సరదాలు, తిరుగుళ్లే ఎంజాయ్‌మెంటా?

ఉద్యోగం కోసం నగరానికొచ్చి ఓ హాస్టళ్లొ చేరా. ఇక్కడ కొంతమంది అమ్మాయిలు ఫాస్ట్‌గా ఉన్నారు. సాయంత్రం అయ్యిందంటే బయట బోయ్‌ఫ్రెండ్స్‌తో ....

Published : 06 May 2017 01:59 IST

సరదాలు, తిరుగుళ్లే ఎంజాయ్‌మెంటా?

* ఉద్యోగం కోసం నగరానికొచ్చి ఓ హాస్టళ్లొ చేరా. ఇక్కడ కొంతమంది అమ్మాయిలు ఫాస్ట్‌గా ఉన్నారు. సాయంత్రం అయ్యిందంటే బయట బోయ్‌ఫ్రెండ్స్‌తో బాతాఖానీలు. వారాంతాల్లో సినిమాలు, తిరుగుళ్లు. ఇది మంచి పద్ధతి కాదుగా, అని ఒకరిద్దర్ని అడిగిచూశా. ‘చిన్నచిన్న అవసరాలు తీర్చుకోవడానికి, జీవితాన్ని ఎంజాయ్‌ చేయడానికి ఇలాంటివి తప్పవు’ అన్నారు. నా హాస్టల్‌మేట్‌ ఈమధ్యే ఒకబ్బాయిని పరిచయం చేసింది. నాకు వాళ్ల దారిలో వెళ్లాలనిపిస్తోంది. మరోవైపు గిల్టీ ఫీలింగ్‌. ఈ గందరగోళం నుంచి బయటపడేదెలా?

- కె.ఎల్‌., కరీంనగర్‌

* భవిష్యత్తును గందరగోళంలో పడేసే బలహీనతలనే చాలా మంది ఆనందాలుగా భ్రమ పడుతుంటారు. జీవితం ప్రతిక్షణం ఆనందించాల్సిందే. చిన్నపాటి ఉద్యోగం చేయాల్సి రావడం కూడా ఆనందమే. కిందిస్థాయిలో ప్రారంభించి నైపుణ్యాలు పెంచుకుంటూ ఉన్నత స్థాయికి చేరుకోవడం గొప్ప ఆనందం. వీటితో పాటు జీవితంలో అన్నింటికంటే ముఖ్యమైనవి, అందరూ పాటింటిచాల్సినవి క్రమశిక్షణ, నైతిక విలువలు.

యుక్తవయసులో ఏర్పడ్డ పరిచయాలు థ్రిల్‌ కలిగిస్తాయి. ఉద్యోగంలో చేరిన తర్వాత వచ్చే ఆర్థిక స్వేచ్ఛ మనలో క్రమశిక్షణ అదుపు తప్పేలా చేస్తుంది. ఒకసారి ఆ ­బిలో కూరుకుపోతే బయటకి రావడం కష్టం. చుట్టూ ఉన్న సమాజం మనం ఏం చేస్తున్నామో అనుక్షణం పట్టించుకోకపోవచ్చు. మన అంతరాత్మ మాత్రం ఎప్పటికప్పుడు మనపై నిఘా పెడుతూనే ఉంటుంది. తప్పులు చేస్తే హెచ్చరిస్తుంది. మనసు మాట వినకుండా చేసే పనులు మనల్ని సమస్యల్లోకి నెట్టివేస్తాయి.

గతంలో మీకు అనువైన పరిస్థితి ఉండేది. మీ అమ్మానాన్నలు ప్రతి అవసరం తీర్చేవారు. ప్రస్తుతం కొత్త వాతావరణంలోకి అడుగుపెట్టారు. కొత్త జోన్‌లో ఇమడలేక కొందరు పారిపోవాలని చూస్తారు. ఇంకొందరు తమను తాము మైమరచి ఆ ప్రవాహంలో కొట్టుకుపోతారు. కొత్త చోట ఎదురయ్యే సమస్యల్ని అర్థం చేసుకోవడం, ఎదిరించి నిలబడటం... పరిష్కరించే సామర్థ్యం పెంచుకోవడం ఎవరికైనా అవసరం. అందుకు మనపై మనకు నియంత్రణ ఉండాలి. ఎప్పటికప్పుడు మనని మనం విశ్లేషించుకోవాలి. మన స్నేహితుల్ని బట్టి కూడా ఒక్కోసారి వ్యక్తితం మారిపోవచ్చు. అందుకే మంచి స్నేహితులను ఎంచుకోవాలి. ఒక్కసారిగా ఈ మార్పు సాధ్యం కాకపోయినా ప్రయత్నిస్తే సాధ్యమే.

ఆకర్షణలే మన జీవితాన్ని మలుపు తిప్పుతాయి. ఏది మంచో, ఏది చెడో... తెలుసుకోగలిగిన స్వీయ అవగాహన మీకుంది. సాటివాళ్లు వెళ్తొంది మంచిదారి కాదని తెలుసు. మీ అవసరాలు తీర్చుకోవాలంటే, ఖర్చులు మిగుల్చుకోవాలంటే పొదుపు చేయడం నేర్చుకోండి. మరింతగా సంపాదించాలని, జీవితంలో పైకెదగాలనే లక్ష్యం పెట్టుకోండి. ఉన్నత ఉద్యోగం, పెళ్లి ఈ రెండే మిమ్మల్ని జీవితంలో స్థిరపడేలా చేస్తాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని