వచ్చేసారైనా వడ్డీరేట్లు తగ్గేలా చూడండి

వడ్డీరేట్లు అధికంగా ఉండటంతో ఆ ప్రభావం రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌పై కనిపిస్తోంది. తక్కువ వడ్డీరేట్లు ఉన్న సమయంలో ఇంటి కోసం, స్థలాల కోసం రుణాలు తీసుకుని పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు.

Published : 08 Jun 2024 01:52 IST

ఈనాడు, హైదరాబాద్‌ : వడ్డీరేట్లు అధికంగా ఉండటంతో ఆ ప్రభావం రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌పై కనిపిస్తోంది. తక్కువ వడ్డీరేట్లు ఉన్న సమయంలో ఇంటి కోసం, స్థలాల కోసం రుణాలు తీసుకుని పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. కొవిడ్‌ అనంతరం అత్యంత తక్కువగా 6.5 శాతంతో గృహరుణాలను బ్యాంకులు మంజూరు చేశాయి. ఆ సమయంలో క్రయ విక్రయాలతో మార్కెట్‌ కళకళలాడింది. డిమాండ్‌ పెరగడంతో స్థిరాస్తి ధరలు అనూహ్యంగా పెరిగాయి. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రెపో రేట్లను పెంచింది. దీంతో బ్యాంకులు గృహరుణాల వడ్డీరేట్లను పెంచాయి. వడ్డీరేట్లు 9 శాతం పైనే ఉన్నాయి. రెండేళ్లుగా ఆర్‌బీఐ రెపో రేట్లలో మార్పులు చేయకపోవడంతో బ్యాంకులు సైతం వడ్డీరేట్లను అలాగే కొనసాగిస్తున్నాయి. దీనిపై స్థిరాస్తి పరిశ్రమ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. తదుపరి సమావేశంలోనైనా రెపో రేటు తగ్గించి గృహ నిర్మాణ మార్కెట్‌కు ఊతం ఇవ్వాలని క్రెడాయ్‌ ఆర్‌బీఐని కోరింది. శుక్రవారం నాటి సమావేశంలో ఆర్‌బీఐ రెపోరేటులో ఎలాంటి మార్పు చేయలేదు. 

భారంగా వడ్డీరేట్లు

గతంలో తక్కువ వడ్డీరేట్లని రుణాలు తీసుకుని ఇళ్లు కొనుగోలు చేసినవారు చాలామంది ఉన్నారు. ఇంకొందరు స్థలాలు కొన్నారు. రెండేళ్లు తిరగకముందే వడ్డీరేట్లు 6.5 నుంచి ఏకంగా 9 శాతానికి పెరగడంతో ఈఎంఐ భారంగా మారింది. ముఖ్యంగా సామాన్య, మధ్యతరగతి వాసులు ఉపశమనం కోసం రెండేళ్లుగా ఎదురుచూస్తున్నారు.


గృహాలకు డిమాండ్‌ పెరగాలంటే.. 

దేశం గత ఆర్థిక సంవత్సరంలో మంచి ఆర్థిక వృద్ధి సాధించింది. ఇందులో రియల్‌ ఎస్టేట్‌తో పాటూ అన్ని రంగాల తోడ్పాటు ఉంది. తర్వాతి మానిటరీ పాలసీ సమయంలోనైనా రెపో రేటును తగ్గించే అంశాన్ని ఆర్‌బీఐ పరిశీలించాలి. ఫలితంగా తక్కువ గృహ రుణ వడ్డీరేట్లతో గృహాలకు డిమాండ్‌ పెరుగుతుంది
 బొమన్‌ ఇరానీ, అధ్యక్షుడు, క్రెడాయ్‌  


అందుబాటు ధరల ఇళ్ల కోసం.. 

 సరసమైన గృహ నిర్మాణ విభాగానికి సంబంధించి అత్యవసరంగా జోక్యం చేసుకోవాల్సి ఉంది. తర్వాతి మానిటరీ పాలసీ సమావేశంలో రెపో రేటును తగ్గిస్తే అందుబాటు ధరల్లోని గృహ మార్కెట్‌కు సానుకూల సంకేతాలు ఇచ్చినట్లు అవుతుంది. 
 జి.హరిబాబు, అధ్యక్షుడు, నరెడ్కో  
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని