Karan Johar: 25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఇలా చేయడం బాధగా ఉంది: కరణ్‌ జోహార్‌

కమెడియన్‌ తనను అనుకరించడంపై కరణ్‌ జోహార్‌ స్పందించారు. సోషల్‌ మీడియా వేదికగా బాధ పడ్డారు.

Published : 07 May 2024 00:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ కమెడియన్‌ ఒకరు తనను చీప్‌గా అనుకరించారని, దాన్ని చూసి బాధపడ్డానని బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్‌ జోహార్‌ (Karan Johar) వాపోయారు. 25 ఏళ్లుకుపైగా ఇండస్ట్రీలో ఉంటున్న వ్యక్తి గురించి అలా ప్రదర్శించడం సబబు కాదన్నారు. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌ పెట్టారు.

‘‘అమ్మతో కలిసి టీవీ చూస్తుంటే ప్రముఖ ఛానల్‌లో ప్రసారమయ్యే రియాలిటీ కామెడీ షోకు సంబంధించిన ప్రోమో ప్లే అయింది. అందులోని కమెడియన్‌ నన్ను చీప్‌గా అనుకరించారు. ఇలాంటివి సోషల్‌ మీడియాలో కనిపిస్తే ఊరూ పేరూ లేని వారు చేశారనుకుని వదిలేయొచ్చు. కానీ, 25 ఏళ్లకుపైగా ఇండస్ట్రీలో ఉంటున్న నన్ను ఇండస్ట్రీకి చెందిన వ్యక్తే ఇలా చేయడం బాధగా ఉంది’’ అని అన్నారు.

కరణ్‌.. వ్యాఖ్యాతగానూ అలరిస్తారనే సంగతి తెలిసిందే. ‘కాఫీ విత్‌ కరణ్‌’ షో ఆయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ‘లైగర్‌’, ‘బ్రహ్మాస్త్ర: పార్ట్‌ 1’, ‘సెల్ఫీ’, ‘యోధ’ తదితర చిత్రాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. ‘యే దిల్‌ హై ముష్కిల్‌’ తర్వాత సుమారు ఏడేళ్లకు ఆయన ‘రాకీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహానీ’ (Rocky Aur Rani Kii Prem Kahaani) కోసం మెగాఫోన్‌ పట్టారు. రణ్‌వీర్‌ సింగ్‌ (Ranveer Singh), అలియా భట్‌ (Alia Bhatt) జంటగా నటించిన ఈ రొమాంటిక్‌ కామెడీ ఫిల్మ్‌ గతేదాడి జులైలో విడుదలై, బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు సాధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని