Real Estate: ఎన్నికల ఫలితాలతో మార్కెట్‌ గమనమెటు?

సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. కేంద్రంలో ఎన్డీఏ సర్కారు మరోసారి కొలువుదీరబోతుంది. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి అధికార పగ్గాలు చేపట్టబోతుంది.

Updated : 08 Jun 2024 02:37 IST

హైదరాబాద్‌ రియాల్టీలో జోరుగాచర్చ

ఈనాడు, హైదరాబాద్‌ : సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. కేంద్రంలో ఎన్డీఏ సర్కారు మరోసారి కొలువుదీరబోతుంది. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి అధికార పగ్గాలు చేపట్టబోతుంది. ఈ పరిణామాలు దేశవ్యాప్తంగా, మరీ ముఖ్యంగా హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌పై ఎలాంటి ప్రభావం ఉంటుందనే చర్చ రియల్‌ ఎస్టేట్‌ వర్గాల్లో జోరుగా నడుస్తోంది. 

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో హైదరాబాద్‌లోని పలు రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు అక్కడ పెట్టుబడులు పెట్టాయి. గృహ నిర్మాణ ప్రాజెక్ట్‌లు చేపట్టాయి. ఉద్యోగులు, వ్యాపారులు కూడా అక్కడ స్థలాలు, భూములు కొనుగోలు చేశారు. జగన్‌ సర్కారు హయంలో రాజధాని తరలింపు, మూడు రాజధానులు అంశం తెరపైకి రావడంతో అక్కడ రియల్‌ ఎస్టేట్‌ కుప్పకూలింది. ఇప్పుడు మళ్లీ బాబు అధికారంలోకి రావడంతో అమరావతిలో స్థిరాస్తి రంగం తిరిగి ఊపందుకుంటుందనే చర్చ నడుస్తోంది. ఇన్నాళ్లు ఆ ప్రాంతంలో కొనేవారు, అమ్మేవారు లేకపోవడంతో.. ప్రత్యామ్నాయం లేక హైదరాబాద్‌లో వంద శాతం పెట్టుబడులు పెట్టారని ఇప్పుడు పరిస్థితి మారే అవకాశాలు ఉన్నాయనే చర్చ రియాల్టీ వర్గాల్లో నడుస్తోంది. ఆంధ్ర ప్రాంతం మూలాలున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, పెట్టుబడే పెట్టేవారు.. ఇప్పుడు కొంత అటువైపు చూసే అవకాశం లేకపోలేదని అంటున్నారు. చంద్రబాబు గత పాలన అనుభవాల దృష్ట్యా పెట్టుబడిదారులకు అనువైన వాతావరణం ఉంటుందని భావిస్తున్నారు. మరోవైపు తెలంగాణలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల కారణంగా 8 నెలలుగా స్థిరాస్తి మార్కెట్‌ స్తబ్దుగా ఉందని స్థిరాస్తి సంఘాలు చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్‌రెడ్డి సర్కారు అడుగులు ఎలా ఉంటే పరిశ్రమకు మేలు జరుగుతుందో కొందరు బిల్డర్లు సూచనలు, సలహాలు చేశారు. హైదరాబాద్‌ మహానగరానికి ఢోకా లేదని భరోసా ఇస్తూనే.. విధాన నిర్ణయాల్లో వేగిరం లేకపోతే పోటీలో వెనకబడే ప్రమాదం ఉందని సూచన చేశారు. జాతీయ స్థాయిలోనూ మళ్లీ మోదీ ప్రభుత్వానికే అధికారం కాబట్టి మార్కెట్‌లో స్థిరత్వం ఉంటుందని.. ఇది సానుకూల అంశమేనని స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థలు చెబుతున్నాయి. 


హైదరాబాద్‌కు ఢోకా లేదు కానీ..

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టబోతుంది. చంద్రబాబు నాయుడు సీఎంగా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తారనటంలో సందేహం లేదు. పెట్టుబడులు తేవడం అనేది ఆయనకు ఒక ప్రత్యేక లక్ష్యం. ఇప్పటికే చాలా పరిశ్రమలు గుజరాత్‌లో ఎక్కువ పెట్టుబడులు పెడుతున్నాయి. ఇప్పుడు బాబు రాకతో ఆంధ్రప్రదేశ్‌ కూడా పెట్టుబడుల ఆకర్షణకు మరింత గట్టిగా పోటీ పడుతుంది. ఇది హైదరాబాద్‌కు ఒక సవాల్‌ లాంటిదే.

  • అదే సమయంలో హైదరాబాద్‌ భవిష్యత్తుకు ఢోకా లేదు. ఇక్కడ ఉన్న భౌగోళిక వనరులు, మౌలిక సదుపాయాలు, దేశ విదేశీ సంస్థల కార్యాలయాలు.. ఇలా ఎన్నో అనుకూల పరిస్థితులు హైదరాబాద్‌కు ఉన్నాయి. దేశంలోనే చాలా అరుదైన నగరాల్లో ఇది ఒకటి. పెట్టుబడులు వస్తూనే ఉంటాయి. అలాగని ఏమాత్రం అలసత్వం తగదు. 

  • తెలంగాణలో పెట్టుబడిదారులకు మరింత సానుకూల వాతావరణం కన్పించేలా ప్రభుత్వం పరిశ్రమించాలి. విధాన నిర్ణయాలు అత్యంత వేగంగా తీసుకోవాలి. పారిశ్రామిక పాలసీ, ఆర్‌ఆర్‌ఆర్, ఫార్మాసిటీ, సెమీ కండక్టర్‌ పాలసీ.. ఇలా ఏదైనా ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుని దాని అమలుకు చర్యలు చేపట్టాలి. ఈ విషయాన్ని ప్రజలకు చేరవేసి ఒక సానుకూల వైఖరిని రాష్ట్రంలో తీసుకురావాలి. ఆరోగ్యరంగం, పర్యాటకం లాంటి సేవా రంగాలను ప్రోత్సహించాలి. 
  •  అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే ఫార్మాసిటీనే ఉదాహరణ. ఇక్కడ ఒక్కచోటనే దాదాపు 15వేల ఎకరాల భూమి అందుబాటులో ఉంది. అమరావతి రాజధాని ప్రాంతంలో దాదాపు సగం. ఇంత ల్యాండ్‌ బ్యాంక్‌ శంషాబాద్‌ విమానాశ్రయానికి సమీపంలో ఉండటం చాలా విశేషం. ప్రభుత్వం దార్శనికతతో ప్రణాళికలు రూపొందిస్తే ఇక్కడ ఎన్నో అద్భుతాలు చేయవచ్చు. ఇవన్నీ రియాల్టీ రంగానికి ఇంధనంగా ఉపయోగపడనున్నాయి. 

 విక్రాంత్‌ వాసిరెడ్డి, ఎన్‌సీఎల్‌ హోమ్స్‌ 


ఎన్‌డీఏ 3.0తో సానుకూలమే.. 

ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడం భారత ఆర్థిక వ్యవస్థ, రియల్‌ ఎస్టేట్‌ రంగంపై సానుకూల ప్రభావం చూపుతుంది. రాజకీయ స్థిరత్వం వినియోగదారులు, పెట్టుబడిదారుల మధ్య విశ్వాసాన్ని గణనీయంగా పెంచుతుంది. 2027 నాటికి మూడో అతిపెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి భారత్‌ సిద్ధమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో అనివార్యంగానే గృహాలకు డిమాండ్‌ ఉండబోతుంది. విధానాల పరంగా, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై సర్కారు నిరంతర దృష్టి ఉంది. భాజపా నాయకత్వంలోని ప్రభుత్వం తీసుకొచ్చిన రెరా వంటి చట్టాల స్ఫూర్తి ప్రభావవంతంగా ఉండాలంటే మరిన్ని ఉద్దీపన చర్యలు ఉండాలని భావిస్తున్నాం. ఎన్‌డీఏ 3.0 త్వరలో పూర్తి బడ్జెట్‌ను సమర్పించనుంది. గృహాలపై జీఎస్‌టీ భారాన్ని పునఃపరిశీలించడానికి, పన్ను మినహాయింపులు పెంచడానికి ఇది సరైన సమయం.
అమిత్‌ గోయల్, ఎండీ, ఇండియా సోథైబైస్‌ ఇంటర్నేషనల్‌ రియాల్టీ 


సరసమైన గృహాలకు ఊతం... 

కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధిపై నిరంతరాయంగా దృష్టి పెడుతుందని ఆశిస్తున్నాం. ఇది రాబోయే సంవత్సరాల్లో సరసమైన గృహాలకు ఊతమిస్తుందని భావిస్తున్నాం. నిధుల లభ్యతను సులభతరం చేయడానికి, విదేశీ పెట్టుబడిదారుల భాగస్వామ్యాన్ని పెంచడానికి రియల్‌ ఎస్టేట్‌ రంగానికి పరిశ్రమ హోదా కేటాయించాలి. ఎన్నికల ఫలితాల అనంతరం రియల్‌ఎస్టేట్‌ మార్కెట్‌ సెంటిమెంట్లు ఆశాజనకంగా ఉన్నాయి. ముఖ్యంగా బీఎస్‌ఈ రియాల్టీ ఇండెక్స్‌ 8400 దాటింది. 2008 తర్వాత ఇది గరిష్ఠ స్థాయికి చేరుకుంది. గత 5 రోజుల్లో నాలుగైదు శాతం పెరిగింది. 
 శ్రీనివాస్‌రావు, సీఈవో, వెస్టియన్‌


ట్రిలియన్‌ డాలర్ల మార్కెట్‌ లక్ష్యం దిశగా.. 

రియల్‌ ఎస్టేట్‌ రంగం కేంద్ర ప్రభుత్వం నుంచి నిర్మాణాత్మక సంస్కరణలు, విధాన మద్దతును కొనసాగించాలని ఆశిస్తోంది. రెరా, జీఎస్‌టీ, లాజిస్టిక్‌ పార్క్‌లు, డేటా కేంద్రాలకు సంబంధించిన జాతీయ విధానాలు, గతి శక్తి నేషనల్‌ మాస్టర్‌ ప్లాన్‌రూపంలో మౌలిక సదుపాయాల కల్పన గత దశాబ్దంలో రియల్‌ ఎస్టేట్‌ వాటాదారుల్లో విశ్వాసాన్ని నింపాయి. ఆర్థిక క్రమశిక్షణను కొనసాగిస్తూ.. వృద్ధిని సమతుల్యం చేయడానికి దీర్ఘకాలిక చర్యలు ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులు కీలకంగా ఉంటాయి. 2030 నాటికి దేశ జీడీపీలో 1315 శాతానికి రియల్‌ ఎస్టేట్‌రంగం 1 ట్రిలియన్‌ యూఎస్‌ డాలర్ల మార్కెట్‌ను చేరుకోవాలంటే ప్రగతిశీల విధానాలు అవసరం.  
  బాదల్‌ యాగ్నిక్, సీఈవో, కొలియర్స్‌ ఇండియా
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని