శ్రీనృసింహ జయంతి

భక్తితో తనను శరణు అన్న వారిని ఆదుకునేందుకు ఆ విష్ణుమూర్తి అన్ని సమయాల్లోను సిద్ధంగా వుంటాడు. తదేక భక్తితో ప్రార్థించిన బాల ప్రహ్లాదుడిని రక్షించేందుకు ఆ శేషశయనుడు

Published : 17 May 2016 19:21 IST

శ్రీనృసింహ జయంతి
మే 9

భక్తితో తనను శరణు అన్న వారిని ఆదుకునేందుకు ఆ విష్ణుమూర్తి అన్ని సమయాల్లోను సిద్ధంగా వుంటాడు. తదేక భక్తితో ప్రార్థించిన బాల ప్రహ్లాదుడిని రక్షించేందుకు ఆ శేషశయనుడు నారసింహ అవతారంలో భువిపై అవతరించిన సుదినమే శ్రీనృసింహ జయంతి. వైశాఖ శుక్ల చతుర్దశిని శ్రీనృసింహ జయంతిగా జరుపుకొంటాం. మనిషి దేహం, సింహ ముఖంలో అవతరించిన నారసింహుడు ఉగ్రుడై హిరణ్యకశిపుడని వధిస్తాడు. రాక్షసరాజు హిరణ్యకశిపుడు బ్రహ్మ వరబలంతో గర్వంగా ప్రవర్తిస్తుంటాడు. తన అన్న హిరణ్యాక్షుడిని శ్రీహరి సంహరించడంతో విష్ణుద్వేషిగా మారుతాడు.వైశాఖ శుక్ల చతుర్దశినాడు సాయం సంధ్య సమయంలో నారసింహ అవతారం దాల్చినట్టు పురాణాలు వెల్లడిస్తున్నాయి. హిరణ్యకశిపుడి సతీమణి లీలావతి. ఆమెకు నారద మహర్షి తన ఆశ్రమంలో ఆశ్రయం కల్పిస్తాడు. గర్భవతిగా వున్న లీలావతికి విష్ణుగాధలు చెబుతాడు. దీంతో గర్భంలో వున్న ప్రహ్లాదుడు విష్ణుభక్తుడిగా జన్మిస్తారు. ఆ విష్ణుభక్తికి భరించలేని హిరణ్యకశిపుడు బాలుడన్న కనికరం లేకుండా చిత్రహింసలకు గురిచేస్తాడు. కానీ హరి అభయంతో అన్ని ఉపద్రవాలను ప్రహ్లాదుడు అధిగమిస్తాడు. పగలు కానీ, రాత్రికానీ, మనిషి, జంతువుల చేత మరణం లేకుండా బ్రహ్మనుంచి వరం పొందుతాడు హిరణ్యకశిపుడు. ఆ గర్వంతో తనకు ఎదురులేదనే భావంతో విష్ణుద్వేషానికి పాల్పడుతాడు. ప్రహ్లాదుని భక్తిని భరించలేక హరి ఎక్కడో చూపమని కోరుతాడు. దీనికి సమాధానంగా ప్రహ్లాదుడు హరి సర్వోపగతుడు ఈ విశ్వంలో ఆ స్వామి లేని ప్రదేశమేలేదని బదులిస్తాడు. దీంతో ఈ స్తంభంలో వుంటాడా అని ప్రశ్నిస్తూ హిరణ్యకశిపుడు గదతో స్తంభాన్ని బాదుతాడు. విష్ణుమూర్తి ఉగ్రనరసింహుడిగా స్తంభంనుంచి బయటకు వచ్చి సాయం సంధ్య సమయంలో గడప మీద హిరణ్యకశిపుడిని సంహరిస్తాడు. బ్రహ్మ వరానికి భంగం కలుగకుండా స్వామివారు అటు మనిషి ఇటు పూర్తిగా మృగము కానీ అవతారంలో రావడం విశేషం. భక్తులను ఆదుకునేందుకు స్వామి ఎప్పుడూ సిద్దంగా వుంటారు అనేందుకు నారసింహ అవతారమే ఉదాహరణ.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు