వరలక్ష్మి వ్రతకథ చెప్పేదిదే..

సృష్టిలోని ప్రతి అంశానికీ ఒక ‘లక్షణం’ ఉంటుంది. సూర్యుడికి వెలుగు, గాలిలో ప్రాణం, చంద్రుడి వెన్నెల, నీటిలో రసత్వం...వంటివి. వీటితో పాటు కంటి చూపు, చెవి వినికిడి- ఇలా ఉన్న లక్షణాలే ఆయా అంశాలకు శక్తులు.

Published : 04 Aug 2017 10:07 IST

వరలక్ష్మి వ్రతకథ చెప్పేదిదే..

సృష్టిలోని ప్రతి అంశానికీ ఒక ‘లక్షణం’ ఉంటుంది. సూర్యుడికి వెలుగు, గాలిలో ప్రాణం, చంద్రుడి వెన్నెల, నీటిలో రసత్వం...వంటివి. వీటితో పాటు కంటి చూపు, చెవి వినికిడి- ఇలా ఉన్న లక్షణాలే ఆయా అంశాలకు శక్తులు. ఈ లక్షణాల్ని ఏ ఒక్కరూ కృత్రిమంగా సృష్టించలేరు. ఇవన్నీ ప్రాకృతిక శక్తులు!

పరమేశ్వరుడి నుంచి వ్యక్తమయ్యే శక్తి విశేషాలే ఇవి- అని భక్తులు విశ్వసిస్తారు. నిజానికి ఈ లక్షణ శక్తులే అసలైన ఐశ్వర్యాలు. ఈ ఐశ్వర్య రూపాలైన లక్షణ శక్తుల సమాహార స్వరూపమే ‘లక్ష్మీదేవి’.

సనాతన ధర్మంలోని ఈ లక్ష్మీభావన- ప్రకృతి రూపంలో గోచరించే పరమాత్మ విభూతిగా ఆరాధన అందుకుంటోంది. విజ్ఞులు మరో కోణంలో- శాస్త్రపరంగా గల అర్థాన్ని వివరించారు. జగతిలో అణువు మొదలు బ్రహ్మాండం వరకు గల అన్నింటినీ లక్షిస్తూ (గమనిస్తూ), ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఏమిటి ఎలా ఇవ్వాలో నిర్ణయించి అనుగ్రహించే శక్తినే వారు ‘లక్ష్మి’గా నిర్వచించారు.

ఈ శక్తికే ‘శ్రీ’ (సిరి) అని మరొక పేరుంది. ఇదే నామాన్ని శాస్త్రాలు ఒక మహామంత్రంగా భావిస్తున్నాయి. సృష్టి స్థితి లయలను నిర్వహించే పరమాత్మను ఆశ్రయించుకున్న శక్తినే ‘శ్రీ’ అంటారు. ఈ ఆశ్రయం అత్యంత ప్రత్యేకం. ఇది సూర్యుణ్ని ఆశ్రయించిన కాంతి, చంద్రుణ్ని ఆశ్రయించిన చంద్రిక వంటిది. భగవంతుణ్ని ఎన్నడూ ఎడబాయని ఆయన చిచ్ఛక్తి(చిత్‌, శక్తి)నే ‘శ్రీ’గా పరిగణిస్తారు. ఆ శక్తే మానవాళి పాలిట ఆశ్రయం!

మానవాళికి ఆధారమయ్యే శక్తి, పరమాత్మను ఆశ్రయించుకున్న శక్తి... ‘శ్రీ’. ‘లక్షణశక్తి’యే ఈ ‘శ్రీ’! ఈ శబ్దానికి నిఘంటుపరంగా శోభ, కాంతి, కళ, జ్ఞానం, విద్య అని అర్థాలున్నాయి. ఈ అర్థాలన్నింటి ఏకరూపమే శ్రీలక్ష్మి. ప్రతివారూ భక్తిపూర్వకంగా కోరుకొనేది ఈ లక్ష్మినే! ‘వరం’ అనే మాటకు ‘కోరుకొనేది’ అని అర్థం. అందుకే ఈ తల్లిని ‘వరలక్ష్మి’గా పిలుస్తారు.

విష్ణుపురాణ కథనం ప్రకారం- జగత్కారకుడైన పరమాత్మే శ్రీమహావిష్ణువు. భృగు ప్రజాపతి తపస్సు ఫలితంగా సంతానంగా పొందిన పరాశక్తి లక్ష్మి. ఆమె విష్ణువును వివాహమాడింది. ఈ తల్లి నిత్య, అనంత, ఆదిలక్ష్మి. నారాయణుడి వద్ద స్వాభావిక శక్తిగా గల ఈ మహాలక్ష్మిని- ఆయా లోకాల జీవుల యోగ్యతను అనుసరించి ‘విష్ణు కృపామూర్తి’గా వివిధ రూపాల్లో వ్యవహరిస్తారు. స్వర్గలక్ష్మి, భూలక్ష్మి, ధనలక్ష్మి, గృహలక్ష్మి, ధాన్యలక్ష్మి, విద్యాలక్ష్మి, ధైర్యలక్ష్మి, వీరలక్ష్మి, విజయలక్ష్మి, సంతానలక్ష్మి- ఇలా పలు అభివ్యక్తులతో అలరారుతుంది అమ్మ. ధనధాన్యాదులే జీవులు కోరే వరమైన అవసరాలు. ఈ సమస్త లక్ష్ముల ఏక స్వరూపమే ‘వర’లక్ష్మి!

భృగు ప్రజాపతి ప్రాధాన్యం కలిగిన ‘భృగు’(శుక్ర)వారంనాడు, ప్రతి మాసంలోనూ లక్ష్మి ఆరాధనను శాస్త్రం నిర్దేశించింది. మాసాల్లో ‘ఆర్ద్రత’కు ప్రధానమైన వర్షరుతువు మొదటి మాసమే శ్రావణం. అందులో వృద్ధిచెందే చంద్రకళకు నెలవైన శుక్లపక్షం, శుక్రవారం అత్యంత ప్రధానమైనవని ధార్మిక గ్రంథాలు ప్రస్తావించాయి. ‘ఆర్ద్రాం పుష్కరిణీం...’ అని శ్రీసూక్తం వర్ణించిన ‘ఆర్ద్ర’శక్తి- శాంతికి, పంటకు, ఐశ్వర్యానికి సంకేతం. శ్రావణం లక్ష్మీదేవికి ప్రధానమైంది.

స్త్రీలో లక్ష్మీకళ ఉందని ‘దేవీ భాగవతం’ వంటి పురాణ వాంగ్మయం చెబుతుంది. అందుకే ‘స్త్రీలను గౌరవించడం భారతీయుల ధర్మం’ అని రుషులు అనుశాసించారు. స్త్రీమూర్తులు లక్ష్మీకళతో తేజరిల్లుతూ లక్ష్మీదేవిని ఆరాధించే పర్వమే- శ్రావణ శుద్ధ శుక్రవారం.

సౌశీల్య, సౌజన్య, సౌమ్య, సాత్విక, శాంత, సద్గుణ, సంపదల సాకారమే మహాలక్ష్మి. దేవిని ఆరాధించడం వల్ల అందరిలోనూ ఆ దివ్య భావనా కిరణాలు జాగృతమై ప్రకాశిస్తాయని, ప్రకాశించాలని విజ్ఞులు ప్రబోధించారు.

వరలక్ష్మి వ్రతకథలో- సిద్ధి పొందిన కథానాయిక చారుమతి. మంచి మతి (బుద్ధి) మాత్రమే దేవీకృపకు పాత్రమవుతుంది అని మానవాళికి ఆ పాత్ర సంకేతమిస్తుంది. సంపదల్ని అడిగే ముందు ‘చారు’ (చక్కని) మతి కలిగి ఉండాలన్నదే దాని అంతరార్థం. ఆ సందేశం అర్థమైతే- వ్యక్తికి, సమాజానికి సౌభాగ్యప్రదం!

- సామవేదం షణ్ముఖశర్మ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని