ఏ మరదల్ని చేసుకోనూ?

అత్త కూతుర్ని ప్రేమిస్తున్నా. ఆమెకీ నేనంటే ఇష్టం. ఆ అమ్మాయి అక్కని మా అన్నకిచ్చి పెళ్లి చేశారు. వదిన మంచిదేకానీ మా పెళ్లికి పరోక్షంగా అభ్యంతరం చెబుతోంది....

Published : 14 Jan 2016 15:54 IST

ఏ మరదల్ని చేసుకోనూ?


అత్త కూతుర్ని ప్రేమిస్తున్నా. ఆమెకీ నేనంటే ఇష్టం. ఆ అమ్మాయి అక్కని మా అన్నకిచ్చి పెళ్లి చేశారు. వదిన మంచిదేకానీ మా పెళ్లికి పరోక్షంగా అభ్యంతరం చెబుతోంది. అక్కాచెల్లెళ్లు తోడికోడళ్లుగా ఉండొద్దంటోంది. ఎందుకలా అంటే చెప్పదు. మరో విషయం. నేను ప్రేమిస్తున్న అమ్మాయికి మేనబావ ఉన్నాడు. అతడికిచ్చి చేయాలని ఆమె అమ్మానాన్నల పంతం. నాకూ మరదలుంది. ఈమెని చేసుకొమ్మని మా అమ్మానాన్నల పోరు. నేను ఎవరిని చేసుకోవడం కరెక్ట్‌?

- భాస్కర్‌, అమలాపురం

  అక్కాచెళ్లెళ్లు ఒకే ఇంట్లో తోడికోడళ్లుగా ఉండకూడదనే మీ వదిన లాజిక్‌ కరెక్ట్‌ కాదు. ఒకవేళ కుటుంబంలో ఏదైనా సమస్య తలెత్తితే ఇద్దరం నలిగిపోతామనో, వేర్వేరు కుటుంబాల్లో ఉంటే ఒకరైనా హాయిగా ఉంటారనో ఆమె ఆలోచన కావొచ్చు. ఆమె అభిప్రాయాన్ని అటుంచితే శాస్త్రరీత్యా మీరు ఎవరినీ చేసుకోకుండా ఉండటమే ఉత్తమం. వాళ్లిద్దరూ మీకు మేనమరదళ్లు. రక్త సంబంధీకులు. ఇలాంటి మేనరిక పెళ్లిళ్లను సైకాలజీలో consanguineous marriage అంటారు. లాటిన్‌లో కాన్‌ అంటే పంచుకోవడం. సాంగ్యూస్‌ అంటే రక్తం. పాతకాలంలో, ముస్లిం దేశాల్లో, గ్రామాల్లో, దిగువ మధ్యతరగతి, చదువులేని కుటుంబాల్లో ఇప్పటికీ ఇలాంటి వివాహాలు జరుగుతున్నాయి. వీటిక్కారణం కుటుంబాల మధ్య బంధుత్వం నిలిచిపోతుందనీ, ఎదుటివాళ్ల ఆర్థిక స్తోమతలు, అలవాట్లు, ప్రవర్తనలపై అవగాహన ఉంటుందనే. పైగా అబ్బాయి, అమ్మాయిలకు పెళ్లికి ముందే పరిచయం ఉండటంతో రెండు కుటుంబాలూ వీటికి ప్రాముఖ్యం ఇచ్చేవారు.

 కానీ మేనరికం పెళ్లిళ్లతో చాలా శారీరక, మానసిక, ఆరోగ్య సమస్యలున్నాయని జెనెటిక్స్‌, సైకియాట్రీ, సైకాలజీ సర్వేల్లో నిరూపితమైంది. మేనరికం చేసుకున్న దంపతులకు డౌన్‌సిండ్రోమ్‌ మానసిక న్యూనతలే కాకుండా ఇతర బుద్ధిమాంద్యతలు వచ్చే అవకాశాలున్నాయి. సంతానానికీ పుట్టుకతోనే లోపాలు, రకరకాల వ్యాధులు వచ్చే అవకాశాలూ ఎక్కువే అని తేలింది. ఈ ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఏ మరదలినీ చేసుకోకుండా ఉంటేనే మంచిది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు