మోతీచూర్‌ లడ్డూ బాగా కుదరాలంటే...

ప్ర: మోతీచూర్‌ లడ్డూ మా పిల్లలకు చాలా ఇష్టం. అయితే ఎప్పుడు చేసినా సరిగా కుదరడం లేదు. తయారీ విధానం, పాటించే చిట్కాలు చెబుతారా? 

Updated : 22 Aug 2021 06:31 IST

ప్ర: మోతీచూర్‌ లడ్డూ మా పిల్లలకు చాలా ఇష్టం. అయితే ఎప్పుడు చేసినా సరిగా కుదరడం లేదు. తయారీ విధానం, పాటించే చిట్కాలు చెబుతారా?  

-చంద్రకళ, హైదరాబాద్‌

మోతీచూర్‌ లడ్డూ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలుంటే సరిపోదు. దీన్ని తయారుచేయడానికి మనకు బోలెడు ఓపిక, సహనం కావాలి. హడావుడిగా చేస్తే అనుకున్న రంగు, రుచి, ఆకారం ఏవీ రావు.

దీని తయారీలో రెండు దశలుంటాయి. ఒకటి చక్కెర పాకం. దీనికోసం ఓ కప్పు చక్కెర, అర కప్పు నీళ్లు, చిటికెడు కుంకుమపువ్వు కావాలి. రెండోది.... బూందీ... ఇందుకోసం కప్పు సెనగపిండీ, చిటికెడు కుంకుమపువ్వు, ముప్పావుకప్పు నీళ్లూ, నాలుగు ఇలాచీలూ, పెద్దచెంచా పుచ్చపండు విత్తనాలు, తగినంత నూనె కావాలి.

చేయడమిలా...  మోతీచూర్‌ లడ్డూ చేయడానికి పంచదార పాకం తీగ పాకం చేసుకోవాలి. లడ్డూకి కావాల్సిన పూస చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. దీని కోసం ప్రత్యేకమైన గరిటె మార్కెట్‌లో దొరుకుతుంది. దీనికి చాలా సన్నని రంధ్రాలుంటాయి. ఈ లడ్డూ ప్రత్యేకతే చిన్న సైజు బూందీ. సెనగపిండిని చాలా జాగ్రత్తగా ఎక్కడా ఉండలు కట్టకుండా కలపాలి. దీనికోసం నాణ్యమైన పిండిని తీసుకోవాలి. ఈ పిండిలో చిటికెడు చొప్పున కుంకుమపువ్వు, ఆరెంజ్‌ పుడ్‌ కలర్‌ వేసుకోవాలి. అప్పుడే చక్కటి రంగు వస్తుంది.

జాగ్రత్తలివీ...

నూనె సరిగా కాగకముందే బూందీ వేస్తే బాండీ అడుగున చేరి చాలాసేపటి వరకు అక్కడే ఉంటుంది. అంతేకాదు నూనె మరీ ఎక్కువగా పీల్చుకుంటుంది. ఓ రకమైన వాసన వస్తుంది. దీన్ని తినలేం. అయితే నూనెను చాలాఎక్కువగా వేడి చేస్తే బూందీ రంగుమారి మాడిపోతుంది. కాబట్టి బూందీ చాలాసేపు వేగకుండా చూసుకోవాలి. బూందీ కరకరలాడితే లడ్డూ మెత్తగా రాదు. ఒకసారి బూందీ వేస్తే ముప్పావు నిమిషంలో తీయడానికి సిద్ధమవుతుంది. వేయించిన బూందీ నుంచి నూనె పూర్తిగా పోయేలా చూడాలి. వాటిని వెంటనే పంచదార పాకంలో వేయాలి. ముఖ్యంగా పాకం వేడిగా ఉండేలా చేసుకోవాలి. చల్లబడితే పంచదార గట్టిపడుతుంది. ఇది లడ్డూ చేయడానికి పనికి రాదు. కాబట్టి పాకాన్ని చిన్న మంటపై ఉంచుకోవాలి లేదా పాకం గిన్నెను వేడినీళ్లలో పెట్టాలి  బూందీ ఒకవేళ మరీ ఎక్కువగా వేగినట్లు అనిపిస్తే ఒకట్రెండు చెంచాల వేడినీళ్లు కలపొచ్చు. ఒకవేళ పెద్ద సైజు బూందీ చేసుకున్నట్లయితే చక్కెర పాకంలో నానిన బూందీని మిక్సీలో ఒకసారి బ్లెండ్‌ చేసుకుని లడ్డూ చేసుకోవచ్చు. చివరగా పుచ్చపండు విత్తనాలను కలిపి రుచికరమైన లడ్డులను తయారుచేసుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని