HMDA: 1030 ప్రాజెక్ట్‌లకు అనుమతి

ఎన్నికల కోడ్‌ ముగిసింది. స్థిరాస్తి రంగం ఊపందుకునే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సాధారణంగా ఎన్నికల సమయంలో స్థిరాస్తి మార్కెట్‌లో కొంత మందగమనం సహజమే..

Updated : 10 Jun 2024 13:29 IST

 అయిదు నెలల్లోనే  భారీగా జారీ
మున్ముందు మార్కెట్‌  దూసుకుపోయే సూచనలు
హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో లేఅవుట్లకు ప్రణాళిక

ఈనాడు, హైదరాబాద్‌: ఎన్నికల కోడ్‌ ముగిసింది. స్థిరాస్తి రంగం ఊపందుకునే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సాధారణంగా ఎన్నికల సమయంలో స్థిరాస్తి మార్కెట్‌లో కొంత మందగమనం సహజమే.. అయినా హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ్బహెచ్‌ఎండీఏ్శ పరిధిలో ఆ ప్రభావం పెద్దగా కనిపించలేదనే చెప్పాలి. గత అయిదు నెలల్లో హెచ్‌ఎండీఏ జారీ చేసిన అనుమతులే ఇందుకు నిదర్శనం. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత స్థిరాస్తి రంగంలో పురోగతి పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు హెచ్‌ఎండీఏ 1030 స్థిరాస్తి ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేసింది. తద్వారా రూ.336.31 కోట్లు ఫీజుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది. జూన్‌ నుంచి మార్కెట్‌ మరింత పుంజుకునే అవకాశం స్పష్టంగా ఉన్నట్లు ఆ రంగంలోని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కొత్త లేఅవుట్లు, భవనాల నిర్మాణాలు ఇతర ప్రాజెక్టుల అనుమతులు ఊపందుకోనున్నాయి. దీంతో అందుకు తగ్గట్లు హెచ్‌ఎండీఏ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం హెచ్‌ఎండీఏ పరిధిలో మేడ్చల్, ఘట్‌కేసర్, శంషాబాద్, శంకర్‌పల్లి జోన్లు ఉండగా వీటిని పెంచే దిశగా చర్యలు తీసుకోనున్నారు. అంతేకాక ప్రణాళికా విభాగాన్ని మరింత బలోపేతం చేయనున్నారు. అవసరమైన సిబ్బందిని నియమించనున్నట్లు   ఉన్నతాధికారులు తెలిపారు. త్వరలోనే దీనికి  కార్యచరణ మొదలు కానుంది. 

 పంచాయతీల్లోనూ టీజీబీపాస్‌ 

హెచ్‌ఎండీఏ పరిధిలోని పంచాయతీల్లో సైతం ఇక నుంచి తెలంగాణ లేఅవుట్‌ అండ్‌ బిల్డింగ్‌ పర్మిషన్‌ ఆమోదం, స్వీయ ధ్రువీకరణ వ్యవస్థ (టీజీబీపాస్‌) ద్వారానే అనుమతులు మంజూరు చేయనున్నారు. ఈ నెలాఖరు నుంచి డెవలప్‌మెంట్ పర్మిషన్‌ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ (DPMC) సేవలు నిలిపివేయనున్నారు. హెచ్‌ఎండీఏ ఏడు జిల్లాల పరిధిలోని 70 మండలాలు, 1032 గ్రామాలు, ఏడు కార్పొరేషన్లు, 30 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇప్పటివరకు ఆయా ప్రాంతాల్లో భవన నిర్మాణాలు, లేఅవుట్‌ పర్మిషన్ల కోసం టీజీబీపాస్‌తోపాటు 2016లో ప్రవేశపెట్టిన డెవలప్‌మెంట్‌ పర్మిషన్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్ (DPMC) ఆన్‌లైన్‌ విధానాన్ని వాడుతున్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వరకు టీజీబీపాస్‌ పరిమితం చేసి హెచ్‌ఎండీఏ పరిధిలోని గ్రామ పంచాయతీల స్థాయిలో డీపీఎంఎస్‌ ద్వారా అనుమతులు మంజూరు చేస్తున్నారు. ఇది పాత విధానం కావడం వల్ల అనుమతుల విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీనిని గుర్తించిన అధికారులు పంచాయతీల్లో సైతం టీజీబీపాస్‌ విధానంలోనే అనుమతులు మంజూరు చేయనున్నారు. ఫలితంగా లేఅవుట్లు, భవనాల అనుమతుల్లో వేగం పెరిగి స్థిరాస్తి మార్కెట్‌ పుంజుకోవడానికి మరింత దోహదం చేస్తుందని భావిస్తున్నారు. 

లేఅవుట్ల ప్రక్రియ కొలిక్కి 

అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు హెచ్‌ఎండీఏ సొంత స్థలాల్లో లేఅవుట్లు అభివృద్ధి చేసి వాటిని వేలంలో విక్రయించడం ద్వారా భారీ ఆదాయం సమకూరింది. ఏడు జిల్లాల పరిధిలో  పలుచోట్ల లేఅవుట్లు వేయగా.. కొనుగోలుదారుల నుంచి మంచి స్పందన వచ్చింది. రూ.ఐదారు వేల కోట్లకు పైగా ఆదాయం సమకూరడటమే కాకుండా స్థిరాస్తి రంగానికి ఊపునిచ్చింది. హెచ్‌ఎండీఏ లేఅవుట్లకు చుట్టుపక్కల ప్రైవేటు భూముల్లో సైతం లేఅవుట్లు సిద్ధమయ్యాయి. ఇలా కోకాపేట్, బుద్వేల్, మోకిల లాంటి ప్రాంతాల్లో లేఅవుట్లు వేసి విక్రయించడంతో పెద్ద రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు ముందుకొచ్చి వీటిని కొనుగోలు చేశాయి. కోకాపేట్‌లో స్థలాలు రూ.కోట్లలో పలికాయి. తర్వాత అసెంబ్లీ ఎన్నికలు.. కొత్త ప్రభుత్వం కొలువు తీరడం.. వెంటనే ఎంపీ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడటంతో హెచ్‌ఎండీఏ ఈ ఆన్‌లైన్‌ వేలాన్ని నిలిపివేసింది. కోడ్‌ ముగియడంతో మళ్లీ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. లేమూరు, ఇన్ములనర్వ తదితర ప్రాంతాల్లో వేయి ఎకరాల్లో ల్యాండ్‌పూలింగ్‌ ద్వారా రైతుల నుంచి సమీకరించి అక్కడ 150, 200, 300, 600 గజాల్లో లేఅవుట్లు అభివృద్ధి చేయాలని ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసింది. లేమూరులో ఈ ప్రక్రియ కొలిక్కి వచ్చింది. 


ముంబయి తర్వాత మనమే 
ఎం.దానకిషోర్, ప్రిన్సిపల్‌ కార్యదర్శి, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ

స్థిరాస్థి మార్కెట్‌ వృద్ధిలో ముంబయి తర్వాత హైదరాబాద్‌ ముందుంది. టీజీబీపాస్‌ ద్వారా దరఖాస్తు చేసుకుంటే నిర్ణీత గడువులోనే అనుమతులు అందిస్తున్నాం. గత అయిదు నెలల్లోనే దాదాపు 2.31 కోట్ల చ.అ. విస్తీర్ణానికి సంబంధించి లేఅవుట్లు, ఇతర నిర్మాణాలకు హెచ్‌ఎండీఏ ద్వారా అనుమతులు మంజూరు చేశాం. దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. నిర్ణీత సమయం కంటే ఆయా అధికారులు వద్ద ఎక్కువ రోజులు ఉంటే జాప్యానికి కారణాలు చెప్పాల్సిందే. ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తే సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడానికి వెనకాడం. దీనిపై ప్రతి వారం సమీక్షిస్తున్నాం. బహుళ అంతస్తుల భవనాల అనుమతుల్లో  వేగం పెంచాం. ఎప్పటికప్పుడు కమిటీ సమావేశమై దరఖాస్తులను పరిష్కరిస్తున్నాం. హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు త్వరలో శ్రీకారం చుట్టనున్నాం. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని