Sunil Narine: నరైన్‌ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!

మైదానంలో సునీల్‌ నరైన్‌ చాలా కామ్‌గా సీరియస్‌గా ఉండటాన్ని ఫ్యాన్స్‌ గమనించే ఉంటారు. వికెట్లు తీసినా పెద్దగా ఆవేశపడకుండా.. ప్రశాంతంగా కనిపిస్తాడు. దీనిపై అతడి సహచరులు చెప్పిన ఆసక్తికర విషయాలు..

Published : 07 May 2024 00:43 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈ ఏడాది ఐపీఎల్‌లో బ్యాట్‌, బాల్‌తో సంచలనాలు సృష్టిస్తున్న ఆల్‌రౌండర్‌ సునీల్‌ నరైన్‌ (Sunil Narine). తన మిస్టరీ స్పిన్‌ బౌలింగ్‌తో ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తూ కేకేఆర్‌కు అండగా నిలుస్తున్నాడు. ఇక మ్యాచ్‌ సమయంలో అతడు చాలా సీరియస్‌గా ఆటలో నిమగ్నమైపోతున్నాడు. ముఖంలో ఎలాంటి భావోద్వేగాలూ కనిపించనీయకపోవడం ప్రత్యర్థులనే గందరగోళానికి గురి చేస్తోంది. ఈ క్రమంలో కేకేఆర్‌ సహచర ఆటగాళ్లు నరైన్‌ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను కేకేఆర్‌ జట్టు నేడు విడుదల చేసింది. రఘువంశీ, ఆండ్రీ రస్సెల్‌, ఫిల్‌ సాల్ట్‌ వంటి వారు ఈ సందర్భంగా తమ అభిప్రాయాలను వెల్లడించారు. 

‘‘అతడు చాలా స్థిరమైన మనిషి. చాలా సరదాగా ఉంటాడు. అతడు క్రికెట్‌ను ప్రేమిస్తాడు. ఇద్దరు ఆటగాళ్లను కలిపితే అతడితో సమానం’’ అని ఫిల్‌ సాల్ట్‌ పేర్కొన్నాడు. 

నరైన్‌ భావోద్వేగాలను కనిపించనీయకపోవడానికి అతడి అనుభవమే కారణమని సహచరుడు ఆండ్రీ రస్సెల్‌ అభిప్రాయపడ్డాడు. ‘‘అతడు 500 మ్యాచ్‌లు ఆడాడు. ఎక్కువ మ్యాచ్‌లు ఆడినప్పుడు ఆ అనుభవం కారణంగా తొందరగా మీలో ఉద్రేకంం కనిపించదు’’ అని పేర్కొన్నాడు. ఇక రఘువంశీ మాట్లాడుతూ ‘‘అతడు డగౌట్లో బాగా నవ్వుతాడు.. జోకులు వేస్తాడు. సీరియస్‌గా ఉండటం అది ఆట వరకే అనుకుంటాను. అతడు టీమ్‌ లెజెండ్‌. బ్యాట్‌, బాల్‌తో అద్భుతాలు సృష్టించగలడు’’ అని వెల్లడించారు. 

ఇటీవల ఐపీఎల్‌ నరైన్‌ ఆటను చూసి సీనియర్లు అభినందిస్తున్నారు. ఇదివరకు టాప్ ఆర్డర్ పవర్‌ హిట్టర్‌గా ఉన్న నరైన్‌ ఇప్పుడు పూర్తిస్థాయి బ్యాటర్‌గా మారాడని ఆసీస్‌ మాజీ పేసర్ బ్రెట్ లీ అన్నాడు. నరైన్‌ ఈ ఐపీఎల్ సీజన్‌లో 11 మ్యాచ్‌లు ఆడి 183.67 స్ట్రైక్‌రేట్‌తో 461 పరుగులు చేశాడు. అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. కోల్‌కతా ప్లే ఆఫ్స్‌కు చేరడం దాదాపు ఖాయమైంది. ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌ల్లో నరైన్ ఇదే దూకుడు కొనసాగిస్తే అతడు టోర్నీలో టాప్‌ స్కోరర్‌గా నిలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని