నా మౌనం ఖరీదు... అన్న ప్రాణం

నా పెన్సిల్‌ విరిగిపోతే... చెక్కుకోవడానికి నాకు కష్టమని మా అన్న దాన్ని తీసుకుంటాడు. తన పెన్సిల్‌ నాకిచ్చేస్తాడు...

Published : 06 Jan 2018 02:23 IST

మనసులో మాట
నా మౌనం ఖరీదు... అన్న ప్రాణం

నా పెన్సిల్‌ విరిగిపోతే... చెక్కుకోవడానికి నాకు కష్టమని మా అన్న దాన్ని తీసుకుంటాడు. తన పెన్సిల్‌ నాకిచ్చేస్తాడు. ఆడుకునేటప్పుడు నా షర్ట్‌ బటన్స్‌ పోతే... తాను ఆ షర్ట్‌ వేసుకొని ఇంటికొచ్చి అమ్మతో తిట్లు తింటాడు. మా నాన్న టీచర్‌. మా అమ్మ గృహిణి. వూర్లో ఉన్న పొలాన్నీ మా నాన్నే సాగుచేసేవాడు. అన్నకూ వ్యవసాయమంటే ఇష్టం. వూర్లోనే మా మామ కూతురిని పెళ్లి చేసుకొని అక్కడి ఉండిపోయాడు. నాకు హైదరాబాద్‌లో ఉద్యోగం. నాకు పెళ్లైంది. అన్నకిద్దరు పిల్లలు. నాకు ఒక్కడే కొడుకు. వూరెళ్లినప్పుడు నాకు, నా కొడుక్కు...నా భార్యకు ఇష్టమైనవన్నీ అన్నా, వదినా చేసేవారు. 2012 జనవరి 27... ఎంతో హాయిగా సాగిపోయే మా జీవితాల్లో విషాదం... మా నాన్న మరణం. ఆయన మంచం మీద ఉన్నన్నీ రోజులు కంటికిరెప్పలా కాచుకున్నాడు మా అన్న. ఆ దిగులుతో ఏడాది గడవకుండానే మా అమ్మ ప్రాణాలు విడిచింది. నా భార్య ఆస్తిపంపకాలు చేయాలని పట్టుబట్టింది. నెల రోజుల తర్వాత నాకు ఫోన్‌ చేశాడు అన్న. ఒక రోజు వూరికి రారా అని. ఇంతలో మా వూరిలో మా చిన్నాన్న కొడుకు(తమ్ముడు) ఫోన్‌ చేశాడు. నీకు వూరి బయట 11 ఎకరాలు రాసిచ్చి... ఆయన 12 ఎకరాలు తీసుకోవాలనుకుంటున్నాడని. ఈ విషయం తెలుసుకున్న నా భార్య మండిపోయింది. మే 23, 2013 అందరం వూరికి వెళ్లాం. అప్పటికే నా భార్యకు వూర్లో వాళ్లు ఇచ్చిన సమాచారం ప్రకారం అన్న నాకు ఏదో మోసం చేస్తున్నట్లు అనిపించింది. వెళ్లీవెళ్లగానే నా భార్య గొడవేసుకుంది. అన్న ఏదో నచ్చజెప్పబోయాడు. వినలేదు. ‘ఇల్లూ మీకే కావాలి... ఒక ఎకరా భూమి మీకే ఎక్కువ ఎందుకలా? అని ప్రశ్నించింది. మాకు బాబు ఉన్నాడు. వాడి భవిష్యత్తు ఏమిటి?’ అని గట్టి, గట్టిగా ఏడ్చేసింది. చుట్టుపక్కల వాళ్లు అందరూ గుమిగూడారు. నేను తనని అడ్డుకోలేదు. ఒక్క మాటైనా నోరెత్తి మాట్లాడలేదు. నా కళ్లలోకి చూసిన అన్న వదినా, పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్లిపోయారు. నేను అలా వూర్లోకి వెళ్లాను. మా ఇద్దరికీ చిన్నప్పుడు పాఠాలు చెప్పిన మాస్టారు కన్పించారు. ‘‘ఏరా! చిన్నోడా బాగున్నావా? అదేందిరా... నీటి వసతి ఉండే భూమి నీకిచ్చి...మీ అన్న ఆ రాళ్లనేల తీసుకున్నాడంట. బాగున్న భూమిలోనే పంటలు పండక చస్తున్నాంరా? పైగా మీ నాన్న ఆరోగ్యం బాగాలేనప్పుడు. మీ అమ్మ ఆరోగ్య పరీక్షలకు మీ అన్న బాగా అప్పుచేశాడు. ఆ ఇల్లు తాకట్టు పెట్టాడంట. నీ వాటాకొచ్చిన డబ్బు వాడుకోమని ఎంత చెప్పినా వినలేదు. అదంతా నీ కొడుకు పేరుతో ఏటా ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తాడు కదా. అయినా నువ్వు వూర్లో ఉండి వ్యవసాయం చేసేదుందా? మీ అన్నకే ఆ సాగు భూమి ఇవ్వురా. వాడెప్పుడూ అంతే నువ్వు కష్టపడకూడదనే ఆలోచిస్తాడు.’’ అని భుజం తట్టి నన్ను దాటాడు. నా మనసు గట్టిగా రోదించింది. అన్నను నేను ఎంత అపార్థం చేసుకున్నాను. నీటి వసతున్న భూమి ఆ 12 ఎకరాలకంటే 5రెట్లు ఎక్కువ ధర పలుకుతుంది. అందుకే అది నాకివ్వడానికి చూసి ఉంటాడు. ఆ రాళ్ల భూమి అన్న తీసుకొని కష్టపడదామనుకొని ఉంటాడు. అన్నా నన్ను క్షమించు అని అడగాలని పొలం దగ్గరికి పరుగుతీశాను. అన్న ఉన్నట్టుండి పడిపోయాడని వదినా, పిల్లలు ఎదురు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. అందరం కలిసి పరుగుతీశాం. నా భార్య మాటలకు, నా మౌనానికి పగిలిపోయిన అన్న గుండె ఇక కొట్టుకోలేక... అప్పుడే ఆగిపోయినట్టుంది. ‘అన్నా నన్ను క్షమించు... ఒక్కసారి బతుకు’ అని ఎంతగా ఏడ్చానో... పక్కనోళ్ల మాటలు విని... బంధుమిత్రులను ఎప్పుడూ అపార్థం చేసుకోకండి. ఒక్కోసారి మీ మౌనమూ వారికి మరణశాసనం అవుతుంది. నాలా ఆత్మీయుణ్ని కోల్పోయి జీవితాంతం ఏడవకండి.

- రమేశ్‌, కరీంనగర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని