ఒక్కడిగా కదిలాడు... కోటిమంది ఆకలి తీర్చాడు!

చదువు పూర్తైంది.. కష్టపడకుండానే కార్పొరేట్‌ సంస్థలో ఉద్యోగమొచ్చింది...వేతనం పక్కవాళ్లు కుళ్లుకునేంత... మాల్స్‌లో షాపింగ్‌.. వీకెండ్‌లో పార్టీలు.. ఫ్రెండ్స్‌తో సరదాలు... దిల్లీ కుర్రాడు అంకిత్‌ కవాత్రా జీవితం బిందాస్‌గా గడిచిపోతోంది...

Published : 08 Jul 2017 01:50 IST

ఒక్కడిగా కదిలాడు... కోటిమంది ఆకలి తీర్చాడు! 

చదువు పూర్తైంది.. కష్టపడకుండానే కార్పొరేట్‌ సంస్థలో ఉద్యోగమొచ్చింది...వేతనం పక్కవాళ్లు కుళ్లుకునేంత... మాల్స్‌లో షాపింగ్‌.. వీకెండ్‌లో పార్టీలు.. ఫ్రెండ్స్‌తో సరదాలు... దిల్లీ కుర్రాడు అంకిత్‌ కవాత్రా జీవితం బిందాస్‌గా గడిచిపోతోంది... ఓరోజు ఓ పెళ్లికెళ్లాడు.. అదిగో అక్కడ మొదలైంది యూటర్న్‌... లైఫంటే నేను కడుపు నిండా తిని ఎంజాయ్‌ చేయడం కాదు.. పక్కవాడి ఆకలి గురించి ఆరా తీయడం అనే ఆలోచన మొదలైంది... ఉన్నపళంగా ఉద్యోగానికి రాజీనామా చేశాడు... మూడేళ్లు తిరిగేసరికి కోటిమంది ఆకలి తీర్చాడు... రెండువేలమంది సేవా సైన్యాన్ని తయారు చేశాడు... మంచి మనసుతో సేవాక్రతువుకే అంకితమైన అతడ్ని పలు అంతర్జాతీయ పురస్కారాలు వరించాయి... తాజాగా బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ నుంచి ప్రతిష్ఠాత్మక యంగ్‌ లీడర్‌ అవార్డు అందుకున్న ఈ పాతికేళ్ల స్ఫూర్తిప్రదాత విజయయాత్ర ఇది.

ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణం ఎయిడ్స్‌, మలేరియా, టీబీ.. ఇవేం కాదు. ఆకలి చావులు. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం భారత్‌లో పోషకాహారలోపం కారణంగా ఏడాదికి 31 లక్షల మంది చనిపోతున్నారు. ప్రపంచంలోని ప్రతి తొమ్మిది మంది పిల్లల్లో ఒకరు తీవ్ర పోషకాహారలేమితో బాధ పడుతున్నారు. 118 దేశాలతో గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ రూపొందిస్తే భారత్‌ది 97వ స్థానం. మరోవైపు ఇక్కడే ఏడాదికి 67మిలియన్‌ టన్నుల ఆహారం చెత్తకుప్పల పాలవుతోంది. ఇది దాదాపు బ్రిటన్‌ దేశపు మొత్తం ఉత్పాదకతతో సమానం. ఈ అంతరాలే అంకిత్‌లో పేదల ఆకలి తీర్చాలనే సంకల్పాన్ని కలగజేశాయి.

పెళ్లే దారి చూపింది 

2014 ఆగస్టు. పరిచయం ఉన్న ఓ సెలెబ్రెటీ పెళ్లికెళ్లాడు అంకిత్‌. ఘనంగా ఏర్పాట్లు చేశారు. అతిథుల కోసం 35 రకాల వంటకాలు సిద్ధం చేశారు. భోజనం చేస్తూ వడ్డించే వ్యక్తితో మాట కలిపాడు. వివాహానికి హాజరైంది వెయ్యి మందే అయినా ఐదువేల మందికి సరిపడా ఏర్పాట్లు చేశారనీ, మిగిలినదంతా వృథాయేనని చెప్పడంతో అతడి మనసు చివుక్కుమంది. మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి కుటుంబాల్లో వేడుకలు జరిగినపుడు ఇలా ఆహారం వృథా కావడం చాలాసార్లు గమనించాడు. మరోవైపు కడుపు నిండా తిండి దొరక్క నకనకలాడే అన్నార్థుల వెతలూ అతడికి తెలుసు. ఈ భిన్న పరిస్థితుల మధ్య ఒక నిచ్చెన వేయాలని భావించాడు. మరోసారి ఆహారం మిగిలిపోతే ఫోన్‌ చేయమని చెప్పి అక్కణ్నుంచి కదిలాడు.

తొలి అడుగు

దే క్యాటరర్‌ వారం తిరక్కుండానే మరో వేడుకలో అన్నం మిగిలిపోయిందని సమాచారమిచ్చాడు. సమయం అర్థరాత్రి దాటింది. ఓ మిత్రుడు తోడు రాగా కారుతో సహా అక్కడికెళ్లాడు. పెద్ద పాత్రల్లో అన్నం, కూరలు నింపుకొని వస్తుంటే పోలీసులు అడ్డు తగిలారు. వాళ్లకి విషయం అర్థమయ్యేలా చెప్పేసరికి చాలా సమయమే పట్టింది. వాహనాన్ని నేరుగా మురికివాడల్లో్లకి తీసుకెళ్లాడు. అర్థాకలితో నిద్రకుపక్రమించిన అక్కడి పేదలకు ఆ పూట కడుపు నిండింది. మనస్ఫూర్తిగా వాళ్లు దీవెనలిస్తుంటే అంకిత్‌ కళ్లు చెమర్చాయి. ఇంకేం.. లక్ష్యంపై స్పష్టత వచ్చింది. మరుసటిరోజే తాను పనిచేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఎక్కడి నుంచి ఆహారం సేకరించవచ్చు? ఎలా నిల్వ చేయాలి? పరిశోధన మొదలైంది. క్యాంటీన్లు, రెస్టరెంట్లు, క్యాటరర్లు, కార్పొరేట్‌ కార్యాలయాలు.. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి అన్నం, కూరలు మిగిలిపోతే తనకు ఇవ్వమని వేడుకున్నాడు. కొందరు పెద్దమనసుతో వెంటనే ఒప్పుకున్నారు. ఇంకొందరు అనుమానించారు. కొందరైతే ప్లేట్‌కి ఇంత ఇవ్వమని డిమాండ్‌ చేశారు. మొత్తానికి అతడికి ఓ సమగ్ర ప్రణాళిక సిద్ధమైంది. అప్పటిదాకా కూడబెట్టిన సొమ్ము, కొందరు దాతల సాయంతో ఇరవై నాలుగుగంటలపాటు ఆహారం నిల్వ ఉంచేలా ఓ రిఫ్రిజిరేటెడ్‌ వాహనం కొనుగోలు చేశాడు.

చేతులు జత కలిశాయి

న ఆలోచనని స్నేహితులు, పాత సహోద్యోగులతో పంచుకున్నాడు. సాయం చేసే మనసున్నవారు చేయి కలిపారు. 2014 నవంబరులో ‘ఫీడ్‌ ఇండియా’ సంస్థ మొదలైంది. పెళ్లిళ్లు, పార్టీలు, క్యాంటీన్లు, రెస్టరెంట్లకు వెళ్లి మిగిలిపోయిన ఆహారం సేకరించి వాటిని అనాథాశ్రమాలు, ప్రభుత్వ పాఠశాల్లోని పిల్లలు, వృద్ధులు, అంగవైకల్యం ఉన్నవారికి ప్రత్యక్షంగా అందించేవాడు. కొంచెం గుర్తింపు రాగానే డొనేషన్‌ డ్రైవ్‌ల పేరుతో కార్యక్రమాలు నిర్వహించేవాడు. వీటికి సెలెబ్రెటీలు, ఫుడ్‌ బ్లాగర్లు, రెస్టరెంట్‌ యజమానులు, టీవీ తారలను పిలిచేవాడు. అంతర్జాలం ద్వారా కూడా బాగా ప్రచారం చేశాడు. ఈ సత్ప్రయత్నాన్ని అభినందిస్తూ చాలామంది సాయం చేసేవారు. అలా దిల్లీలో మొదలైన ఫీడ్‌ ఇండియా మూడేళ్లలోనే 43 నగరాలు, పట్టణాలకు విస్తరించింది. రెండువేల మంది ఫీడింగ్‌ హీరోలు రోజుకి పదిహేను వేలమంది అన్నార్థుల ఆకలి తీర్చే యజ్ఞంలో భాగస్వాములయ్యారు. అంకిత్‌తోపాటు శ్రిష్టీ జైన్‌, ఆకాశ్‌ కశ్యప్‌, సోనికా పృథ్వీ అనే యువతరంగాలు కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2030 నాటికి ఆకలి లేని భారతదేశాన్ని చూడాలని కలలు కంటున్న ఫీడింగ్‌ ఇండియా పరోక్షంగా పర్యావరణహితానికి కూడా పాటు పడుతోంది. వృథా అయిన ఆహారం చెత్తకుప్పల పాలైతే దుర్వాసన వస్తుంది. తర్వాత మీథేన్‌ వాయువు విడుదలై గ్లోబల్‌వార్మింగ్‌కి కారణమవుతుంది. పైగా భోజనం వండటం కూడా ఎంతో శ్రమ, ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే. మిగిలిపోయిన అన్నాన్ని ఆకలితో అలమటించే వారికి అందించడం అంటే రెండురకాలుగా సాయం చేయడమే.

మంచిమనసుకి గుర్తింపు

* ‘సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన- 2030’ పేరుతో ఐక్యరాజ్యసమితి ఏడాది కిందట నిర్వహించిన కార్యక్రమానికి అంకిత్‌ ఎంపికయ్యాడు. వందలమంది యువ ప్రతినిధులు, ప్రపంచ నాయకుల సమక్షంలో పేదరికం, ఆకలిపై ఎలా పోరాడాలో తన ఆలోచనలు వివరించాడు. ఈ ప్రతిష్ఠాత్మక ఎంపిక కోసం 186 దేశాల నుంచి పద్దెనిమిదివేలమంది పోటీ పడ్డారు.
* ప్రఖ్యాత మేగజైన్‌ ప్రపంచగతిని మార్చగల, ప్రభావశీలురైన ముప్ఫైఏళ్ల లోపు ముప్ఫైమంది యువత జాబితాను రూపొందిస్తే అంకిత్‌కి అందులో చోటు దక్కింది. సామాజిక సేవ, నాయకత్వ లక్షణాల ఆధారంగా అతడ్ని ఎంపిక చేశారు.
* బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ సింహాసనం అధిష్టించి అరవై ఏళ్లు అయిన సందర్భంగా.. ప్రపంచవ్యాప్తంగా సమాజహితానికి పాటుపడుతున్న 18 నుంచి 29 ఏళ్లలోపు వయసున్న అరవైమందిని యంగ్‌ లీడర్‌లుగా ఎంపిక చేసి ప్రత్యేక ఆహ్వానాలు పంపారు. జూన్‌ 29న బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌లో రాణి చేతులు మీదుగా అంకిత్‌ అవార్డు అందుకున్నాడు. జూబిలీ ట్రస్ట్‌, రాయల్‌ కామన్వెల్త్‌ సొసైటీ, కామిక్‌ రిలీఫ్‌ అనే సంస్థలు ఈ పురస్కారానికి ఎంపిక చేశాయి.

* రోజుకి 20 కోట్లమంది కాలే కడుపుతో నిద్రపోతున్నారు
* ఏడాదికి పదమూడు లక్షలమంది పిల్లలు ఆహారలేమి సంబంధిత రోగాలతో చనిపోతున్నారు.
* 42 శాతం పిల్లలు పోషకాహారలోప సంబంధిత రోగాలతో బాధ పడుతున్నారు.
* 58,000 కోట్లు.. భారత్‌లో యేటా వృథా అవుతున్న ఆహారపదార్థాల విలువ
* 40 శాతం.. మొత్తం ఉత్పత్తయ్యే ఆహారపదార్థాల్లో వృథాగా పోతున్నవి
* ప్రపంచవ్యాప్తంగా 73 కోట్లమంది కడుపు నిండా తిండికి నోచుకోవడం లేదు.
మీరూ ఈ సేవా క్రతువులో భాగస్వామి కావాలనుకున్నా.. మిగిలిపోయిన ఆహారం సద్వినియోగం అయ్యేలా అన్నార్థులకు అందించాలనుకుంటున్నా...www.feedingindia.org వెబ్‌సైట్‌లో సంప్రదించవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని