ఎప్పుడూ అనుకునేదాన్ని కాలం ఆగిపోవాలని!

లైఫ్‌ చాలా చిన్నది వసూ... ఎంత పెద్ద సమస్య వచ్చినా నిలబడాలి. జీవితాన్ని గెలవాలి’ అని విజయ్‌ చెప్పిన మాటలు గుర్తొస్తే లైఫ్‌ చిన్నది కాదు... విచిత్రమైన పరిచయాలతో చిత్రమైంది అనిపిస్తుంది. ఇప్పటికి 23 ఏళ్లు అనుకుంటా నాకు విజయ్‌ పరిచయం అయ్యి....

Published : 23 Sep 2017 01:56 IST

ఎప్పుడూ అనుకునేదాన్ని కాలం ఆగిపోవాలని!

లైఫ్‌ చాలా చిన్నది వసూ... ఎంత పెద్ద సమస్య వచ్చినా నిలబడాలి. జీవితాన్ని గెలవాలి’ అని విజయ్‌ చెప్పిన మాటలు గుర్తొస్తే లైఫ్‌ చిన్నది కాదు... విచిత్రమైన పరిచయాలతో చిత్రమైంది అనిపిస్తుంది. ఇప్పటికి 23 ఏళ్లు అనుకుంటా నాకు విజయ్‌ పరిచయం అయ్యి....

పక్క పక్క పోర్షన్లే. చిన్నప్పటి నుంచీ విజయ్‌ని చూస్తున్నా. నా మనసు కొలనులో తను కలువై పూసిన విషయం నాకెలా తెలిసిందో ఇప్పటికీ అర్థం కాదు. ఇరుకైన ఇళ్లలో విశాలమైన మససులు మావి... ఇరు మనసుల గుసగుసలు ఇట్టే వినిపించేవి. గోడకి ఇరువైపులా కూర్చుంటే చాలు. గుండె చప్పుళ్లలో చెప్పలేని కబుర్లెన్నో వినిపించేవి. చిన్న కాంపౌండులో కుటుంబంలా ఉండేవాళ్లం. టెన్త్‌ క్లాస్‌లో అనుకుంటా... మా కాంపౌండులో మల్లె తీగ నాటాలని అనుకున్నాం. తను గుంత తవ్వితే... నేను నాటాను. తను మట్టేస్తే... నేను నీరయ్యాను. మా వయసుతో పాటు మల్లే అల్లుకుందీ... మా ఇద్దరి మనసుల్లా విడదీయలేనంతలా!

కాలేజీ ఏజ్‌కి వచ్చేశాం. నేనేమో ఆటోలో తనేమో బైకుపైనా వెళ్లేవాళ్లం. అదేంటో ఎంత ట్రాఫిక్‌లో ఉన్నా... ఇంట్లో పనిలో ఉన్నా... విజయ్‌ బండి శబ్దాన్ని నేనిట్టే కనిపెట్టేదాన్ని. వాడి బైక్‌ సౌండింగ్‌కి నాకు ఉన్న చిత్రమైన కమ్యూనికేషన్‌ అది. బైక్‌ చేసే శబ్దంతోనే వాడి మూడ్‌ని చెప్పేవాడు. హార్న్‌తో తన హార్ట్‌లోని సంగతుల్ని దూరం నుంచే చేరవేసేవాడు. వాడు బండిపై వెళ్లేప్పుడు నా చూపంతా వాడి జుట్టుపైనే... గాలికి భలే ఎగిరేది. హెల్మెట్‌ తీయగానే చెమటకి తడిసిన జట్టుతో నేనెన్ని సార్లు ఆడుకున్నానో! వాడి స్టైల్‌కి కాలనీలో అమ్మాయిలంతా ఫిదా అయ్యేవారు. వాళ్లని చూస్తుంటే నాకదో కిక్కు. ఎందుకంటే వాడు నాకు ఫిదా! ప్రేమా.. చదువూ... సవ్యంగా సాగుతున్నాయ్‌... కాలం ఇలానే ఆగిపోతే బాగుండేదని చాలా సార్లు అనుకునే దాన్ని. సినిమాలో ఫ్రీజ్‌ అయ్యే సన్నివేశంలా... కానీ, మరుక్షణం జీవితం ప్లే అయ్యేది... గ్రాడ్యుయేషన్‌ తర్వాత క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ వాడికి. కారణం లేకుండానే కలసి ఎన్నో పార్టీలు. ఉద్యోగం వచ్చిదంటే ఇంకా ఆగుతామా ఫేవరేట్‌ బేకరీలో పార్టీ. ఎప్పటిలానే బండిపై వెళ్తూ అద్దంలో నన్నే చూస్తుండేవాడు. కళ్లెగరేస్తూ కొంటె కబుర్లు. నేనేమో వాడికి తగలదని తెలిసి హెల్మెట్‌ ధరించిన నెత్తిపై మొట్టికాయ్‌ వేసేదాన్ని. వాడేమో మునివేళ్లను ముద్దాడేవాడు. బేకరి వచ్చేసింది. హెల్మెట్‌ తీసి వాడి పొడవైన జుట్టుని విదిలిస్తే... తలకి పట్టిన చెమట చుక్కలు వర్షంలా నా ముఖంపై పడ్డాయి... అప్పుడూ అనిపించింది. కాలం ఇలా ఆగిపోవాలని ఫ్రీజ్‌ చేసేదాన్ని. కానీ క్షణాల్లో తిరిగి ప్లే అయ్యేది...

మాకు కేటాయించిన టేబుల్‌పై కూర్చున్నాం. ఇంతలో ఎగ్జామ్‌ అయిపోందని వాళ్ల చెల్లి నుంచి ఫోన్‌. ఫోన్‌ మాట్లాడుతూ బయటికి వెళ్లాడు. అద్దం బయట నుంచే 10 నిమిషాలని సైగ చేశాడు. ఒకే అని నేనూ కళ్లతోనే చెప్పి ఫోన్‌ని టేబుల్‌పైన పెట్టి వాడి హెల్మెట్‌తో ఆడుకుంటున్నా. పొడవైన తన వెంట్రుకొకటి చేతికి తగిలింది. తీసి... చేతి వేళ్లతో మెలేస్తుంటే ఏదో తన్మయం. ఏంటా ఫీలింగ్‌... వాడి ప్రజెన్స్‌ ఏదైనా నన్ను మాయ చేస్తుంది. ఎప్పుడూ ఇలాగే వాడి ప్రేమతో కాలం ఇలా నిలిచిపోతే బాగుంటుందని హెల్మెట్‌పై తలవాల్చాను. ఇంతలో ఫోన్‌ రింగ్‌ అయ్యింది. లిఫ్ట్‌ చేశా. తర్వాత నేనేం విన్నానో... మాట్లాడేదెవరో నాకు అర్థం కాలేదు. కాలం నిజంగానే ఆగిపోయింది. ‘యాక్సిడెంట్‌... విజయ్‌ చనిపోయాడు’. లాస్ట్‌ డైల్డ్‌ లిస్ట్‌లో నాదే నెంబర్‌. తను లేడని విన్నది మొదట నేనే. చేతిలో హెల్మెట్‌ కిందపడింది. వాడి తలవెంట్రుక వేళ్ల మధ్యలో గాలికి ఎగురుతోంది. దాని స్పర్శ నాకు తెలుస్తోంది. తర్వాత కొన్ని రోజుల వరకూ తను వెలుగు... నేను చీకటని తెలుసుకున్నాను. ఏదో ఒక్కటే ఉండేది. అందుకే నేను చీకటి నుంచి వెలుగులోకి వచ్చాను. చిత్రమైన జీవితంలో నా పాత్రకి న్యాయం చేస్తున్నాను. ఇప్పటికీ అదే టేబుల్‌... అద్దం బైట విజయ్‌ చేసిన సైగలు... నన్ను బాధిస్తూనే ఉన్నాయి. తన చెల్లిని తీసుకురావడానికి వెళ్తున్న విషయం నాకు తెలిసుంటే ఆడుకున్న హెల్మెట్‌... వాడికి ఆయువయ్యేదేమోనని!!

- వసు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని