సినిమా కల..జీవితం విలవిల

తొలి ప్రేమ. నాకు సినిమాలపై ప్రేమ పుట్టించిన తొలి సినిమా. తెరపై ఆడే బొమ్మలు మనసునీ ఆడిస్తాయని అప్పుడే అర్థమైంది.

Published : 28 May 2016 00:57 IST

సినిమా కల..జీవితం విలవిల

తొలి ప్రేమ. నాకు సినిమాలపై ప్రేమ పుట్టించిన తొలి సినిమా. తెరపై ఆడే బొమ్మలు మనసునీ ఆడిస్తాయని అప్పుడే అర్థమైంది.

గోదావరి జిల్లాలోని ఓ పల్లెటూరు మాది. చదువులో చురుకైన విద్యార్థిని. మొదట్లో థియేటర్‌కెళ్లడం తక్కువ. తొలిప్రేమ తర్వాత మాత్రం ఏ సినిమానీ వదల్లేదు. ప్రతి డైలాగ్‌, ప్రతి సీన్‌ కంఠతా వచ్చేసేది. ‘ఫలానా స్టార్‌ డైరెక్టర్‌ది మన పక్క వూరే’, ‘ఆ హీరో ఇక్కడివాడే’ ఇలాంటి మాటలతో నా రోమాలు నిక్కబొడుచుకునేవి. వాళ్లలా జనం నా గురించి గొప్పగా చెప్పుకోవాలనిపించేది.

మూడేళ్లు గడిచాయి. ఆరా తీస్తే మా బంధువొకాయన ఇండస్ట్రీలో ఉన్నాడని తెలిసింది. ఆ భరోసాతో ఫిల్మ్‌నగర్‌లో వాలిపోయా. బీటెక్‌ ఫైనలియర్‌ పరీక్షలు వదిలేసి మరీ. ఇంట్లోవాళ్లు ఎంతమొత్తుకున్నా విన్లేదు. హీరో అవుతానంటే ‘ముందు ఏదో ఒక డైరెక్టర్‌ దగ్గర పెట్టిస్తా. పరిచయాలయ్యాక హీరోగా ప్రయత్నిద్దువులే’ అన్నారు బంధువు. వారంలోపే ఓ దర్శకుడి దగ్గర చేర్పించారు. కెమేరాలు మోయడం, హీరోహీరోయిన్లు ఏ సీన్‌లో ఏ డ్రెస్‌లు వేసుకున్నారో గుర్తుపెట్టుకోవడం, కప్పులు కడగడం ఇదీ నా పని. రెండునెలలకే తెచ్చుకున్న ఇరవైవేలు కరిగిపోయాయి. నాన్నే నెలనెలా ఖాతాలో డబ్బులేసేవారు.ఆర్నెళ్ల పురిటినొప్పులు పూర్తై సినిమా విడుదలైంది. అట్టర్‌ఫ్లాప్‌ టాక్‌. తెరపై నా పేరూ పడ్డా నాకు తప్ప వేరొకరికి గుర్తులేదు. ఇంకోచోట ప్రయత్నం మొదలుపెట్టా. ‘ఖాళీల్లేవ్‌’ బోర్డులు వెక్కిరించేవి. కొందరు దగ్గరికే రానిచ్చేవారు కాదు. కష్టాల డోసు పెరిగింది. ఇంట్లోంచి డబ్బులు రావడమూ తగ్గాయి. ఓ పూట తినడం, మరోపూట పస్తులు. అయినా ప్రయత్నాలు ఆపలేదు.

అన్నట్టు నాకో లవ్‌స్టోరీ ఉంది. స్థిరపడ్డాక పెళ్లి చేసుకోవాలనుకున్నాం. సిటీకెళ్తుంటే ఆల్‌ ది బెస్ట్‌ చెప్పింది తను. తర్వాత ‘ఎందుకీ కష్టాలు. వదిలేసి వచ్చెయ్‌. ఇక్కడే ఏదో ఉద్యోగం చూసుకుందువుగానీ’ అనేది. విన్లేదు. ఐదారునెలలకి మరో చోట చేరా. అసిస్టెంట్‌గానే. పెద్ద బ్యానర్‌, స్టార్‌హీరోతో క్లాప్‌ కొట్టాం. ఈ దెబ్బతో దశ తిరిగిందనుకున్నా. నా దురదృష్టం.. ఏవో కారణాలతో ఆ సినిమా మొదట్లోనే ఆగిపోయింది. మెల్లిగా నాపై నాకు నమ్మకం సడలసాగింది. లవర్‌ చెప్పింది విని కొన్నాళ్లు ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టా. చేతిలో డిగ్రీ కూడా లేదు. అటెండర్‌కి తప్ప దేనికీ పనికిరానన్నారు. మళ్లీ సినిమా వేట మొదలైంది. ఆరేళ్లలో ముగ్గురు దర్శకుల దగ్గర పనిచేశా. అసిస్టెంట్‌ నుంచి అసోసియేట్‌కు ఎదిగా. సొంతంగా కథలు రాసుకొని హీరోలు, నిర్మాతల చుట్టూ తిరిగా. కొందరు కథ బాగున్నా డేట్స్‌ లేవన్నారు. ఓ యువహీరో తప్పకుండా ఛాన్స్‌ ఇస్తానన్నాడు. తర్వాత ఆయన రెండు సినిమాలూ ఆడకపోవడంతో తనకే అవకాశాల్లేకుండా పోయాయి. వీటన్నింటికన్నా ఓ నిర్మాత మాటలు నన్ను బాగా బాధించాయి. ‘చాన్నాళ్లుగా నిన్ను గమనిస్తున్నా. నీలో ఫైర్‌ లేదయ్యా. అందరితో కలిసిపోలేవు. ఇండస్ట్రీకి సూట్‌ కావు’ అన్నారు. కళ్లలో నీళ్లు తిరిగాయి. ఈ కష్టానికి తోడు పుండుమీద కారం చల్లినట్టు ఇష్టపడ్డ అమ్మాయికి పెళ్లైందని తెలిసింది. తను మాత్రం ఎన్నాళ్లని నాకోసం ఎదురుచూస్తుంది?

సినిమా ఆశలు ఆవిరయ్యాయి. ఇంటికెళ్లడానికి మొహం చెల్లలేదు. ఇక్కడే ఏదైనా ఉద్యోగం చేద్దామంటే డిగ్రీ కూడా లేదు. అప్పుడే ఓ మిత్రుడు దేవుడిలా ఆదుకున్నాడు. ఆర్థికసాయం చేసి వెబ్‌డిజైనింగ్‌ కోర్సులో చేర్పించాడు. శిక్షణ పూర్తిచేసుకొని ఉద్యోగంలో చేరా. సినిమాలపై ప్రేమ చావక అప్పుడప్పుడు ఘోస్ట్‌ రైటర్‌గానూ పనిచేస్తున్నా. ప్రస్తుతం సినిమా కష్టాలేం లేవు. కానీ వయసు మీరింది. పెళ్లాడ్డానికి ఏ అమ్మాయి ముందుకు రావట్లేదు. అనుభవంతో చెబుతున్నా. కలలు కన్న ప్రతి ఒక్కడూ హీరో కాలేడు. అలా కాకపోయినా బతకగలిగే ఓ ప్రత్యామ్నాయం కూడా ఆలోచించుకోవాలి. ఈ పరాజితుడి నుంచి కూడా పాఠాలు నేర్వొచ్చనే మీ ముందుకొచ్చా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని