మట్టికి యువ సంక్రాంతి

మన ­వూరి గాలిలో ఉండే ఆత్మవిశ్వాసం ఇంక ఎక్కడుంటుంది? మన పొలం మట్టిలో గుభాళించే పరిమళం ఇంక ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడా ఉండదు... దొరకదు... అని నమ్మారు కొందరు యువకులు. ఏసీ గదులు వదిలేసి... మట్టిలోకి దిగారు. లక్షల జీతం కాదని... పలుగుపారా పట్టారు. అమెరికా వద్దని... సొంతూరికి వచ్చారు. హలం పట్టి.. పొలం దున్ని... ప్రయోగం చేపట్టి... లాభాల పంట పండిస్తున్నారు...

Published : 13 Jan 2018 02:37 IST

మట్టికి యువ సంక్రాంతి

మన వూరి గాలిలో ఉండే ఆత్మవిశ్వాసం ఇంక ఎక్కడుంటుంది?
మన పొలం మట్టిలో గుభాళించే పరిమళం ఇంక ఎక్కడ దొరుకుతుంది?
ఎక్కడా ఉండదు... దొరకదు... అని నమ్మారు కొందరు యువకులు.
ఏసీ గదులు వదిలేసి... మట్టిలోకి దిగారు.
లక్షల జీతం కాదని... పలుగుపారా పట్టారు.
అమెరికా వద్దని... సొంతూరికి వచ్చారు.
హలం పట్టి.. పొలం దున్ని...
ప్రయోగం చేపట్టి... లాభాల పంట పండిస్తున్నారు.
సొంతూరు... సొంత పొలం... సొంత పని... ఇంతకంటే ఆనందం లేదంటున్న యువరైతుల మనోగతం యువ సంక్రాంతి చదవండి...

ఎయిర్‌క్రాఫ్ట్స్ నుంచి పొలంలో వాలి...

యన రెడ్డి సతీష్‌. ఎయిర్‌క్రాఫ్ట్‌ మెయింటినెన్స్‌ ఇంజినీరింగ్‌ చదివాడు. వీరు మొత్తం ముగ్గురు అన్నదమ్ములు. ఇద్దరు అమెరికాలో ఉంటున్నారు. ఒకరు సాఫ్ట్‌వేర్‌, ఇంకొకరు శాస్త్రవేత్త. వీరిది శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం జమ్ము గ్రామం. సతీష్‌కు ఎన్నో మంచి ఉద్యోగ అవకాశాలొచ్చాయి. కొన్ని రోజులు పనిచేశాడు కూడా. ఏవీ నచ్చలేదు. ఇంతలో ­ర్లో వ్యవసాయం చేయలేక ఉన్న భూమిని కౌలుకు ఇచ్చేస్తానని వాళ్ల నాన్న చెప్పారు. వద్దని చెప్పి ­రికి బయలుదేరాడు. ఎలాగైనా వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలనుకున్నాడు. రసాయన ఎరువులతో ఖర్చు ఎక్కువే కాక... భూమికి, మనకు ఎంతో హానికరమని గుర్తించాడు. సేంద్రియ మార్గం ఎంచుకున్నాడు. వారికున్న 25 ఎకరాల్లో వరి వేశాడు. ఆర్‌ఎన్‌ఆర్‌15048 రకం(షుగర్‌ఫ్రీ రైస్‌) సాగుచేసి లాభాలు పండిస్తున్నాడు. ఇప్పుడు తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడి తెచ్చే షేడ్‌నెట్‌ పద్ధతిని అమలుచేస్తున్నాడు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించడం అనేది కర్షకులకు పెద్ద సమస్యగా మారింది. ఇది సతీష్‌కూ ఎదురైంది. ముగ్గురు అన్నదమ్ములూ దీని గురించి చర్చించారు. ఒక యాప్‌ అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో రైతులు, వ్యాపారులు సభ్యులుగా ఉంటారు. అన్నదాతలు నేరుగా తమ పంటను యాప్‌ ద్వారా అమ్ముకోవచ్చు. ఇక్కడ దళారి వ్యవస్థ కూడా ఉండదు.


ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ-నామ్‌ యాప్‌ను ఈ ఉద్దేశంతోనే ఏర్పాటు చేసింది. ఇందులో కొన్ని పంటలకే అవకాశం ఉంది. మేం మిగతా అన్నిపంటలకు ఇది వర్తించేలా ప్రణాళిక రూపొందించాం. త్వరలోనే దీన్ని ప్రవేశపెడతాం.
- సతీష్‌

సాఫ్ట్‌వేర్‌ వదిలి సాగుబడికి...

ల్లారెడ్డి సొంతూరు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం లింగంపల్లి. 2004 నుంచి 2012 వరకు యూరప్‌, దుబాయిలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేశాడు. రేయింబవళ్లు ఉద్యోగంలో పడే శ్రమను వ్యవసాయంలో ఎందుకు చేయకూడదనే ప్రశ్న మొలకెత్తింది. సాగులో కొత్త పద్ధతులు అవలంబిస్తే బాగా నిలదొక్కుకోవచ్చని ప్రకృతి బాట పట్టాడు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం విశ్వనాథపల్లి శివారులో 6 ఎకరాల భూమిని కొనుగోలు చేసి పని ప్రారంభించాడు. విభిన్నమైన పంటలతోపాటు సేంద్రియ బాట సాగుతున్నాడు. హరితపందిరి పద్ధతిలో పూలసాగు చేస్తున్నాడు. 14 దేశీఆవులతో డెయిరీ నిర్వహిస్తున్నాడు. మరో 12 ఎకరాలు కౌలుకు తీసుకుని పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడు.


జీవామృతాన్ని, సేంద్రియ విధానాలు అవలంబించి ఎకరానికి 25 క్వింటాళ్లకుపైగా సన్న ధాన్యాన్ని పండించాను. నా ఉత్పత్తులకు నేనే మార్కెట్టు సృష్టించుకున్నాను. ‘ఆహారయోగ’ పేరుతో కేంద్రం ఏర్పాటు చేసి విక్రయిస్తున్నాను. పాలు, పంట ఉత్పత్తులకు మంచి డిమాండ్‌ వస్తోంది. సంతోషంగా, గౌరవంగా బతకుతున్నా...ఇంతకంటే ఇంకేం కావాలి?
- ఎల్లారెడ్డి

మైక్రోబయాలజీ చదివి మట్టి మేలు తలపెట్టి..

యనపేరు చిన్నారెడ్డి. ఆర్మూర్‌ మండలంలోని ఇస్సాపల్లి. ఎంఎస్సీ మైక్రోబయాలజీ చదివాడు. బెంగళూరులో మంచి ఉద్యోగం. మంచి జీతం.. ఏవీ తృప్తినివ్వలేదు. రసాయనాలు ఎక్కువగా వేసిన పంటలు అందరూ తింటున్నారు. దీనివల్ల చిన్న వయస్సులోనే అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. దీనికి పరిష్కారంగా సేంద్రియ వ్యవసాయం చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. ఉద్యోగం వదిలేసి సొంతూరికి వచ్చాడు. ఇక్కడున్న 9 ఎకరాలు సేంద్రియ పద్ధతిలో సాగుచేస్తున్నాడు. చుట్టుపక్కల మిగతా రైతులను ఈ బాట పట్టేలా చేస్తున్నాడు. అంతేగాకుండా సేంద్రియ ఎరువుల తయారీ యూనిట్‌ నెలకొల్పాడు. 5000 సంచుల ఎరువు ఉత్పత్తి చేస్తున్నాడు. ‘మీ కోసం... మీరు పండించుకోండి’ అనే నినాదంతో కర్షకుల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అనేక గ్రామాలతో పాటు, హైదరాబాద్‌లోను సేంద్రియ సాగుపై సదస్సులు నిర్వహించాడు. చుట్టుపక్కల 100 మంది వరకూ ఈ రకం సాగు మొదలు పెట్టేలా స్ఫూర్తి నింపాడు.


త్వరలోనే సేంద్రియ సాగుపై రైతులకు ఉచితంగా శిక్షణ తరగతులు ప్రారంభిస్తున్నాను. అందుబాటులో ఉన్న భూమిలో ఇంటికి అవసరమైన టమోట, కొత్తిమీర, కరివేపాకు, వంగ, ఉల్లి వేసుకునేట్లు చేయడమే నా లక్ష్యం.
- చిన్నారెడ్డి

ఉద్యోగం వద్దు.. వూ­రే ముద్దు

పొలంలో స్ప్రేయర్‌ పట్టుకొన్నది అభిలాష్‌. అనంతపురం జిల్లా గుడిబండకు చెందిన ఈ యువకుడు ఎంబీఏ చదివారు. ఈయన భార్య సుష్మ ఎంఫార్మసీ చదివారు. ఇద్దరూ బెంగళూరులో అనేక ప్రైవేటు సంస్థల్లో పనిచేశారు. అభిలాష్‌ 14 ఏళ్లలో 5 కంపెనీల్లో వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించారు. ఎంత సంపాదించినా, ఏమి చేసినా ఏదో లోటు... ఉద్యోగాలు తృప్తి నివ్వడం లేదని తెలుసుకున్నారు. భవిష్యత్తులో వ్యవసాయానికి మంచి డిమాండ్‌ ఉందని గ్రహించారు. వెంటనే ­ర్లో ఉన్న 25 ఎకరాలు కళ్లలో మెదిలింది. సాగు చేయాలని సంకల్పించారు. సుష్మనూ ఒప్పించాడు. ఇద్దరూ కలిసి ­రికి వచ్చారు. వారికున్న పొలంలో 10 ఎకరాలు మెట్ట. ముందుగా దాన్ని సాగులోకి తేవాలని నిర్ణయించుకున్నారు. మామిడి, నేరేడు, అంజూర్‌, కొబ్బరి, దానిమ్మ, జామ, మునగ తోటలు పెంచారు. ఇందులో ఎంతో కష్టమున్నా ఇష్టంగా పనిచేశారు. వ్యవసాయంలో ముఖ్యంగా విద్యుత్తు, మనుషులు, నీరు ప్రధాన సమస్యలు. వీటిని యాంత్రీకరణ, బిందుసేద్యం, ఇనుపకంచె, సీసీకెమెరాలు, సౌర విద్యుత్తు ద్వారా పరిష్కరించుకున్నారు. అంతర్గత పంటలూ సాగుచేస్తూ ఆదాయం గడిస్తున్నారు. వారికొచ్చిన సమస్యలు- చూసుకున్న ప్రత్యామ్నాయ మార్గాలు మిగతా వారికీ తెలిసేలా ఒక యూట్యూబ్‌ ఛానల్‌(అగ్రియన్‌ టీవీ) ప్రారంభించారు. ఎప్పటికప్పుడు వీడియోలు ఆన్‌లైన్‌లో పెడుతూ రైతుల్లో చైతన్యం కలిగిస్తున్నారు.


జనాభా పెరిగే కొద్దీ... ఆహారం అవసరం. అందుకు వ్యవసాయమే ఆధారం. దీనికి మంచి భవిష్యత్తు ఉంది. కొంచెం మెలకువతో చేస్తే మంచి లాభసాటిగా సాగవచ్చు.
- అభిలాష్‌

సౌదీ నుంచి నాటుకోడి దాక..

రామచంద్రది విభిన్నమైన పంథా. నెల్లూరు జిల్లా సీతారామపురం ఇతనిది. హోటల్‌ మేనేజ్‌మెంటు చేసి హైదరాబాద్‌, సౌదీ అరేబియాలో పనిచేశాడు. వాటికంటే ­రిలో సొంతంగా వ్యవసాయం చేసుకొని బతకడం చాలా మేలని భావించాడు. సౌదీ నుంచి తిరిగొచ్చాడు. ఐదు ఎకరాల్లో సాగు మొదలు పెట్టాడు. గ్రామంలో నీటి వసతి తక్కువ. దీంతో బిందుసేద్యం చేస్తున్నాడు. అయినా ఒట్టి వ్యవసాయంతోనే నెట్టుకురాలేమని గ్రహించాడు. పాడి(4 గేదెలు, 3 ఆవులు) పెట్టాడు. వీటికి అవసరమైన గడ్డిని సొంతంగా పెంచుతున్నాడు. కూరగాయలు పండించి రోజూ వారి ఖర్చులకు డబ్బు సంపాదిస్తున్నాడు. ఆ ­రి వాతావరణం పౌల్ట్రీ పరిశ్రమకు అనుకూలమని తెలుసుకొన్నాడు. నిపుణుల అభిప్రాయాలు తీసుకొని ఒక పౌల్ట్రీని ప్రారంభించాడు. విజయ పథంలో పయనిస్తున్నాడు.


3000 వేల కోళ్లు పెంచగల షెడ్డుంది. ప్రస్తుతం నాటుకోళ్లకు మంచి డిమాండ్‌ ఉంది. దీనిపై దృష్టి పెట్టాను. ఎక్కడో దేశంగాని దేశంలో రోజూ చస్తూ బతకడం కంటే... మనతో పాటు పది మందిని బతికించే వ్యవసాయానికి మించింది లేదనేది నా అభిప్రాయం.
-రామచంద్ర

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని