మాటలు మురిపించి... ప్రతిభ పరిమళించి!

స్టార్‌ హీరోహీరోయిన్లు ఉన్న భారీ సినిమా కాదు... పవర్‌ఫుల్‌ పంచ్‌ డైలాగుల్లేవు...

Published : 15 Apr 2017 01:36 IST

మాటలు మురిపించి... ప్రతిభ పరిమళించి! 

స్టార్‌ హీరోహీరోయిన్లు ఉన్న భారీ సినిమా కాదు... పవర్‌ఫుల్‌ పంచ్‌ డైలాగుల్లేవు... ఉన్నదల్లా పాత్రల మధ్య మాటలే... ఆ సంభాషణలే ప్రేక్షకుల మనసుని తాకాయ్‌... జాతీయస్థాయి అవార్డుకు ఎంపిక చేశాయ్‌... ఈ మాటలకు కలం కదిపిందీ... తెలుగు సినిమా చరిత్రలోనే తొలిసారి సంభాషణలకు అవార్డు అందుకుందీ... పెళ్ళిచూపులు సినిమా దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ దాస్యం... అతడి అంతరంగం.

హైదరాబాద్‌లో పెరిగినవాణ్ని. మొదట్నుంచీ సినిమాలంటే ఇష్టం. ఓ పుట్టిన రోజుకి అమ్మ కెమేరా బహుమతిగా ఇచ్చింది. ఫొటోలు, వీడియోలతో ప్రయోగాలు చేసేవాణ్ని. ఓ డాక్యుమెంటరీ తీసి మా స్కూల్‌ స్నాతకోత్సవంలో ప్రదర్శించా. అప్పుడు మోగిన చప్పట్లు, అందిన ప్రశంసలు... నేనెప్పటికైనా సినిమా తీయాలనే లక్ష్యాన్ని నిర్దేశించాయి. నేను బొమ్మలు బాగా వేస్తా. బీటెక్‌లో ఉండగానే కొన్ని కంపెనీలకు పోస్టర్‌ డిజైనింగ్‌ చేసేవాణ్ని. వచ్చిన డబ్బులతో లఘుచిత్రాలు తీయడం మొదలుపెట్టా. ‘నువ్వేం చేసినా మనసుపెట్టి చెయ్‌. నువ్వేంటో నిరూపించుకో’ అమ్మానాన్నలు ప్రోత్సహించేవాళ్లు.

అమ్మతో ఆరంభం 

అమ్మ రాసిన కవితని ‘ఆర్టిస్ట్‌ పోయెమ్‌’ అనే షార్ట్‌ఫిల్మ్‌గా మలిచి ఐఐటీ మద్రాస్‌ ‘సారంగ్‌ ఫెస్టివల్‌’కి పంపా. రెండో బహుమతి దక్కింది. ఆ ఉత్సాహంతో జర్నీ, సెరెండిపిటీ, మినిట్స్‌ టు మిడ్‌నైట్‌, అనుకోకుండా, సైన్మా... రూపొందించా. కొన్ని కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌, ఇంఫాల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ప్రదర్శనకు ఎంపికయ్యాయి. ‘జునూన్‌’కి పీపుల్స్‌ ఛాయిస్‌ అవార్డు దక్కింది. ‘అనుకోకుండా’ని యూట్యూబ్‌లో అత్యధికులు వీక్షించారు. సైన్మాకీ పలు అవార్డులొచ్చాయి. తర్వాత నా అడుగు సినిమా. చాలామంది నిర్మాతలు, హీరోల్ని కలిశా. ప్చ్‌... ప్రయోజనం దక్కలేదు. సినిమా చాలా రిస్క్‌తో కూడుకున్న వ్యాపారం. నిర్మాత ఒక కొత్త వ్యక్తిని నమ్మి కోట్లు కుమ్మరించడని అర్థమైంది. అవకాశాల వేటలో చాలా మందిని కలిశా. సినిమా ఇవ్వకపోయినా పరిశ్రమ స్థితిగతులు, సినిమా ఎలా తీయాలి? ఎలా ఉండాలి? చాలా విలువైన విషయాలే చెప్పారు. సైన్మా చూసి మంచు లక్ష్మిగారు బాగా చేశావంటూ మెచ్చుకున్నారు. ఆమెతో కలిసి ఒక చిత్రం కోసం స్క్రిప్టు వర్క్‌ చేస్తున్నపుడే నా దురదృష్టంకొద్దీ నాన్న చనిపోయారు. కొన్నాళ్లు పని పక్కన పెట్టేశా. అవకాశం చేజారింది. హీరో విజయ్‌ దేవరకొండతో ముందు నుంచీ పరిచయముంది. తన ద్వారానే నిర్మాత రాజ్‌ కందుకూరిని కలిశా. పెళ్ళిచూపులు మొదలైంది.

జగమంత కుటుంబం

నాన్నది వరంగల్‌. అమ్మది తిరుపతి. ఆమె పుట్టిపెరిగింది చెన్నైలో. నేనూ అక్కడే పుట్టా. పెరిగింది హైదరాబాద్‌లో. నా భార్య లత కొన్ని యాడ్‌ ఫిల్మ్స్‌ చేసింది. తనది చిత్తూరు. ఓ స్నేహితుడి ద్వారా పరిచయమయ్యాం. ఇద్దరికీ సినిమాలంటే ఇష్టం. మణిరత్నం, ఏఆర్‌ రెహమాన్‌లంటే పిచ్చి. అదే మమ్మల్ని దగ్గర చేసింది. ఎవరి జీవితంలో అయినా మర్చిపోలేని ఆస్తి స్నేహితులు. మనం బంధువుల ముందు ఒకలా... ఇంట్లో ఒకలా ఉంటాం. ఫ్రెండ్స్‌ దగ్గరే మనలా ఉంటాం. నా సినీ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా నన్ను నిలబెట్టింది స్నేహితులే. పెళ్ళిచూపులులో కౌశిక్‌ పాత్ర కూడా ఓ ఫ్రెండ్‌ స్ఫూర్తితో సృష్టించిందే. ఇలాంటి వాళ్లు మన చుట్టూ ఉంటే ప్రతి రాత్రీ హాయిగా నిద్రపోగలుగుతాం.

* ‘పెళ్లి చేస్తాం. ఉద్యోగం వదిలెయ్‌’ అన్నారు ఒకమ్మాయి పేరెంట్స్‌. పెళ్ళిచూపులు చూశాక వాళ్ల తీరులో మార్పొచ్చిందట. ఆ అమ్మాయే ఎసెమ్మెస్‌ చేసింది. నా సినిమా ఒకరి మనస్తత్వాన్ని మార్చేయడం... ఇంతకన్నా పెద్ద అవార్డు ఏముంటుంది?
* నాటకానికి సంభాషణలే ప్రాణం. చివరి సీట్లో కూర్చున్నవారికీ ఆ మాటలు చేరాలి. సినిమాకు పాత్రలు, సన్నివేశాలు, పోరాటాలు, పాటలు... ఆకట్టుకునే అంశాలెన్నో ఉంటాయి. తక్కువ సంభాషణలతోనే సన్నివేశాన్ని పండించొచ్చు.
* ఆ సంభాషణలు మన ఇంట్లో... స్నేహితులతో మాట్లాడుతున్నట్టే సహజంగా ఉండాలనుకుంటా. లోతు కూడా ఉండాలి. అదే సూత్రంతో మాటలు రాసుకున్నా. సింక్‌ సౌండ్‌ ప్రయోగం చేశా. మన చుట్టూ ఉన్న సమాజాన్ని, వ్యక్తుల్ని నిశితంగా గమనిస్తే మంచి సంభాషణలు రాయొచ్చు.
* నవాజుద్దీన్‌ సిద్దిఖీతో సినిమా చేయాలనేది నా కోరిక. మహేశ్‌బాబు, వెంకటేశ్‌, పవన్‌కళ్యాణ్‌లన్నా అభిమానం. విజయ్‌ దేవరకొండ కూడా బాగా నటిస్తాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని