వేయి కళ్లతో ఎదురుచూస్తున్నా

మోహన్‌..నీకు దూరంగా ఇన్ని రోజులు ఎలా ఉన్నానో మాటల్లో చెప్పలేను. చదువుకునేటప్పుడు మనమధ్య స్నేహాన్ని చూసి అందరూ అసూయపడేవారు....

Published : 04 Aug 2018 02:09 IST

వేయి కళ్లతో ఎదురుచూస్తున్నా

మోహన్‌..నీకు దూరంగా ఇన్ని రోజులు ఎలా ఉన్నానో మాటల్లో చెప్పలేను. చదువుకునేటప్పుడు మనమధ్య స్నేహాన్ని చూసి అందరూ అసూయపడేవారు. మన ఇద్దరినీ డిగ్రీలో అందరూ బెస్ట్‌ ఫ్రెండ్స్‌ అనేవారు. ఈస్నేహం మన జీవితాంతం ఇలాగే ఉండాలి అనేవాడివి. మా కుటుంబానికి కూడా ఎంతో ప్రేమపాత్రుడివి. చదువు విషయానికి వస్తే.. పరీక్షల్లో పోటీపడి చదివేవాళ్లం. కాలేజీలోనే అందరికన్నా మనం మంచి పేరు తెచ్చుకోవడానికి కృషి చేసేవాళ్లం. కానీ నీకు తెలియనిది ఒకటుంది. నువ్వంటే నాకెంతో ప్రేమ. ఎన్నోసార్లు నీతో చెప్పాలని అనుకునేదాన్ని. కానీ నా గురించి నువ్వేమనుకుంటావో అనే అనుమానంతో ధైర్యం చేయలేకపోయా. చాలా విషయాలు మనిద్దరం మాట్లాడుకున్నప్పుడు ప్రేమ గురించి మాత్రం మాట్లాడలేకపోయేదాన్ని.  మనసంతా నీవే ఉన్నావని చెప్పాలని ఉన్నా, చెప్పలేక.. మౌనంగా ఉండేదాన్ని. పైచదువులకు నువ్వు వేరే ఊరు వెళ్లిపోతున్న సమయంలో పార్కులో కలిశాం, గుర్తుందా. నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నామని అంకుల్‌, ఆంటీ చెప్పారని నన్ను అడిగావు. ఆ సమయంలో నా కళ్లలో నీళ్లను గుర్తించలేదు. చదువుకోవాలని ఉంటే ఇంట్లో చెప్పు, అంతేగానీ ఇష్టం లేని పెళ్లికి అంగీకరించకు అన్నావు. కానీ.. నిన్ను వదల్లేకే ఆ కన్నీళ్లు అని చెప్పలేకపోయా. తరువాత  ప్రతీ పండుగకు వచ్చి కలుస్తా అన్నావు. తరువాత నువ్వు ఎందుకు కనిపించలేదో తెలీదు. లెటర్‌ లేదు. ప్రతీరోజూ నీ కబురు కోసం ఎదురు చూసేదాన్ని. నువ్వెళ్లిన ఆరు నెలలకే అనుకోని మార్పులు. నాన్న గుండెపోటుతో చనిపోయారు. మావయ్య వచ్చి నన్ను, అమ్మను వాళ్లూరు తీసుకొచ్చేశారు. ఆ తరువాత నేను మీ అమ్మగారితో ఫోన్‌లో మాట్లాడటానికి ప్రయత్నించా. కానీ ఆ నెంబరు పనిచేయలేదు.ఈ నాలుగేళ్లూ నీ ఆలోచనలే. గతవారం ఓ పెళ్లికి విజయవాడ వెళ్లా. అక్కడ మన క్లాస్‌మేట్‌ పద్మ కనిపించింది. నీ గురించి అడిగా. అప్పుడే అసలు విషయం తెలిసింది. నాపై ప్రేమతోనే నువ్వు నాకు దూరంగా ఉన్నావని తను చెప్పింది. నాకు పెళ్లి అవుతుందనుకుని, నన్ను డిస్ట్రబ్‌ చేయకూడదనే ఆలోచనతోనే నాతో మాట్లాడకుండా ఉన్నావని చెప్పింది. ఎందుకు నీ ప్రేమను దాచావు. అసలు తప్పంతా నాదే. నా మనసును దాచాను. నేను ఎక్కడ ఉన్నానో తెలియదని కూడా అన్నావట. అందుకే ఈ ఉత్తరం.  వైవాహిక బంధంలో భార్యాభర్తలిద్దరూ మంచి స్నేహితులుగా ఉండాలంటారు. కానీ మనం ముందే మంచి స్నేహితులం. మనిద్దరం ఒకరికొకరం తెలియకుండా మనసులనిండా ప్రేమను నింపుకొన్నాం. ఆ ప్రేమను పెళ్లిగా మార్చుకోవాలని ఉంది. నీ బదులు కోసం ఎదురుచూస్తూ ఉంటా. నీ గొంతులో నా పేరును వినాలని ఉంది. ఇన్నేళ్ల తరువాత మన స్నేహాన్ని ప్రేమబంధంతో ముడివేసి, ఇద్దరినీ ఒకటి చేయాలని వేయిదేవుళ్లను మొక్కకుంటున్నా.

- సుమ  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని