మా అమ్మే ‘నాన్న’

సంతోష్‌ శోభన్‌.. శోభన్‌... పేరు ఎక్కడో విన్నట్లుందే.. అనుకుంటున్నారా? అవును సూపర్‌ హిట్‌ చిత్రం ‘వర్షం’ దర్శకుడాయన. ఆ దివంగత దర్శకుడి కొడుకే సంతోష్‌...

Published : 08 Sep 2018 01:39 IST

మా అమ్మే ‘నాన్న’

సంతోష్‌ శోభన్‌..
శోభన్‌... పేరు ఎక్కడో విన్నట్లుందే.. అనుకుంటున్నారా? అవును సూపర్‌ హిట్‌  చిత్రం ‘వర్షం’ దర్శకుడాయన. ఆ దివంగత దర్శకుడి కొడుకే సంతోష్‌ శోభన్‌. ‘పేపర్‌ బాయ్‌‘లో తన ప్రియురాలు ధరణితో ‘నా వెనకాల చీకటుంద’ని చెబుతాడు హీరో. ఆ చిత్రంలో రవిలాగే నిజ జీవితంలోనూ చీకటి రుచి చూసిన యువకుడు సంతోష్‌. తన సినీ ప్రయాణం గురించి ‘ఈతరం’తో మాటలు కలిపాడిలా...

‘పేపర్‌ బాయ్‌’ చిత్రంతో నిజంగా నేను ఊపిరి పీల్చుకున్నా. రెండేళ్ల పాటు తీసిన ఈ ప్రాజెక్టుతో హీరోగా తెలుగులో కొంత గుర్తింపు వచ్చింది. ఇది మా అమ్మకల. ఓ కొడుకుగా నెరవేర్చా. పడిన శ్రమకు గౌరవం దక్కిందనుకుంటున్నా.

* అలా హీరోనయ్యాను..
మా నాన్న చనిపోయి పదకొండేళ్లు. ఆయన పోయినప్పుడు నాకు పదకొండేళ్లు. ఆయన బాబీ, చంటి, వర్షం చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయనతో కలిసి షూటింగ్స్‌కు వెళ్లలేదు కానీ సినిమాలు చూస్తూ పెరగటం వల్లనే హీరో అవుదామని చిన్నప్పటినుంచీ అనుకుంటూ ఉండేవాణ్ని. ఏ సినిమా చూసినా ఆ హీరోలా అయిపోదామనుకునేవాడ్ని. ఎక్కడా నటన నేర్చుకోలేదు. నేను ఇవాళ హీరో అయ్యానంటే.. అది మా అమ్మ చలవే. మా అమ్మ పేరు సౌజన్య. ఆమే నా హీరో. పదకొండేళ్లుగా నాన్న లేడనే ఫీలింగ్‌ లేకుండా అమ్మ పెంచింది.

* ‌జీవితమంటే తెల్సింది..
‘గోల్కొండ హైస్కూల్‌’ చిత్రంలో ఆడిషన్‌కి వెళ్లి సెలక్టయ్యాను. ఆ చిత్రం చూశాక మా అమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. ఆ సంఘటన మర్చిపోలేనెప్పుడూ. నవదీప్‌ హీరోగా నటించిన ‘బంగారుకోడిపెట్ట’ చిత్రంలో చిన్న పాత్ర పోషించా. నేను మాస్‌ కమ్యూనికేషన్‌ చేస్తున్నపుడు ‘తను నేను’ చిత్రంలో హీరోగా అవకాశం వచ్చింది. నాకేమో డిగ్రీ పూర్తిచేయాలని ఉంది. ఆ సమయంలో మా అమ్మ ఆ సినిమా చేయమంది. వెంటనే నటించా.  ‘తను నేను’ చిత్రం వర్కవుట్‌ కాకపోవటంతో మరింత ఇబ్బందులొచ్చాయి. జీవితమంటే తెలిసింది. హీరోగా కాకపోయినా కెమెరా చుట్టూ ఎక్కడో చోట అనుకునే నైజం నాది. నాకు ప్లాన్‌ బీ లేదు. వెనక్కి చూడటానికి అవకాశమే లేదు. కాబట్టే ముందుకే వెళ్తున్నా.

* అదే నా కల
‘పేపర్‌బాయ్‌’ చిత్రానికి ముందు జేబులో ఐదువందలు లేని పరిస్థితి. ఆ సమయాన్ని ఇప్పటికీ మర్చిపోలేను. అప్పుడే గట్టెక్కాలనే తపన, పట్టుదల నాలో మరింత పెరిగింది. సినిమా విడుదలయ్యాక ఓ పేపర్‌ బాయ్‌ నా దగ్గరికొచ్చి ‘కాకా నువ్వు నా లెక్కున్నావ్‌’ అనటం పెద్ద కాంప్లిమెంట్‌. పనిచేస్తే చాలు.. ఇక్కడ ఎప్పుడూ స్థానముంటుంది. నేను సాకులు వెతకను. లక్ష్యం సినిమాలమీదే. గాడ్‌ ఫాదర్‌ లేకుండా మెగాస్టార్‌ ఎదిగారు. ఆయనే నా స్ఫూర్తి. మా అమ్మ పదకొండేళ్లనుంచి ఉద్యోగం చేస్తోంది. ఆమెను రిలాక్స్‌గా ఉంచి, ఆర్థిక సమస్యల నుంచి బయటపడి.. ఓ ఇల్లు ఆమెకు బహుమతిగా ఇవ్వాలన్నదే నా డ్రీమ్‌.

‘పేపర్‌ బాయ్‌’ చిత్రానికి ఆడిషన్‌ చేశాను. దీన్ని చూసి అవకాశం ఇచ్చారు. పేపర్‌బాయ్‌ నేపథ్యంలో సినిమాలు రాలేదు కాబట్టి స్టోరీ విన్నపుడు కొత్తగా ఫీలయ్యాను. ఆ పాత్రకోసం ఉదయాన్నే లేచి లంగర్‌ హౌజ్‌, కృష్ణానగర్‌, జూబ్లిహిల్స్‌.. ప్రాంతాలు తిరిగాను. పదుల సంఖ్యలో పేపర్‌ బాయ్స్‌తో మాట్లాడాను. వాళ్లగురించి తెలుసుకోవాలనే ఇలా చేశా. ఇపుడు సులువుగా నాలుగో అంతస్తుకైనా న్యూస్‌ పేపర్‌ విసరగలను (నవ్వుతూ).

మా అమ్మది వరంగల్‌, మానాన్న రాజమండ్రికి చెందినవారు. నాన్న జ్ఞాపకాలైన పుస్తకాలు ఇప్పటికీ ఉన్నాయి. ఆయన రచయిత, దర్శకుడు. మానాన్న దర్శకుడిగా చేసిన చిత్రాలు వర్షం, బాబీ చూస్తుంటే ఆయన ప్రతిభ అర్థమవుతోందిప్పుడు. ‘ఒకరాజు ఒకరాణి’ చిత్రంలో రవితేజ స్నేహితుడిగా నటించారు. ‘బాబీ’ షూటింగ్‌ సమయంలో మానాన్న నన్ను పద్మాలయ స్టూడియోకి తీసుకెళ్లారు. అప్పుడు నాకు ఏడేళ్లు. అదొక్కటి బాగా గుర్తు. మా నాన్న అన్నయ్య గారే హాస్యనటుడు లక్ష్మీపతి. ఆయనా నాన్న పోయిన నెలకు పోయారు. యాభైకి పైగా చిత్రాల్లో నటించారాయన. నేను ఏ డివిజన్‌ వన్‌ డే లీగ్స్‌ వరకూ క్రికెట్‌ ఆడాను. క్రికెట్‌ అంటే చాలా ఇష్టం.

మధ్యతరగతి జీవితం
హైదరాబాద్‌లోనే చదివాను. చిన్నప్పటినుంచీ నాటకాలంటే ఆసక్తి. స్కూల్‌లో డ్రామాలు వేసేవాడిని. డిగ్రీ వదిలేశాక, తొలి సినిమా పోయాక ఖాళీగా ఉన్నా. అవకాశాన్ని గౌరవించాలని అర్థమైంది. ఆఫీసుల చుట్టూ విపరీతంగా తిరిగాను. ‘వీడు హీరోనేనా’ అన్నవారున్నా.. ఏనాడూ అవి పట్టించుకోలేదు. నాకూ మంచి రోజులు వస్తాయని ఆశతోనే నడిచా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని