కొత్త కొలువులకు చలో అనేద్దాం!

నైన్‌ టూ ఫైవ్‌ ఉద్యోగాలు.. కంప్యూటర్లతో కుస్తీలు... ఫైళ్లతో సావాసం.. వూపిరి సలపనన్ని బాధ్యతలు... ఎప్పుడూ ఈ బోర్‌ కొట్టించే పనులేనా? కోటి ఆశలతో కొత్త ఏడాది ముంగిట్లో అడుగు పెట్టాం... కొత్తకొత్తగా అందుబాటులోకి వస్తున్న అవకాశాల గురించీ విందాం.. ఇందులో కొన్ని ఇప్పటికే కుర్రకారు దరి...

Published : 07 Jan 2017 01:28 IST

కొత్త కొలువులకు చలో అనేద్దాం!

నైన్‌ టూ ఫైవ్‌ ఉద్యోగాలు.. కంప్యూటర్లతో కుస్తీలు... ఫైళ్లతో సావాసం.. వూపిరి సలపనన్ని బాధ్యతలు... ఎప్పుడూ ఈ బోర్‌ కొట్టించే పనులేనా? కోటి ఆశలతో కొత్త ఏడాది ముంగిట్లో అడుగు పెట్టాం... కొత్తకొత్తగా అందుబాటులోకి వస్తున్న అవకాశాల గురించీ విందాం... ఇందులో కొన్ని ఇప్పటికే కుర్రకారు దరి చేరాయి... ఇంకొన్ని త్వరలోనే భారత్‌ని చుట్టేయొచ్చన్నది నిపుణుల మాట.. ఆ సరికొత్త అవకాశాలు, కొలువుల సంగతులు చదివేయండి మరి.
యితే ఇంజినీర్‌ లేదంటే డాక్టర్‌. పట్టా అందుకున్న తెలుగిళ్లలో మొన్నటిదాకా పలవరించిన ఉద్యోగాలు. ఆనక కార్పొరేట్‌ బాట పట్టారు. అంకుర సంస్థలంటూ పరుగందుకున్నారు. ఇప్పుడు అదీ మందగమనం పట్టింది. బోర్‌ కొట్టించే ఆ ఉద్యోగాలపై చూపు మరల్చి యువత కొత్త బాట పడుతున్నారు. వాళ్లని ఆకట్టుకుంటున్నవివే.

సెల్ఫీ వీడియో పంపితే ఉద్యోగం

దైనా ఉద్యోగానికి దరఖాస్తు చేయాలంటే రెజ్యుమెలు పంపడం, ఇంటర్వ్యూలకు హాజరవడం పాత పద్ధతి. రాబోయేదంతా సెల్ఫీ వీడియో రెజ్యుమేల కాలమే అంటాడు ‘హ్యాపీమైండ్స్‌ మ్యాన్‌పవర్‌ సొల్యూషన్‌’ ప్రతినిధి. తమ అర్హతలు, అనుభవాలు, ప్రత్యేకతలేంటో చెబుతూ సెల్ఫీ వీడియో తీసి ఉద్యోగం కోరుతున్న కంపెనీ ప్రతినిధులకు పంపేయడమే. ఏం కోరుకుంటున్నావో, ఎలా పనిచేయాలనుకుంటున్నావో చెప్పేయడమే. నచ్చితే సంస్థలు ఎర్ర తివాచీ పరుస్తాయి. ఇదేదో కొత్తగా ఉందే.. ఆచరించడం ఎలా? అని అయోమయానికి గురయ్యేవారికి ‘హ్యాపీ మైండ్స్‌’ లాంటి బోలెడు యాప్స్‌ దారి చూపిస్తాయి. ఈ బాటలో వెళ్లి సెల్ఫీ వీడియోలతో ఉద్యోగానికి బాటలు వేసుకోవచ్చు.

తినడమే పని

కాకా హోటల్‌.. రెస్టరెంట్‌.. స్టార్‌ హోటల్‌.. ఎక్కడ తిన్నా డబ్బులు కట్టాల్సిందే. కానీ హోటళ్లలో ఉచితంగా రకరకాల ఆహారపదార్థాలను ఆరగించడమే పనిగా ‘ఈటింగ్‌ ఆఫీసర్‌’ అనే ఉద్యోగం ఉందనే సంగతి మీకు తెలుసా? ఇంగ్లండ్‌ కేంద్రంగా ‘వెయిట్‌ వాచర్స్‌’ అనే సంస్థ ముప్పైదేశాల్లో పనిచేస్తోంది. వూబకాయంతో బాధపడే కుర్రకారు బరువు తగ్గించడమే దీని లక్ష్యం. ఏడాది కిందట చేసిన అధ్యయనంలో తమ సభ్యుల్లో 72శాతం మంది హోటళ్లు, రెస్టరెంట్ల వైపు చూడకపోవడంతో నలుగురిలో కలవకుండా ఆత్మన్యూనతకు గురవుతున్నారని తేలింది. ఈ పరిస్థితి మార్చడానికే ‘అఫీషియల్‌ ఈటింగ్‌ ఆఫీసర్‌’ అనే ఉద్యోగం సృష్టించారు. వందలమందిని వడపోసి సోఫీ హార్డీ అనే పాతికేళ్ల అమ్మాయిని ఎంపిక చేశారు. దేశమంతా తిరుగుతూ ప్రముఖ రెస్టరెంట్లలో ఆహారపదార్థాలు తింటూ ఆ రుచుల మంచీచెడులు వివరిస్తూ, సలహాలివ్వడం హార్డీ పని. రుచికరంగా, శుచికరంగా ఉంటే ఆ హోటల్‌/రెస్టరెంట్‌కి వెయిట్‌ వాచర్స్‌ ఆమోదముద్ర వేసి సభ్యులు నిరభ్యంతరంగా వెళ్లొచ్చని సూచిస్తారు. ఏడాది తిరిగేసరికే ఇలాంటి ఆఫీసర్ల సంఖ్య సెంచరీకి చేరువైంది. త్వరలోనే ఈ ట్రెండ్‌ ఇండియానూ తాకొచ్చు. రుచుల్ని పసిగట్టగలిగే నేర్పు, పాకశాల ప్రావీణ్యంలో డిగ్రీ ఉంటే అదనపు అర్హత.

సాహసాల శిక్షకుడు

తంలో సరదా పర్యటనలంటే హిల్‌స్టేషన్లు, సందర్శనీయ స్థలాలు, చారిత్రక ప్రదేశాలు చుట్టిరావడం. ఇప్పుడు వాటిస్థానే సాహసాలకు పెద్దపీట వేసే ‘అడ్వెంచరస్‌ టూరిజం’ వూపందుకుంటోంది. శిక్షకులకు ఫుల్‌ గిరాకీ. ఫిట్‌నెస్‌ జంకీలు, ప్రకృతిపై మమకారం ఉన్నవారు ఈ అవకాశాల్ని అందిపుచ్చుకుంటున్నారు. ఇలా ‘ఎక్స్‌పర్ట్‌’ అనిపించుకున్నవారు రోజుకి కనీసం రెండు, మూడు వేలన్నా సంపాదిస్తారన్నది బైక్‌పై కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ యాత్ర చేసిన రోహిత్‌ మాట. ఈ యాత్రకోసం తనూ ఓ అడ్వెంచరస్‌ ట్రైనర్‌ దగ్గర శిక్షణ పొందాడు. నిజంగానే ఈ నిపుణులకు అవకాశాలు పెరిగిపోతున్నాయా అంటే ‘ఎందుకు పెరగవు? మా హైదరాబాద్‌ అడ్వెంచర్‌ క్లబ్‌లో వేలమంది సభ్యులున్నాం. ట్రెక్కింగ్‌, రాక్‌ క్లైంబింగ్‌, రివర్‌క్రాసింగ్‌ అంటూ నెలకోసారైనా ఔట్‌డోర్‌ యాత్రలు చేస్తాం. మాలాంటి బృందాలు ఒక్క హైదరాబాద్‌లోనే వందల్లో ఉంటాయి’ అంటాడు అహ్మద్‌మహ్మద్‌. ఈ శిక్షకులకే శిక్షణనిచ్చేందుకు ముస్సోరిలో ‘హిమాలయన్‌ అడ్వెంచర్‌ ఇనిస్టిట్యూట్‌’లాంటి విద్యాసంస్థలు దేశంలో ఎన్నో ఉన్నాయి. అక్కడ ర్యాపెల్లింగ్‌, రివర్‌క్రాసింగ్‌, స్విమ్మింగ్‌, రోయింగ్‌, వాటర్‌ సర్ఫింగ్‌, కాయకింగ్‌, రాక్‌ క్లైంబింగ్‌, ట్రెక్కింగ్‌, ఫారెస్ట్‌ ఎక్స్‌ప్లోరేషన్‌, పర్వతాలు ఎక్కడం, జలక్రీడల్లో తర్ఫీదు ఇస్తున్నారు. బేసిక్‌ డిగ్రీతో ఎవరైనా చేరిపోవచ్చు. ఫిట్‌నెస్‌పై పట్టున్న కుర్రకారుకు మంచి అవకాశం.

ఫర్నీచర్‌ పరీక్షిస్తారా

‘జో సోతా హై.. వో ఖోతా హై’ అని హిందీలో సామెత. అంటే నిద్రపోతూ ఉండేవాడు అవకాశాలు కోల్పోతాడని అర్ధం. కానీ హాయిగా పడుకోవడం మీకు చేతనైతే ఉద్యోగం గ్యారెంటీ అంటున్నాయి కొన్ని కంపెనీలు. ఆ కొలువుకి ‘మాట్రెస్సెస్‌ టెస్టర్‌’ అని పేరు కూడా ఇచ్చేశాయి. ట్రెండ్‌ మొదలుపెట్టింది అర్బన్‌ల్యాడర్‌ అనే భారతీయ కంపెనీనే. ఈ ఉద్యోగం కోసం లింక్డ్‌ఇన్‌లో ఏకంగా ఉద్యోగ ప్రకటన కూడా ఇచ్చేసింది. మొదటిసారే ఐదువందల దరఖాస్తులు వచ్చిపడ్డాయ్‌. రోజంతా పరుపులపై పవళించడం. ఎంత సౌకర్యవంతంగా ఉందో చెప్పడం.. కాఫీటీల్లాంటివి ఒలికినపుడు పరుపులు ఎలా పాడవుతున్నాయో గమనించడం.. వాటిని ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్తే ప్రయాణంలో ఎదురయ్యే సాదకబాధకాలు గమనించడం ఇవీ విధులు. లండన్‌లోని స్టార్‌ హోటళ్ల సంఘం ‘చాటర్‌’ కూడా ‘ప్రొఫెషనల్‌ బెడ్‌ టెస్టర్‌’ పేరుతో ఇలాంటి ఉద్యోగుల్నే నియమించుకుంది. 25వేల పడకల్ని పరీక్షించడం వీరి పని. రాత్రీపగళ్లూ గది కళ్లకింపుగా కనపడాలంటే ఏం చేయాలో సలహాలివ్వాలి. వీళ్ల జీతం ఎంతో తెలుసా? అక్షరాలా ఏడాదికి రూ.21 లక్షలు. వీటిలోనే కొద్దిపాటి మార్పులతో బెడ్‌ టెస్టర్‌, ఫర్నీచర్‌ టెస్టర్‌ అంటూ మళ్లీ రకరకాల ఉద్యోగాలున్నాయి.

ఇవీ ఉద్యోగాలే..

అద్దెకి బోయ్‌ఫ్రెండ్‌: జపాన్‌లో ఈ ట్రెండ్‌ పరుగులుపెడుతోంది. సరదాగా ప్రేమ కబుర్లు చెప్పడం అద్దె ప్రేమికుల పని
పెళ్లి బంధువులు: పెళ్లన్నాక హడావుడి ఉండాలిగా. చైనా, ఇండోనేషియా, జపాన్‌ల్లో ఈ అద్దె బంధువులు ఎక్కువ.
షాక్‌ ఇస్తాడు: పబ్‌లు, పార్టీల్లోకి వెళ్లి ఒళ్లు తెలియకుండా మత్తులో మునిగిపోయేవాళ్లు మెక్సికోలో ఎక్కువ. వాళ్ల మత్తు దించడానికి అక్కడ ‘ఎలక్ట్రిక్‌ షాక్‌ గివర్‌’లు ఉంటారు
కార్‌ ప్లేట్‌ బ్లాకర్‌: దిల్లీలోలాగే ట్రాఫిక్‌ తగ్గించడానికి ఇరాన్‌లో సరి, బేసి సంఖ్యలతో కార్లను రోడ్లపైకి అనుమతిస్తారు. అధికారులు, సీసీకెమేరాల కంట పడకుండా ఈ కార్‌ ప్లేట్‌ బ్లాకర్లు అడ్డుకుంటారు.
కుయ్‌డకర్రో: ఖరీదైన కార్లను బహిరంగప్రదేశాల్లో పార్క్‌ చేస్తే ఎవరైనా ఎత్తుకెళ్తారని, పాడు చేస్తారనే భయం ఉంటుంది. అది జరక్కుండా కాపలా కాసేవారే కుయ్‌డకర్రోలు. ఈ ఉద్యోగం ఫ్యూర్టారికోలో. 
ఏడుపుగొట్టు వాళ్లు: ఎవరి ఇళ్లలోనైనా విషాద సంఘటన జరిగినపుడు డబ్బులిస్తే ఏడవడానికి సిద్ధంగా ఉండేవాళ్లు. ఐరోపా దేశాల్లో ఇదీ మంచి ఉద్యోగమే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని