నమ్మొద్దు గురూ మిస్‌కాల్‌ ప్రేమల్ని

మిస్‌కాల్‌ పరిచయం... ఫోన్‌ చాటింగ్‌... బయట మీటింగ్‌... ఆపై ప్రేమ బాట. ఇలాంటివి చాలా కథలే వింటాం. ఓ కుర్రాడికి అంతకుమించిన అనుభవం ఎదురైంది. ఏంటది? అతడి మాటల్లోనే...

Published : 24 Sep 2016 02:34 IST

నమ్మొద్దు గురూ మిస్‌కాల్‌ ప్రేమల్ని

మిస్‌కాల్‌ పరిచయం... ఫోన్‌ చాటింగ్‌... బయట మీటింగ్‌... ఆపై ప్రేమ బాట. ఇలాంటివి చాలా కథలే వింటాం. ఓ కుర్రాడికి అంతకుమించిన అనుభవం ఎదురైంది. ఏంటది? అతడి మాటల్లోనే.

సారి బంధువుకి ఫోన్‌ చేయబోయి పొరపాటున వేరొకరికి చేశా. అవతలివైపు అమ్మాయి. నరాల్లో ఉత్తేజం. ‘ఎక్కడుంటావ్‌?’, ‘ఏం చేస్తావ్‌?’ సంభాషణ పొడిగించా. ఐదు నిమిషాల్లో ఆప్తులమయ్యాం. ‘ఇంకోసారి ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయొద్దు. వేరే నెంబర్‌ ఇస్తా’నంది. ఫోన్‌ పెట్టిన నిమిషంలోపే మెసేజొచ్చింది.

మా భావాలు కుదిరాయి. నా మాటలు తనకు నచ్చేవి. తనేం చెప్పినా నాకు కిక్కొచ్చేది. ప్రేమ, పెళ్లి, చదువు, స్నేహం... మేం ముచ్చటించని విషయం లేదు. అర్థరాత్రి, అపరాత్రి వేళలుండేవి కావు. సినిమాలో హీరోయిన్‌, అందమైన అమ్మాయి... ఎవర్ని చూసినా తనిలాగే ఉంటుందని వూహించుకునేవాణ్ని.

మమ్మల్ని మరింత దగ్గర చేయడానికా అన్నట్టు ఇద్దరిమధ్య గ్యాప్‌ వచ్చిందోసారి. ఒకటి.. రెండు.. వారం గడిచినా తననుంచి సమాచారం లేదు. విలవిల్లాడిపోయా. పిచ్చిపట్టినట్టు రోడ్లమీద తిరిగా. పదిహేనురోజులయ్యాక తన ఫోన్‌ మోగింది. ఒలింపిక్‌ పతకం గెలిచినంత సంతోషం. ‘ఇన్ని రోజులు ఏమైపోయావ్‌? నా మనసుతో ఆడుకుంటున్నావ్‌. నీకసలు బుద్ధుందా?’ దులిపేశా. ‘సారీ నా ఫోన్‌ అన్నయ్య దగ్గర ఉండిపోయిందిరా’ ఆ మాటతో నా కోపం ఎగిరిపోయింది. ‘నేను నీతో మాట్లాడకుండా ఒక్కరోజైనా ఉండలేను. ఐలవ్యూ’ అదే వూపుతో చెప్పేశా. ఫోన్‌ కట్‌ చేసింది. నా మనసు శూన్యమైంది. కాసేపయ్యాక మిస్‌కాల్‌ ఇచ్చింది. కాల్‌బ్యాక్‌ చేశా. ఏం చెబుతుందో అని వూపిరి బిగబట్టా. ‘ఐ లవ్యూ టూ రా’ అంది. చొక్కా విప్పి తీన్మార్‌ ఆడేశా.

కలవాలనుందన్నా. వారం నాన్చింది. ‘నాకూ నిన్ను చూడాలనుంది. ఈ ఆదివారమే ఆ శుభదినం’ మెసేజ్‌ పెట్టింది. ‘చార్మినార్‌ నుంచి అఫ్జల్‌గంజ్‌కెళ్లే దారిలో మూడో వీధి మన స్పాట్‌’ చిరునామా చెప్పింది. అదేదో పాటలో చెప్పినట్టు... చైనావాల్‌ ఎక్కి చంద్రుణ్ని తాకినట్టు... ఎవరెస్ట్‌ ఎక్కి సెల్ఫీలు తీసుకున్నట్టు రకరకాల భావాలు కలిగాయ్‌ నాలో. పొద్దునే లేచి నీట్‌గా తయారై, అలవాటు లేకపోయినా టక్‌ చేసుకొని, షూ వేసుకొని బాడీకి స్ప్రేకొట్టి వెళ్లా. ‘బయల్దేరావా?’, ‘ఎంతదూరం వచ్చావ్‌?’, ‘నాకేం గిఫ్ట్‌ తెస్తున్నావ్‌?’ ఫోన్లతో ఉక్కిరిబిక్కిరి చేసింది. నాలాగే ఎగ్జైటింగ్‌గా ఉందునుకున్నా. జరుగుతోందంతా ఓ స్నేహితుడికి చెబుతూనే ఉన్నా. ‘రేయ్‌... ఇదేదో తేడా వ్యవహారంలా కనపడుతోంది. అదసలే పాతబస్తీ. తేడా వస్తే నరికేస్తారు’ జాగ్రత్త చెప్పాడు. లవర్‌ని కలవబోతున్న ఆనందంలో పట్టించుకోలేదు. చివరికి తను చెప్పినట్టే ఓ వీధిలోకి వెళ్లా. పెద్దగా జనం లేరు. ఎండగా ఉందని పక్కనే ఉన్న గోడ వారగా నిల్చున్నా. దూరం నుంచి ఇద్దరు వస్తాదుల్లాంటి వ్యక్తులు రావడం గమనించా. వాళ్లలో ఒకడు ఫోన్‌ చేస్తుంటే నా ఫోన్‌ మోగింది. ఎత్తగానే ‘హలో ఎక్కడున్నావ్‌?’ అన్నాడు. డౌటొచ్చి ఫోన్‌ కట్‌ చేసి నేను చేశా. వాడే ఎత్తాడు. అది నా లవర్‌ నెంబర్‌. క్షణం ఆలస్యం చేయకుండా అక్కణ్నుంచి జారుకున్నా. ఏదో దురుద్దేశంతోనే నన్నక్కడికి రప్పించిందని అర్థమైంది. ఫ్రెండ్‌ గదికెళ్లాక ఫోన్‌ చేస్తే ‘నీకోసం చాలాసేపు ఎదురుచూశా రాలేదేంటి?’ అని బుకాయించింది. ఇంకేం వినదల్చుకోకుండా కట్‌ చేశా. తనతో బంధాన్ని కూడా. ఆ ఇద్దరి చేతుల్లో పడితే నా పరిస్థితి ఎలా ఉండేదో ఆలోచిస్తుంటేనే ఒళ్లు జలదరిస్తోంది. ప్రేమ పేరుతో ఇలా దోపిడీ చేసేవాళ్లూ ఉంటారని అర్థమైంది. మిస్‌కాల్‌ పరిచయాలు, ప్రేమల్ని నమ్మకండి.

- రాజు, కర్నూల్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని