వీరికి సగటు మనిషే ప్రేరణ!

కాలేజీ చదువుల్లో... కార్పొరేటు జాబుల్లో... కుర్రోళ్లకు ఖాళీ సమయం దొరికితే ఏం చేస్తారు? హాయిగా ఐమ్యాక్స్‌కో... గ్రూపుగా హ్యాంగ్‌ అవుట్స్‌కో వెళ్లడం సహజం! కానీ, ఈ యువకులు అలా కాదు!

Published : 17 Feb 2018 01:44 IST

వీరికి సగటు మనిషే ప్రేరణ!

కాలేజీ చదువుల్లో... కార్పొరేటు జాబుల్లో...
కుర్రోళ్లకు ఖాళీ సమయం దొరికితే ఏం చేస్తారు? హాయిగా ఐమ్యాక్స్‌కో... గ్రూపుగా హ్యాంగ్‌ అవుట్స్‌కో వెళ్లడం సహజం! కానీ, ఈ యువకులు అలా కాదు!
పదేళ్లుగా శ్మశానంలో పని చేస్తున్న మహిళలను కలుస్తారు.. రోడ్డు పక్కన బొండాలు అమ్మే తాతతో ముచ్చటిస్తారు... సంద్రంలో చేపలు పట్టే జాలర్లతో అల్లరి చేస్తారు... ఇలా చుట్టూ ఉన్న కామన్‌ మ్యాన్‌తో దోస్తీ కడతారు.. వారి జీవితాల్లోని ప్రేరణ గ్రహిస్తారు... వారినో సెలబ్రిటీలుగా ప్రపంచానికి పరిచయం చేస్తారు! అయితే, ఏంటి? మేమూ రోజూ చాలా మందిని చూస్తాం అంటారా? మీరు చూసే కోణం వేరు... వీరి కథలు వేరు!!
మరి, ‘స్టోరీస్‌ ఆఫ్‌ కామన్‌ మ్యాన్‌’ వెనకున్న స్టోరీని తెలుసుకుంటే... మీరూ భాగస్వాములవ్వొచ్చు!!

శక్తిస్వరూప్‌...

తాత చేతిలో కొడవలి వణుకుతోంది. అయినా బొండం కొట్టడంలో పట్టుపోలేదు. ముడతల్లో మునిగిన కళ్లలో... మునిపంటి బిగువులో నాకేదో హోప్‌ కనిపించింది. పుస్తకాల్లో... ప్రముఖుల వ్యాసాల్లో దొరకని  ‘లైఫ్‌కిక్‌’ ఆ క్షణం దొరికింది. తాత వణికిన చేతులే నా చేత ‘స్టోరీస్‌ ఆఫ్‌కా మన్‌మ్యాన్‌’ రాసేలా చేశాయి. ఎంటెక్‌ చేశా. మొదట్లో వికీపీడియాకి రాసేవాడిని. పాశ్చాత్య పోకడలకు అతీతంగా ఈ ప్రయత్నం చేశా. దీనికి నాన్న రఘునాథ్‌ ప్రోత్సాహం మరువలేనిది. నేను ప్రజా సేవకుడిగా మారాలనే సంకల్పం నాన్న పెంపకం నుంచి పుట్టిందే.
ఇష్టం... సగటు మనుషులు
లక్ష్యం... సివిల్స్‌లో విజయం

జాయ్‌ సోలామాన్‌

సముద్రం వారికున్న ఏకైక హోప్‌. ఆటుపోట్ల మధ్య ఒడిసిపట్టి వల విసరడమే తెలుసు వారికి. చేపలెన్ని పడినా ఏ పూటకాపూటే ఆదాయం... ఖర్చు సమం చేస్తారు. ఈ రోజే మనదనే జీవిత సత్యం వారి మాటల్లో చూశా. సోషల్‌ మీడియా సందడే తెలిసిన నాకు సముద్రపు హోరు లాంటి వారి హుషారులో ఏదో కిక్కుందనిపించింది. ఎంటెక్‌ చదివా. వ్యాసాలు రాయడం నాకో హాబి. నేను వృత్తి పరంగా మ్యూజిక్‌ డైరెక్టర్‌ని. ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో మ్యూజిక్‌ టీచర్‌గా పని చేస్తున్నా. ప్రత్యేక మ్యూజిక్‌ ఆల్బమ్స్‌ చేస్తున్నా. కొన్ని షార్ట్‌ఫిల్మ్‌లకు మ్యూజిక్‌ అందించా. అలాగే, ‘కామన్‌మ్యాన్‌ స్టోరీస్‌’కి సంబంధించిన పరిచయ వీడియోకి నేనే మ్యూజిక్‌ చేశా.
ఇష్టం...మ్యూజిక్‌, ఫొటోగ్రఫీ, రైటింగ్‌
లక్ష్యం...మ్యూజిక్‌ డైరెక్టర్‌

* కాయా కష్టం చేసి కొడుకుని ఇంజినీరింగ్‌ జాయిన్‌ చేస్తారు తల్లిదండ్రులు. ఉన్నత చదువులతో ఉద్దరిస్తాడనుకుంటే ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నానంటూ ఉరేసుకుని చనిపోవడం...
* ఇంట్లో నాన్న ఎన్ని సార్లు తిట్టినా పట్టించుకోని కొలువు చేసే కుర్రకారు. ఆఫీస్‌లో బాస్‌ తిట్టాడని బెంగపెట్టుకోవడం... తెగ బాధపడిపోవడం...
లా చిన్న చిన్న కారణాలతోనే జీవితాన్ని అంధకారం చేసుకునే వారికి కామన్‌మ్యాన్‌ జీవితం ఓ పాఠం అవ్వాలని భావించారో ఇద్దరు మిత్రులు... శక్తి స్వరూప్‌, జాయ్‌ సోలామాన్‌. ఎంటెక్‌ చదువులు ముగించుకుని కొలువుల్లో కొనసాగుతూ నెట్టింట్లో కలిశారు. ఇద్దరి నేపథ్యాలు, లక్ష్యాలు వేరు. కానీ, ఆలోచనలు కలిశాయి. స్వరూప్‌కొచ్చిన ఆలోచనకి జాయ్‌ తోడయ్యాడు. మరో ఇద్దరు మిత్రులు విహారి, విజయ్‌లు సాంకేతిక సహకారం ఇవ్వడంతో బ్లాగుల్లో మొదలైన ప్రయత్నం ఏడాది కాలంలో వెబ్‌సైట్‌ నుంచి మొబైల్‌ ఆప్‌ వరకూ చేరింది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూ ఇతర రాష్ట్రాల విద్యార్థులకూ ఈ ‘కామన్‌మ్యాన్‌’ కథలు దగ్గరయ్యాయి. బెంగళూరు నుంచి కృతిక పరప్పా, చెన్నై నుంచి అమ్రిత వర్షిణి, కేరళ నుంచి కృష్ణ కోపిక, పుదుచ్చేరి నుంచి లక్ష్మీ బాలన్‌.. పలు రాష్ట్రాల నుంచి సగటు మనషి కథల్ని ప్రపంచానికి చెబుతున్నారు. దాతల నుంచి విరాళాలు సేకరించి అర్హులైనవారికి సాయం అందిస్తూ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తున్నారు. పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి సాయం అందిస్తున్నాయి కూడా. వీరి ప్రయాణానికి కొందరు పెద్దలు, ప్రముఖులు ప్రోత్సాహం అందించారు. మైక్రోసాఫ్ట్‌ సంస్థ యువ పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించేందుకు నెలకొల్పిన ‘బిజ్‌స్పార్క్‌’ని మెప్పించి సుమారు రూ.3 లక్షల విలువ చేసే అప్లికేషన్‌ సాఫ్ట్‌వేర్‌ సపోర్ట్‌ను ఉచితంగా పొందారు.

దేశ వ్యాప్తంగా...
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలోని 20 రాష్ట్రాల్లో 18 మందికి పైనే కామన్‌మ్యాన్‌ కథల్ని రాస్తున్నారు. అందరూ సోషల్‌ వేదికల నుంచి స్వచ్ఛందంగా ముందుకొచ్చినవారే. వారాంతంలో ఒకటి లేదా రెండు చొప్పున ఇప్పటికి వెబ్‌సైట్‌, మొబైల్‌ ఆప్‌లో 79 కామన్‌మ్యాన్‌ స్టోరీలను పబ్లిష్‌ చేశారు. ఇతర రాష్ట్రాల్లో విద్యార్థుల్ని ప్రోత్సహించేలా ఇంటర్న్‌షిప్‌లు చేస్తున్నారు. ఈ మధ్యే ‘ఐఐటీ జోధ్‌పూర్‌ పరివర్తన్‌ క్లబ్‌’తో జట్టుకట్టి కామన్‌మ్యాన్‌కి కథల్ని పెంచేందుకు సిద్ధం అవుతున్నారు. మొత్తంగా 22 మంది బృందంగా కలిసి పని చేస్తూ సగటు మనిషిలోని సక్సెస్‌ ఫార్ములాని చెబుతున్నారు. ముంబయికి చెందిన ఆసరా స్వచ్ఛంద సంస్థ కామన్‌మ్యాన్‌ కథల్ని తీసుకుని మానసిక ఒత్తిడితో ఉన్నవారికి చూపి ఉపశమనం కలిగిస్తున్నారు. విద్యార్థుల్లో రచనా నైపుణ్యాన్ని పెంపొందించేలా ‘లిటరరీ ఫెస్ట్‌’లను నిర్వహిస్తున్నారు. ‘కామన్‌ స్టోరీస్‌’ పేరుతో పుస్తకాన్ని అందుబాటులో ఉంచారు. అమెజాన్‌ నుంచి ఈ-పుస్తకాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
వెబ్‌సైట్‌: http://storiesofcommonman.in


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని