చెప్పలేదేం తల్లీ? అంత చేదయ్యామా..

సర్వం అనుకున్న కూతురు ప్రాణం ఉసూరుమనేలా చేసింది. వెలకట్టలేని మమకారం పంచినా ప్రేమ మైకంలో కన్నప్రేమనే ధిక్కరించింది. ఆ సంఘటనతో ఎంతటి క్షోభకి గురయ్యాడో...

Published : 14 Jan 2016 12:58 IST

చెప్పలేదేం తల్లీ? అంత చేదయ్యామా..


సర్వం అనుకున్న కూతురు ప్రాణం ఉసూరుమనేలా చేసింది. వెలకట్టలేని మమకారం పంచినా ప్రేమ మైకంలో కన్నప్రేమనే ధిక్కరించింది. ఆ సంఘటనతో ఎంతటి క్షోభకి గురయ్యాడో చెబుతున్నాడో తండ్రి!కంగారు.. భయం.. సంతోషం.. అన్నీ కలగలిపి టెన్షన్‌తో అటూఇటూ తిరుగుతున్నా. లోపల పురిటినొప్పులతో నా భార్య. పదినిమిషాలయ్యాక ‘కంగ్రాట్స్‌ మీకు పాప’ంటూ కబురు. మహలక్ష్మి పుట్టిందనుకుంటూ మురిసిపోయా. ఆపై నా ప్రతిరూపాన్ని గర్వంగా గుండెలకు హత్తుకున్నా.

నా బంగారుతల్లి పుట్టిన మహత్యమేమో అన్నీ కలిసొచ్చేవి. తనతో రోజూ పండగే. తను ఏడిస్తే నాకు బాధ. నవ్వితే సంతోషం. తన కోసం గుర్రాన్నయ్యా.. పిల్లిలా అరిచా. అలిగితే కానుకనయ్యా. మంచి సమయం చూసి మహాలక్ష్మి అని పేరు కూడా పెట్టేశా. రెండున్నరేళ్ల నా నిరీక్షణ ఫలించి నా చిట్టితల్లి ‘నాన్నా’ అంది. నా జీవితంలో అదే బెస్ట్‌ డే.

పేరు లక్ష్మినే కానీ చదువులో సరస్వతి. ఐదులో క్లాస్‌ఫస్ట్‌ వచ్చింది. టీచర్లు తనకిచ్చిన గిఫ్ట్‌ అందుకొని ప్రపంచకప్పు గెలిచినంత సంతోషంగా యాభై మందికి చూపించా. ఏడులో ఆటల పోటీల్లో గెలిస్తే ఓ మెమొంటో ఇచ్చారు. ఆ పూట ఏం తినకుండానే నా కడుపు నిండింది. పదిలో తొంభైశాతం మార్కులొస్తే వూరంతా మిఠాయిలు పంచా. పైచదువులకు బిడ్డ పట్నం వెళ్తుంటే ముఖం పక్కకు తిప్పుకొని వెక్కివెక్కి ఏడ్చా. ‘డాడీ నిన్ను చూడాలనుంది’ అనడమే ఆలస్యం రెక్కలు కట్టుకొని వాలిపోయేవాణ్ని. ఇంటర్‌లో మంచి మార్కులొచ్చాయని బహుమతిగా నేనే ఓ స్మార్ట్‌ఫోన్‌ కొనిచ్చా. మా ఇద్దర్ని కలుపుతుందనుకున్న ఆ పాడు వస్తువు మా అనుబంధంలో చిచ్చు పెడుతుందని వూహించలేకపోయా.

రెండో ఏడాది పరీక్షలు రాసి ఇంటికొచ్చింది కూతురు. రాగానే ఎప్పట్లాగే నన్ను హత్తుకోలేదు. మనసారా పలకరించలేదు. అమ్మపైనా ప్రేమ చూపదే! ఎప్పట్లాగే తనని గారాబం చేయబోతుంటే ‘మీవన్నీ పాత పద్ధతులు. కొత్తగా ఆలోచించండీ’ అంటూ చిన్నబుచ్చుకునేది. తన ప్రవర్తన కొత్తగా అనిపించినా తనన్నదే నిజమనుకొని మిన్నకుండిపోయా. ఓరోజు ఫ్రెండ్‌ పెళ్లికెళ్తానంది. ‘తోడురానా తల్లీ’ అనడిగా. ‘వ్వాట్‌ డాడ్‌.. నేనింకా చిన్నపిల్లనా?’ అని కసురుకుంది. నా మొహం చిన్నబోయింది. ఇక రోజులో పద్దెనిమిది గంటలు సెల్‌ఫోన్‌తోనే గడిపేది. అనుమానమొచ్చి స్నేహితురాలిని విచారించా. నా గుండె పగిలే మాట చెప్పిందా అమ్మాయి. నా బంగారం ఒకబ్బాయిని ప్రేమిస్తోందట. తట్టుకోలేక ‘ఇది నిజమేనా తల్లీ?’ అనడిగా. కోపంతో వూగిపోయింది. ‘అబద్ధం. అయినా నీకు అనుమానం వస్తే నన్నడగాలిగానీ నా ఫ్రెండ్‌ని అడుగుతావా?’ అని విరుచుకుపడింది.

ఓరోజు ఫ్రెండ్‌ ఇంటికి వెళ్లొస్తానంది. సాయంత్రం, రాత్రి అయినా రాదే! గుండెలదిరిపోయాయి. ఫోన్‌ స్విచ్ఛాఫ్‌. ‘మా ఇంటికి రాలేదంకుల్‌’ అంది ఫ్రెండ్‌. పిచ్చివాళ్లలా అర్థరాత్రుళ్లూ తిరుగుతూనే ఉన్నాం. తెల్లవారుతుండగా ఓ కొత్త నెంబర్‌ నుంచి ఫోన్‌. నా చిట్టితల్లే. ఆతృతగా అడిగాం ఎక్కడున్నావని. ‘నేను పెళ్లి చేసుకున్నా. నన్ను వెతకొద్దు’ అంటూ పెట్టేసింది. ఆ క్షణం నా శ్వాస ఆగిపోతే బాగుణ్ణనిపించింది. నెంబర్‌ పోలీసులకిచ్చి కేసు పెట్టాం. సిటీ నుంచి వచ్చిందన్నారు. ఆరోజే పరుగెత్తుకెళ్లాం. తిరిగితిరిగి కాళ్లు చతికిలబడ్డాయి. ఏడ్చిఏడ్చి కన్నీళ్లు ఇంకిపోయాయి. జాడ మాత్రం లేదు. కొన్నాళ్లయ్యాక చిరునామా తెలిసినా ఏం చేయలేకపోయాం.

పిల్లను అదుపులో పెట్టుకోలేకపోయారన్నారంటూ బంధువులు, చుట్టుపక్కల ఎత్తిపొడుపులు. ఆ బాధతోనే అర్థాంగి మంచం పట్టింది. అయినా మా కష్టం తనకి పట్టలేదు. ఇరవై ఏళ్లు మేం పంచిన మమకారం కన్నా ఏడాదో, రెండేళ్లొ ఆ అబ్బాయి ఇచ్చిన ప్రేమే గొప్పదైంది. కానీ ‘డాడీ! నేను ఆ అబ్బాయిని ప్రేమించా’ అని ఒక్కమాట చెప్పి ఉంటే ఆలోచించేవాణ్ని. నా కూతురికి తగ్గవాడైతే కాళ్లు కడిగేవాణ్ని. కానీ అంతా అయిపోయింది. తను గడప దాటేముందు క్షణం మా గురించి ఆలోచించి ఉంటే ఈ క్షోభ తప్పేదే. అయినా ఇప్పటికీ తను బాగుండాలనే కోరుకుంటున్నాం. ఎంతైనా కన్నవాళ్లం కదా!

- ఓ తండ్రి, అనంతపురం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని