటీలోని పార్కులు, అటవీ ప్రాంతం, చెరువుల సమీపంలో ఉంటున్నాయి. ఇక్కడ తమ ఇంట్లోని బాల్కనీ, కిటిలోంచి ఆ సుందర దృశ్యాలను చూసేందుకు ప్రీమియం ఛార్జీలను చెల్లించాల్సి వస్తోంది. కొందరైతే ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న ప్రాంతాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. వేల ఎకరాల్లో విస్తరించిన పచ్చదనానికి ఓటేస్తున్నారు.

విల్లాల్లోనూ..
శివార్లలో నిర్మిస్తున్న విల్లాల్లోనూ ఇటువంటి అదనపు ధరలను మొదటినుంచే వసూలు చేస్తున్నారు. గోల్ఫ్‌ కోర్టు ఎదురుగా విల్లా కావాలంటే చదరపు అడుగుకు ప్రాథమిక ధర కంటే అదనంగా చెల్లించాల్సిందే. ప్రాథమిక ధరతో పాటు ఇటువంటి ఛార్జీలను అవకాశం ఉన్న చోటల్లా కొందరు బిల్డర్లు కొనుగోలుదారుల నుంచి తీసుకుంటున్నారు.

బాల్కనీల వంతు..
స్థలం కొరత.. ధరల పెరుగుదలతో చాలావరకు అపార్ట్‌మెంట్లలో బాల్కనీల నిర్మాణాన్ని కోత పెట్టేశాయి. గతంలోమాదిరి విశాలమైన బాల్కనీలు ఇప్పుడు కన్పించడం లేదు. సగానికి సగం తగ్గేంచేశాయి. ఇతర నగరాల్లో వీటి కోసం కూడా చదరపు అడుగుకు అదనంగా చెల్లించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అపార్ట్‌మెంట్‌ సముదాయాల్లో అదనంగా కల్పించే సౌకర్యాలు భద్రత, క్లబ్‌హౌస్‌, ఈతకొలను, ఇతరత్రా వాటికి ఛార్జీలను చెల్లించేందుకు పెద్దగా అభ్యంతరపెట్టని కొనుగోలుదారులు.. చెరువు, పార్కు , గోల్ఫ్‌కోర్టుల పేరిట మరికొంత చెల్లించాల్సి వస్తోంది.

ఎత్తు పెరిగే కొద్దీ..
జనాభా పెరుగుతుండడంతో నగరంలో అయిదు అంతస్తుల అపార్ట్‌మెంట్ల స్థానంలో ఇప్పుడన్నీ భారీ సముదాయాలు నిర్మిస్తున్నారు. సిటీలో 34 అంతస్తుల వరకు బహుళ అంతస్తులను కడుతున్నారు. వీటిలో ఐదు అంతస్తుల వరకు ఒక ధర ఉంటే.. ఆపై ప్రతి అంతస్తుకు చ.అడుగు ధర పెరుగుతుంది. నిర్మాణ వ్యయం పెరుగుతుంది కాబట్టి వీటిలో అధికంగా వసూలు చేస్తున్నామని సంస్థలు ఈ సందర్భంగా చెబుతున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని