Delhi Vs Rajasthan: మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్‌: దిల్లీ ఓనర్

ఒకే ఒక్క క్యాచ్‌ రాజస్థాన్‌ను ఓటమి వైపు నడిపించగా.. గెలుస్తామనే ఆశలు లేని సమయంలో దిల్లీకి ఊపిరి పోసింది. దీంతో ఆ జట్టు విజయం సాధించి ప్లేఆఫ్స్‌ రేసులోకి వచ్చింది.

Published : 09 May 2024 00:04 IST

ఇంటర్నెట్ డెస్క్: రాజస్థాన్‌ కెప్టెన్ సంజూ శాంసన్ (86: 46 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు. దిల్లీ నిర్దేశించిన 222 పరుగుల లక్ష్య ఛేదనలో తన జట్టును గెలిపించేందుకు ప్రయత్నించాడు. అయితే, ముకేశ్‌ వేసిన బంతిని భారీ షాట్‌కు యత్నించడంతో షైహోప్ అద్భుతంగా క్యాచ్‌ పట్టగా పెవిలియన్‌కు చేరాడు. కాగా, ఈ క్యాచ్‌ నిర్ణయం వివాదాస్పదమైంది. రిప్లే సందర్భంగా దిల్లీ ఫ్రాంచైజీ యజమాని పార్థ్‌ జిందాల్ రియాక్షన్ నెట్టింట వైరల్‌గా మారింది. ‘ఔట్.. ఔట్ ’అంటూ వీఐపీ గ్యాలరీలో నుంచి అరుస్తూ కనిపించారు. మ్యాచ్‌ అనంతరం సంజూశాంసన్‌తో పార్థ్ మాట్లాడారు. తాజాగా ఆ సంఘటనపై పార్థ్ సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. 

‘‘సంజూ శాంసన్‌తో మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. అతడి పవర్‌ హిట్టింగ్‌ను ప్రత్యక్షంగా చూడటం అద్భుతంగా అనిపించింది. ఒక దశలో అతడు మమ్మల్ని చాలా కంగారుపెట్టాడు. అందుకే, అతడు ఔటైనప్పుడు అలా రియాక్షన్ ఇచ్చా. మ్యాచ్ అనంతరం సంజూతో సంభాషించా. అద్భుతమైన విజయం సాధించిన మా కుర్రాళ్లకు అభినందనలు’’ అని పార్థ్ వెల్లడించారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన దిల్లీ 221/8 స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో రాజస్థాన్‌ 201/8కే పరిమితమైంది. దిల్లీ బౌలర్లలో కుల్‌దీప్ 2, ఖలీల్ 2, ముకేశ్‌ 2 వికెట్లు పడగొట్టారు. అక్షర్, రసిక్ దార్ చెరో వికెట్ తీశారు.

సంజూ ‘మాస్టర్ బ్లాస్టర్’: హేడెన్

‘‘ఎప్పట్నుంచో కలలా అనిపించే ఇన్నింగ్స్‌ను సంజూశాంసన్‌ ఆడాడు. కేవలం 46 బంతుల్లోనే 86 పరుగులు చేశాడు. అతడి సత్తా ఏంటో మరోసారి నిరూపితమైంది. లఖ్‌నవూతో మ్యాచ్‌ను గెలిపించిన అతడు.. దిల్లీపైనా ఇలాంటి ఆటనే ప్రదర్శించాడు. జట్టు ఓడినా.. సంజూ ఆకట్టుకున్నాడు. స్పిన్, పేస్‌ను సమర్థంగా ఎదుర్కొనే ‘మాస్టర్ బ్లాస్టర్’. టీ20 క్రికెట్‌లో ఇలాంటి దూకుడైన గేమ్‌ ఆడాలి. దిల్లీపైనా కాస్త అదృష్టం కలిసివచ్చుంటే మ్యాచ్‌ను గెలిపించేవాడు’’ అని ఆసీస్ మాజీ ఆటగాడు మ్యాథ్యూ హేడెన్‌ వ్యాఖ్యానించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని