స్నేహమో.. మోహమో.. చెలి చేసింది గాయం!

‘పందీ’... ఇలా పిలిస్తే ఎవరికైనా ఒళ్లు మండుతుంది. నాకు మాత్రం గాల్లో తేలినట్టుండేది. నన్నలా పిలిచేది ఒక్క నవ్యనే. తను నా క్లాస్‌మేట్‌. నా సోల్‌మేట్‌. బీటెక్‌లో చేరిన మూడోరోజే ఒకమ్మాయిని చూపించి ‘ఈమే మీ బ్యాచ్‌ లీడర్‌’ అన్నారు హెచ్‌వోడీ. చామనఛాయ, గుండ్రని కళ్లు, ఎర్రని పెదాలు... వాటి కింద చిన్న పుట్టుమచ్చ. మళ్లీమళ్లీ చూడాలనిపించే నవ్వు. చూడగానే ‘బాగుంది’ అనిపించింది.

Published : 15 Jul 2017 01:34 IST

స్నేహమో.. మోహమో.. చెలి చేసింది గాయం!

‘పందీ’... ఇలా పిలిస్తే ఎవరికైనా ఒళ్లు మండుతుంది. నాకు మాత్రం గాల్లో తేలినట్టుండేది. నన్నలా పిలిచేది ఒక్క నవ్యనే. తను నా క్లాస్‌మేట్‌. నా సోల్‌మేట్‌.

బీటెక్‌లో చేరిన మూడోరోజే ఒకమ్మాయిని చూపించి ‘ఈమే మీ బ్యాచ్‌ లీడర్‌’ అన్నారు హెచ్‌వోడీ. చామనఛాయ, గుండ్రని కళ్లు, ఎర్రని పెదాలు... వాటి కింద చిన్న పుట్టుమచ్చ. మళ్లీమళ్లీ చూడాలనిపించే నవ్వు. చూడగానే ‘బాగుంది’ అనిపించింది.

ఓసారి ల్యాబ్‌లో సీరియస్‌గా వర్క్‌ చేసుకుంటున్నా. ‘హాయ్‌’ పిలుపు విని తలెత్తా. ‘నేను నవ్య. నీకు తెలిసే ఉంటుంది కదా’ అంటూ చేయి చాచింది. ఒక్కసారిగా ఒంటికి కరెంట్‌షాక్‌ తగిలినట్టైంది. నాకసలే అమ్మాయిలంటే బెరుకు. తనేమో ఆపకుండా గలగలా మాట్లాడుతోంది. కాసేపటికే భయం వదిలి నేనూ మాట కలిపా. పావుగంటలో తన మాట, అభిప్రాయాలు, చిరునవ్వు... అన్నీ నా మనసులో అచ్చయ్యాయి. క్లాసులో టీచరు పాఠం చెబుతుంటే మేం చూపులతోనే గుసగులాడుకునేవాళ్లం. ఒక్కోసారి కుదిరితే నేరుగా మనసు విప్పి మాట్లాడుకునేవాళ్లం. సెలవుల్లో ఆమె కనపడక నరకం కనిపించేది.

నాది లవ్వేనని ఫిక్సయ్యా. ‘కాలేజీలో.. ఇంట్లో ఎక్కడున్నా.. ఏం చేసినా నువ్వే గుర్తొస్తున్నావ్‌. నువ్వంటే నాకు...’ అంటూ ఓరోజు మనసు విప్పబోతున్నా. ‘నాకు లవర్‌ ఉన్నాడు’ నా మాటల్ని మధ్యలోనే తుంచేస్తూ నా గుండెల్లో బాంబు పేల్చింది. ఫస్టియర్‌ నుంచి ప్రేమలో ఉన్నామంది. వాళ్ల ప్రేమకు నేను అడ్డుపడటం భావ్యం కాదనిపించింది. కన్నీళ్లతో అక్కణ్నుంచి కదిలా.

నవ్యతో మాట్లాడ్డం ఆపేశా. రెండ్రోజులయ్యాక నోట్‌బుక్‌లో ఓ లెటర్‌ పెట్టి ఇచ్చింది. ‘ఎవరేమనుకున్నా ఫర్వాలేదు. నువ్వు నా ఫ్రెండ్‌వి. ఎప్పట్లాగే ఉండు. నీతో మాట్లాడకుండా ఉండటం నావల్ల కావడం లేదు’ అని రాసుంది. ప్రేమికుడిగా కాకపోయినా మంచి స్నేహితుడిగా అయినా తనతో జీవితాంతం కలిసి నడవాలనుకున్నా. మళ్లీ మామధ్య మాటలు పోటెత్తాయి. కష్టసుఖాలు, మంచీచెడూ, సినిమాలుప్రేమలూ... అన్ని విషయాలూ పంచుకునేవాళ్లం. ఇంజినీరింగ్‌ పూర్తై ఇళ్లకెళ్లిపోయాం. ఈమెయిళ్లొ రోజూ పలకరించుకునేవాళ్లం. అప్పుడప్పుడు వాళ్లమ్మ సెల్లోంచి ఫోన్‌ చేసి పలకరించేది. నేనూ నెలకోసారైనా ఆ నెంబర్‌కే చేసేవాణ్ని. ఓసారి ఏదో చెప్పాలని ఫోన్‌ కలిపా. ‘ఎందుకు కాల్‌ చేశావ్‌? మావాళ్లు మన గురించి ఏమనుకుంటారు?’ అంది చిరాకుగా. మనుషులు దూరమైతే మనసులూ దూరమయ్యాయేమో అనుకుంటూ పెట్టేశా. ఇక నవ్యతో మాట్లాడొద్దని ఫిక్సయ్యా.

‘నేను ఫోన్‌ కొన్నా. ఇది నా నెంబర్‌. ప్లీజ్‌ కాల్‌ మీ’ మెయిల్‌ చేసిందోరోజు. గత అనుభవాలు హెచ్చరిస్తున్నా ఆతృతగా ఫోన్‌ కలిపా. ఆరోజు నుంచి మా సెల్‌ఫోన్లకు నిద్ర కరువైంది. వాట్సాప్‌ ఛాటింగ్‌లు. గంటలకొద్దీ మాట్లాడుకోవడం. తను నన్ను ముద్దుగా ‘పంది’ అనేది. నేను ‘కన్నా’ అని పిలిచేవాణ్ని. ‘నాకు సంతోషం వచ్చినా... దుఃఖం వచ్చినా ముందు నువ్వే గుర్తొస్తావ్‌రా. నీతోనే అన్నీ పంచుకోవాలనిపిస్తుంది. నా జీవితంలో నీ ప్లేస్‌ని ఎవరూ భర్తీ చేయలేరు’ అందోసారి. ఫ్రెండ్‌వి అంటూనే లవర్‌లా మాట్లాడేది. తనది స్నేహమా? ప్రేమా? అర్థం కాకపోయేది.

ఇదిలా ఉండగానే సడెన్‌గా మాట్లాడ్డం మానేసింది. ఎవరో ­వూపిరి ఆపినట్టు విలవిల్లాడిపోయా. ఎందుకు మాట్లాడ్డం లేదంటే ‘ఏం లేదురా నాకు నా లవర్‌ మీద ప్రేమ ఎక్కువైంది. అందుకే నీకు తక్కువ సమయం కేటాయిస్తున్నా. అంతమాత్రాన నిన్ను అవాయిడ్‌ చేయట్లేదు. నువ్వు నా బెస్టీవి’ అంది. అదీ అబద్ధమేనని తొందర్లోనే అర్థమైంది. నేను పలకరిస్తే చిరాకు, కోపం ప్రదర్శించేది. ఇంతకుముందులా లేవు. చాలా మారిపోయావ్‌ అన్నానోసారి. ‘ఇలా నన్ను విసిగిస్తే ఇంకెప్పుడూ నాతో మాట్లాడకు’ నిర్దాక్షిణంగా చెప్పేసింది.

కళ్లతో సైగలు చేయడం.. నీతో మాట్లాడకపోతే నిద్రే రాదని గోముగా చెప్పడం.. వ్యక్తిగత విషయాలు పంచుకోవడం.. ఇవన్నీ ఒకమ్మాయి చేస్తోందంటే ఏ కుర్రాడైనా దాన్ని ప్రేమనే భావిస్తున్నాడు. నేనూ అలాగే అనుకుని మనసులో ఉన్నది ఉన్నట్టే చెప్పా. తనేమో స్నేహమంది. వేరొకరితో ప్రేమలో ఉన్నానంది. నేను తప్పుకుంటే ఫ్రెండ్‌గా ఉండమని బతిమాలింది. అవసరానికి వాడుకుంది. చివరికి ఏ కారణం లేకుండానే నువ్వంటే ఇష్టం లేదంది. తన స్వార్థపు ఆటలో గాయపడిన మనసు నేనే. ప్రేమ పవిత్రమైంది. స్నేహం విలువైంది. వాటి అర్థం తెలియని వ్యక్తులు ఇతరుల మనసులతో ఆడుకోవడం బాధాకరం. ఇది చదివాకైనా తను మారుతుందని ఆశిస్తున్నా.

- శ్రీకాంత్‌ (పేర్లు మార్చాం)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని